ఆదివారం.. ఆదివారం ఆర్గానిక్ సంత!

రైతుల కోసం ఓ పాఠశాల పూర్వ విద్యార్థుల తపన. తాము చదువుకున్న స్కూలు ఆవరణలో ఏర్పాటు. 'ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి'ల పంట ఉత్పత్తుల అమ్మకాలు.;

Update: 2025-02-11 07:45 GMT
సేంద్రియ సంతలో కూరగాయల క్రయవిక్రయాలు

ఆరోగ్యంపై ఇప్పుడు చాలామందిలో శ్రద్ధ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్న ఆకాంక్ష అధికమవుతోంది. రసాయన ఎరువులకంటే సేంద్రియ ఎరువులతో పండించిన ఉత్పత్తులను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్న భావన పలువురిలో కలుగుతోంది. దీంతో వాటి వైపు ప్రజలు ఇప్పుడిప్పుడే ఆసక్తిని పెంచుకుంటున్నారు. ఇదిప్పుడు పట్టణాలు, నగరాల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పంట గిట్టుబాటు కాకపోయినా కొందరు రైతులు కూడా వీటి సాగును చేపడుతున్నారు. ఇలా ఆర్గానిక్ (సేంద్రియ) పంటలను ప్రోత్సహించడంతో పాటు ఆ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచాలని విశాఖలోని ఓ పాఠశాలను నిర్వహిస్తున్న థియోసోఫికల్ సొసైటీ సభ్యులతో పాటు ఆ స్కూలు పూర్వ విద్యార్థులు కొందరు సంకల్పించారు. ఇందుకోసం ప్రతి ఆదివారం తాము చదువుకున్న బడి ఆవరణలోనే వీరు సేంద్రియ సంతను ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంత కబుర్లేమిటో మీరూ తెలుసుకోండి..!

 

విశాఖ నగరంలోని జాతీయ రహదారి గురుద్వారా జంక్షన్కు చేరువలో వసంత బాల విద్యోదయ పాఠశాల ఉంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఆ స్కూలు పిల్లలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో బోసిపోతూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆదివారం కూడా ఆ బడి సందడిగానే ఉంటోంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే సేంద్రియ సంతలో అమ్మకందార్లు, కొనుగోలుదార్ల హడావుడి ఉంటుంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో సేంద్రియ సాగుతో పండించిన వివిధ రకాల పంటల ఉత్పత్తులను రైతులు ఈ ఆదివారం సంతకు తీసుకొస్తున్నారు. అక్కడ చిన్న చిన్న స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. ఈ సంగతి తెలుసుకుని నగర వాసులు ఈ సేంద్రియ సంతకు వచ్చి తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు.

 

ఈ సంతలో ఏముంటాయి?

ఈ సేంద్రియ సంతలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సేంద్రియ ఎరువులు వేసి పండించిన అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, బియ్యం, పప్పు దినుసులు, మసాలా దినుసులు, నూనెలు, పచ్చళ్లు, బెల్లం, వంటివన్నీ దొరుకుతాయి. వంకాయలు, దొండకాయలు, అరటికాయలు, బెండకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, క్యారెట్, బీట్రూట్, అల్లం, బంగాళాదుంపలతో పాటు బయట మార్కెట్లో అంతగా దొరకని బ్రకోలి, నూలుకోళ్లు, లవంగ చిక్కుడు, చమ్మ చిక్కుడు వంటి కూరగాయలు, కొబ్బరికాయలు లభిస్తాయి. ఇంకా ఆరోగ్యాన్నిచ్చే రెడ్, బ్రౌన్, బ్లాక్ రకాల బియ్యం, సింగిల్ పాలిష్ బియ్యం ఉంటాయి. అలాగే ఆకుకూరల్లో కొత్తమీర, అరుదైన ఎర్ర తోటకూర, ఆయుర్వేద గుణాలున్న గుంటకలవర ఆకు, కొండ పిండాకు, తమలపాకులు ఉంటాయి. ఇంకా గానుగ ఎద్దులతో ఆడించిన నువ్వుల నూనె, ఆర్గానిక్ ఉసిరి, టమోటా, గోంగూర, కొత్తిమీర పచ్చళ్లు, ఈ సీజనులో ఈ ప్రాంతంలో పండే వివిధ రకాల పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి.

 

వీటి ధరలెలా ఉంటాయి?

సాధారణంగా ఆర్గానిక్ ఉత్పత్తులంటే ధరలు ఎంతో ఎక్కువగా ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ ప్రస్తుతం మార్కెట్ ధరలతో పోల్చుకుంటే వీటి ధర స్వల్పంగానే ఎక్కువగా ఉంటుంది. కనిష్టంగా కిలోపై రూ.10-15, గరిష్టంగా 15-20 మించదు. ఆర్గానిక్ ఉత్పత్తుల ధరలపై అపోహలున్న వారు ఒకసారి ఇక్కడకు వచ్చి బేరీజు వేసుకుంటున్నారు. బయట మార్కెటంటే కిలోకు రూ.10-20 వరకు వ్యత్యాసం ఉన్నా ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు, ఇతర ఉత్పత్తులే బెటరన్న భావనతో ఈ సంతకొచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సేంద్రియ సంతలో 15 కౌంటర్లను ఏర్పాటు చేశారు. డిమాండ్ను బట్టి మున్ముందు వీటి సంఖ్యను పెంచనున్నారు. సగటున ఒక ఆదివారం 600 కిలోల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో కూరగాయలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. 'ఈ ఆదివారం సేంద్రియ సంతలో అన్నీ తాజా కూరగాయలే ఉంటున్నాయి. వీటి ధరలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొనుక్కుని వెళ్తున్నా'నని వైద్యారోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన జగన్నాథరావు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

అరుదైన ఆర్గానిక్ ఎర్ర తోటకూర

 

సేంద్రియ సేద్యంలో చదువుల కుటుంబం..

ఆదివారం జరుగుతున్న ఈ సేంద్రియ సంతలో విజయనగరానికి చెందిన ఓ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నర్సిపల్లి వెంకటరమణ, సునీత భార్యాభర్తలు, వారి కుమార్తె మౌల్య బీటెక్ మూడో సంవత్సరం, కుమారుడు శశాంక సుందర్ ఇంటర్ చదువుతున్నారు. తల్లిదండ్రులతో పాటు ఈ పిల్లలు ఇద్దరూ సేంద్రియ వ్యవసాయంలో పాలుపంచుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడులెలా సాధించాలన్న దానిపై అనుభవాన్ని గడించారు. ఆ అనుభవాన్ని ఆసక్తి ఉన్న వారికి పంచుతున్నారు. ఈ కుటుంబ సభ్యులంతా తమ పదెకరాల మామిడితోటలో సేంద్రియ సాగులో అంతరపంటగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, వేరుశనగ వంటి వాటితో పాటు వాటితో తయారు చేసిన చిరుధాన్యాల ఫుడ్స్ను కూడా ఆదివారం సేంద్రియ సంతలో విక్రయిస్తూ ఆకట్టుకుంటున్నారు.

సంతలో సేంద్రియ కూరగాయలు అమ్ముతున్న బీటెక్ విద్యార్థిని మౌల్య

 

15 ఎకరాల్లో సేంద్రియ సాగు..

నా పేరు వీర్నాల పార్వతి. మాది విశాఖ జిల్లా శొంఠ్యాం గ్రామం. మా ఊళ్లో 15 ఎకరాలు లీజుకు తీసుకుని రెండెకరాల్లో బీర, మిగతా భూమిలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నాం. మా గోశాల ఎరువు. బయోఫెర్టిలైజర్తో సేంద్రియ పంటలు పండిస్తున్నాం. మా పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయం లేక రైతు బజార్లు, ఇలాంటి సేంద్రియ సంతల్లో అమ్ముతున్నాం. ఇప్పుడిప్పుడే ఆర్గానిక్ పంటలపై జనానికి అవగాహన పెరుగుతోంది. ఆదివారం సేంద్రియ సంతలో మా ఆర్గానిక్ బీరకాయలు తెచ్చి విక్రయిస్తున్నాను. బయట మార్కెట్లో లోని రసాయన ఎరువులతో పండించిన బీరకంటే కిలోపై రూ.15 అధిక ధరకు అమ్ముతున్నాను.' అని మహిళా సేంద్రియ రైతు పార్వతి చెప్పారు.

 

పార్వతి

 

ఉన్నతోద్యోగం వదులుకుని..

ఆమె బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లో ఉన్నతోద్యోగిని. సేంద్రియ సాగుపై ఉన్న మక్కువతో ఆమె తన డైరెక్టర్ పదవికి స్వచ్ఛంద విరమణ చేశారు. అనంతరం సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకత, వాటి ఉత్పత్తుల వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. తాను చదువుకున్న వసంతబాల విద్యోదయ స్కూలు నిర్వాహకులు, కొంతమంది సాటి పూర్వ విద్యార్థులను కలుపుకుని పాఠశాల ఆవరణలో 'ఆదివారం సేంద్రియ సంత' ఏర్పాటుకు నడుం బిగించారు. 'రసాయన ఎరువులతో పండించే పంటలకంటే సేంద్రియ విధానంలో పండే పంటలకు దిగుబడి తక్కువగా ఉంటుంది.

సంధ్య

 

దీంతో రైతులకు అంతగా గిట్టుబాటు కాక సేంద్రియ సాగుపై ఆసక్తి చూపడం లేదు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల ఈ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం కావాలి. రైతుబజార్లలో వీటి విక్రయాలు పెరగాలి. దీంతో రైతుకు సేంద్రియ వ్యవసాయం లాభదాయకమవుతుంది. ప్రజలకు ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ లక్ష్యంతోనే సేంద్రియ సంత ఆలోచనకు శ్రీకారం చుట్టాం. ప్రతి కుటుంబానికి ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నట్టే రానున్న రోజుల్లో ప్రతి ఇంటికీ ఓ ఆర్గానిక్ రైతు ఉండాలన్నది మా సంకల్పం.' అని సేంద్రియ సంత ఏర్పాటుకు నడుం కట్టిన పూర్వ విద్యార్థి, బీఐఎస్ పూర్వ డైరెక్టర్ బి.సంధ్య 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.

Tags:    

Similar News