జనసేనకు భారీ షాక్.. షెడ్యూల్ ముందు కీలక నేత గుడ్‌బై

రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనగా జనసేనకు భారీ షాక్ తగిలింది. అనకాపల్లి ఇన్‌చార్జ్ పరుచూరి ప్రభాకర్ పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు.

Update: 2024-03-15 12:25 GMT
Source: Twitter


అసెంబ్లీ ఎన్నికలకు ఆంధ్ర సంసిద్ధమైంది. అన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి రెడీయ్యాయి. ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసి పలు ప్రాంతాల్లో మీటింగ్‌లు నిర్వహిస్తూ పరోక్షంగా ప్రచారాన్ని ప్రారంభించేశాయి. తమ అభ్యర్థుల జాబితాను కూడా ఒకరి తర్వాత ఒకరుగా పోటీ పడుతూ విడుదల చేస్తున్నారు. తాజాగా టీడీపీ తమ రెండో జాబితాను ప్రకటించగా, బీజేపీ-జనసేన కూడా తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులను కూడా పార్టీలు ఖరారు చేసేశాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.

రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సమయంలో జనసేనకు భారీ షాక్ తగిలింది. కీలక నేత, అనకాపల్లి ఇన్‌చార్జ్ పరుచూరి భాస్కరరావు.. పార్టీని వీడాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. పార్టీ వైఖరితో తీవ్ర నిరాశ చెందానని, అందుకే పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యానని పరుచూరి భాస్కరరావు చెప్పారు. పార్టీ కోసం ఎంతో కష్టపడినా తనకు గుర్తింపు లభించలేదని, అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నానని స్పష్టతనిచ్చారు.

టికెట్ దొరకనందుకేనా..

అనకాపల్లి నియోజకవర్గం జనసేన ఇన్‌చార్జ్‌గా పరుచూరి భాస్కరరావు విధులు నిర్వర్తించారు. అనకాపల్లి టికెట్ తనకే దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం జనసేనకే వచ్చింది. కానీ జనసేన అధిష్టానం మాత్రం అనూహ్యంగా అనకాపల్లి టికెట్‌ను మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అందించారు. ‘‘పార్టీ కోసం నేనెంత కష్టపడ్డానో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు బాగా తెలుసు. అనకాపల్లి టికెట్‌ను నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన కొణతాలకు ఇచ్చి పార్టీ నాకు ఎంతో అన్యాయం చేసింది. ఈ విషయంపై మాట్లాడానికి పవన్‌ కల్యాణ్‌ను కలుద్దామని ఎన్నో సార్లు ప్రయత్నించాను. కానీ అపాయింట్‌మెంట్ లభించలేదు. తీవ్ర నిరాశ చెందాను. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు పరుచూరి.

అయితే జనసేనకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న పరుచూరి.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారన్నది అనకాపల్లిలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆయన వైసీపీలో చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు భావిస్తుంటే స్వతంత్రంగా ఎన్నికల బరిలో నిల్చున్నా పరుచూరి విజయం సాధిస్తారని, కాబట్టి ఆయన ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తారని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా తన భవిష్యత్ కార్యాచరణపై పరుచూరి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. తన అనుచరులతో చర్చించి మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News