మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై సీపీకి పద్మ ఫిర్యాదు

అత్యాచారాలకు గురైన మహిళల పేర్లు వెల్లడించి వారిని మరింత కుంగి పోయేలా చేసిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వాసిరెడ్డి పద్మ కేసు పెట్టారు.

Byline :  The Federal
Update: 2024-11-02 08:50 GMT

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్లను మాధవ్‌ వెల్లడించారని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించడం దుర్మార్గమని ఆమె అన్నారు. చట్టరిత్యా ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వారు ఎంతో కుంగిపోయి ఉంటారని, వారి పేర్లు వెల్లడించడం వల్ల మరింత అవమానానికి వారు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా అక్కడ కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌పై వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ నాకు ఆప్తులని చెప్పారు. అంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనతో వాసిరెడ్డి పద్మ ఉన్నారని స్పష్టమవుతోంది. తెలుగుదేశం ఎంపీ నాకు ఆప్తుడని చెప్పడంతోనే ఆమె రాజకీయ భవిష్యత్‌ తెలుగుదేశం పార్టీతో ముడి పడి ఉందని స్పష్టమవుతోందని పలువురు అంటున్నారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళా కమిషన్‌ చైర్మన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ గత ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచన మేరకు తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఆ తరువాత పార్టీ ఓటమి పాలు కావడం, పలువురు నాయకులు పార్టీని వీడటంతో వైఎస్‌ జగన్‌ అంటే గిట్టడం లేదని, ఎవరి మాటా ఆయన వినటం లేదని చెప్పి వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు.
మహిళా చట్టాలపై ఆమెకు అవగాహన ఉంది. ఎందుకంటే ఆమె ఉమెన్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేయడం వల్ల మహిళల సాధక బాధకాలు తెలుసుకున్నారు. అత్యాచారాలకు గురైన చాలా మంది యువతులు, మహిళలను ఆమె పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. భవిష్యత్‌ను ఎలా నిర్మించుకోవాలో కూడా వారికి చెబుతూ వచ్చారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు. అత్యాచారానికి గురైన మహిళల పేర్లను ఒక మాజీ పోలీస్‌ అధికారి అయి ఉండి కూడా వెల్లడించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మాధవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.
Tags:    

Similar News