బాబన్నా.. నువ్వు కరుణిస్తే ఎమ్మెల్యే అవుతా!

ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలి. అవకాశం కోసం కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఆరాటపడుతున్నారు.

Update: 2024-03-29 03:05 GMT
చంద్రబాబు, పనబాక లక్ష్మీ

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఎంపీగా పోటీ చేసేందుకు దారులు మూసుకుపోయాయి. టీడీపీ తరపున ఏదో ఒకచోట నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. అక్కడ కూడా టికెట్ లభించడం కష్టంగానే ఉంది. కిం కర్తవ్యం!? ఆమె కాంగ్రెస్‌లోకి వెళతారని వార్తలు వెల్లువెత్తున్నాయి. వీటిపై స్పందించిన ఆమె వార్తలను తోసిపుచ్చుతున్నారు. అయితే ఆమె సుళ్లూరుపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ అందుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. టీడీపీ మాత్రం సుళ్లూరుపేట అభ్యర్థిగా నెలవల విజశ్రీని ప్రకటించింది. ఇప్పుడు అక్కడి నుంచి బరిలో దిగాలని లక్ష్మీ కోరుకుంటున్న క్రమంలో..  సూళ్లూరుపేటలో అభ్యర్థిని మార్చి ప్రయోగం చేసే సాహసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేస్తారా? మాజీ మంత్రి పనబాక లక్ష్మికి సీట్ దక్కుతుందా? ఇప్పటికే పేరు ప్రకటించిన అభ్యర్థి పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇద్దరు వ్యక్తుల ఆలోచన ఒకేలా ఉండదు.. మన చేతి వేళ్లు కూడా ఒకేలా ఉండకపోవడం దానినే సూచిస్తుందని పెద్దలు అంటుంటారు. అదే విధంగా రాజకీయాల్లో కూడా కొందరి నాయకుల తీరు ఇతరులతో పోలిస్తే మరో రకంగా ఉంటుంది. ప్రజల సమస్యలు పట్టించుకోరు. వాళ్లతో కలవరు. అధినేతల చుట్టూ పరిభ్రమిస్తుంటారు. దీనివల్ల అధినాయకులు వారిని ఉపేక్షిస్తుంటారు. ఇది కాస్తా ఆ నాయకులకు శాపంగా మారుతోంది. ఆ కోవలో అనేక మంది నాయకులు ఉన్నారు. వారిలో.. కేంద్ర మంత్రిగా అనేక పదవులు నెరిపిన వ్యక్తిగానే కాకుండా, ఆరు సార్లు ఎంపీగా పోటీ చేసి నాలుగుసార్లు విజయకేతనం ఎగరవేసిన పనబాక లక్ష్మి కూడా ఒకరు.

ప్రస్తుతం ఆమెది మళ్లీ టికెట్ దక్కించుకోలేని పరిస్థితి. దీంతో టీడీపీలో సీనియర్ లీడర్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆమె రాజకీయ గమనాన్ని ఒకసారి పరిశీలిస్తే.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో 1958 అక్టోబర్ 6 తేదీన జన్మించిన పనబాక లక్ష్మి.. ఆంధ్ర యూనివర్సిటీలో 1981- 83 లో ఎంఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్‌లో చదివారు. ఐఆర్టిఎస్ అధికారి పనబాక కృష్ణయ్యతో ఆమెకు వివాహం జరిగింది. కృష్ణయ్య దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రమైన సికింద్రాబాద్‌లో చీఫ్ పిఆర్ఓగా పనిచేసేవారు.

కాంగ్రెస్ ఎంపీగా..

ఉన్నత విద్యావంతురాలయిన పనబాక లక్ష్మి.. నెల్లూరు ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంటు నుంచి 1996, 1998, 2004లో పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2012 వరకు ఆమె అనేక కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఆమె స్థానికేతర వ్యక్తి అయినప్పటికీ బాపట్ల రిజర్వ్ సీట్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ ప్రస్థానం మొత్తం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే సాగించడం ప్రధానమైనది.

భార్యకు తోడుగా..

2004 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. దివంగత సీఎం డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విధానాలు, పథకాలతో కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపించారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో పనబాక లక్ష్మి.. బాపట్ల ఎస్‌సి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజకీయాలపై ఆసక్తితో ఆమె భర్త కృష్ణయ్య.. రైల్వే చీఫ్ పిఆర్ఓ ఉద్యోగానికి రాజీనామా చేసి గూడూరు ఎస్సీ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అంతవరకు మిగతా వారి రాజకీయ ప్రస్థానం సవ్యంగా సాగింది. సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోవడంతో రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించాయి. అప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి మొత్తం తిరగబడింది.


రాష్ట్ర విభజన తర్వాత

తిరుపతి ఎస్సీ రిజర్వు పార్లమెంటు స్థానం నుంచి 2014లో పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాతర వేశారు. గత్యంతరం లేని స్థితిలో అనేక మంది వివిధ పార్టీలకు మారారు. ఆ కోవలోనే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి.. టిడిపిలోకి వెళ్లి ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుతో కండువా కప్పించుకున్నారు.

కలిసొచ్చిన అదృష్టం

2019 ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో బిజెపి-జనసేన కూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికలో పనబాక లక్ష్మి.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిల్చుని ఓడిపోయారు. ఇక్కడ నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాద్ విజయం సాధించారు. అకస్మాత్తుగా ఆయన మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తిపై పోటీ చేసిన పనబాక లక్ష్మి 32 శాతం ఓట్లు (3,54,,516) సాధించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి 6,26,108 ఓట్లతో విజయం సాధించారు.

ఇప్పుడేమైంది..

గత ఎన్నికల తర్వాత కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి జనంలో కనిపించిన సందర్భాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. 2024 ఎన్నికల నేపథ్యంలో టీడీపీ -జనసేన - బీజేపీ కూటమి పొత్తు వల్ల ఆమెకు తిరుపతి, నెల్లూరు పార్లమెంటు స్థానాలు దక్కే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే పొత్తులో భాగంగా తిరుపతి పార్లమెంటు సీటును బిజెపికి కేటాయించారు. నెల్లూరులోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటు కూడా పనబాక లక్ష్మికి లభించడం కష్టమైంది.

ఎన్నో ఆశలు.. ఎంపీకి మూసుకుపోయిన దారులు

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఎంపీగా పోటీ చేయడానికి దారులు మూసుకుపోయాయి. అయినా ఎస్సీ రిజర్వుడ్ శాసనసభ స్థానాలు అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ఆమె గూడూరు శాసనసభ స్థానంతో పాటు అదే జిల్లాలోని సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గాలపై ఆశలతో ప్రయత్నాలు సాగించారు. గత ఐదు సంవత్సరాలుగా పార్టీకి కష్టకాలంలో కూడా కార్యక్రమాలు సాగించిన పాశం సునీల్ కుమార్‌కు గూడూరులో టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. సత్తి బడి నియోజకవర్గంలో తిరుపతి మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం విజయశ్రీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం.. 1990 నుంచి 2004 వరకు తిరుపతి ఎంపీగా పనిచేశారు. అప్పట్లో ఆయన 52,336 ఓట్లతో విజయం సాధించారు.

కాంగ్రెస్‌లోకి వెళ్తారా..?

కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ఏ పార్టీలో అవకాశాలు లేని స్థితిలో కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం వైరల్ అవుతోంది. పీసీసీ చీఫ్‌గా దివంగత సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల రావడంతో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఉంటుందన్న భావనలో లక్ష్మి ఉన్నట్టు తెలిసింది. ఈ వార్తలను కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికగా ఖండించారు. తాను పార్టీ మారబోవడం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు.

సూళ్లూరుపేటకు లక్ష్మి?

నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది) సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ, ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి టిడిపి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. నెలవల సుబ్రహ్మణ్యం.. 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆయన ఆరోగ్య స్థితి బాగా లేదన్న కారణంతో కుమార్తె విజయశ్రీ పేరును ప్రకటించారు.ప్రస్తుతం సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తున్నారు. ఈయనకు గట్టిపోటీ ఇవ్వడానికి టిడిపి.. విజయశ్రీ అభ్యర్థిత్వంపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ అభ్యర్థిని మార్చడానికి సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ ఇక్కడి నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈమెకు స్థానికేతర సమస్య ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News