తిరుపతి: పాకిస్థాన్ అధికారి పేరిట హెచ్చరిక జారీ
ఓ వ్యక్తికి పాకిస్థాన్ నుంచి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. తిరుపతిలో కలకలం చెలరేగింది.;
Byline : The Federal
Update: 2025-05-07 07:59 GMT
పహల్ గావ్ మారడకాండకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం యుద్ధానికి దిగింది. ఇదే సమయంలో తిరుమలకు చెందిన ఓ వ్యక్తికి పాకిస్థాన్ ఐఎస్టీడీ నంబర్ తో కాల్ చేసి బెదిరించిన సంఘటన మంగళవారం ఉదయం కలకలం రేపింది.
"మీ కుటుంబాన్ని బాంబులతో అంతమొందిస్తాం" అనే ఫోన్ కాల్ హెచ్చిరిక సంచలనం రేకెత్తించింది. దీనిపై పగడాల త్రిలోక్ కుమార్ పోలీసులకు కూడా సమాచారం అందించాడని చెబున్నారు.
తిరుపతి పోలీస్ కంట్రోల్ రూం నుంచి వచ్చిన పోలీసులు బాధితుడు త్రిలోక్ కుమార్ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. వివరాలు కూడా నమోదు చేసుకున్నారు.
"ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు" అని అలిపిరి ఎస్ఐ నాగార్జనరెడ్డి చెప్పారు. తిరుమల పోలీసులు కూడా ఇదే చెప్పారు. ఇదిలాఉండగా,
భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చిన భారత సైనికుల ధైర్యం పై ప్రశంసలు వెల్లువెత్తుతున్న పరిస్థితుల్లో... ఆకస్మాత్తుగా ఉదయం 10:27 గంటలకు తిరుమల జనసేన కార్యకర్తగా పనిచేస్తున్న పగడాల త్రిలోక్ కుమార్ కు పాకిస్తాన్ నంబర్ సెల్ నంబర్ నుంచి ఫోన్ కాల్ రావడం సంచలనం కలిగించింది.
" ఈ +92 32925 27504 నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది" అని పగడాల త్రిలోక్ కుమార్ చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే..
"గుర్తు తెలియని వ్యక్తి తనతో హిందీలో మాట్లాడాడు.. ఉదయం 10.30 గంటలకు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ విషయంపై అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాను" అని త్రిలోక్ కుమార్ చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి పాకిస్థాన్ ఐఎస్డీ కోడ్ నంబర్ నుంచి కాల్ చేశాడు. తనలో ఇలా మాట్లాడాడు అని త్రిలోక్ కుమార్ వివరించారు.
"నీ పేరు త్రిలోక్ కుమార్ పగడాల అవునా? మీ అబ్బాయి పేరు ఇదేనా? అన్నారు? కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పి మీరేం చేస్తున్నారు? మాకు తెలుస్తోంది. జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబ సభ్యులను మొత్తం మీ ఇంటిపై బాంబు వేసి మరి పేల్చేస్తాం" అని బెదిరింపులకు పాల్పడ్డాడు. నేను హిందీ మాట్లాడగలను, తాను పాకిస్తాన్ అధికారి చెప్పిన వ్యక్తితో సుమారు కొన్న నిమిషాల పాటు హిందీలోనే సమాధానం ఇచ్చాను" అని త్రిలోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"మీ పాకిస్తాన్ వాళ్లు మా భారతీయులు 28 మందిని చంపితే.. మా భారత సైన్యం మీ పాకిస్థానీయులను 300 మందిని చంపింది. అది గుర్తుపెట్టుకోండి" ఏమనుకుంటున్నారు మా ధైర్యాన్ని అంత తేలిగ్గా ఏమి చేయలేరు అని నేను కూడా ధీటుగానే సమాధానం ఇచ్చానని త్రిలోక్ కుమార్ వివరించారు.
100 కు సమాచారం
తనకు పాకిస్థాన్ అధికారి అని ఫోన్ చేయడంతో పాటు బెదిరించిన విషయాన్ని వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాను అని జనసేన కార్యకర్త త్రిలోక్ కుమార్ చెప్పారు. వెంటనే స్పందించిన పోలీస్ కంట్రోెల్ రూం అధికారులు పగడాల త్రిలోక్ కుమార్ ను సంప్రదించారు. ఆయన నుంచి వివరాలు తీసుకున్నారు. త్రిలోక్ కుమార్ తిరులకు చెందిన వ్యక్తి కావడంతో ఆ ఫోన్ కాల్ ను పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
పోలీసులు అప్రమత్తం
తిరుమల, తిరుపతికి ప్రపంచ వ్యాపితంగా గుర్తింపు ఉంది. పాకిస్థాన్ అధికారి పేరిట వచ్చిన ఫోన్ కాల్ వల్ల పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. తిరుపతి తోపాటు తిరుమలలో కూడా భద్రత మరింత కట్టదిట్టం చేశారు.