పాస్టర్ ప్రవీణ్ పగడాల బయలుదేరిన హైదరాబాద్ నుంచి ప్రమాదం జరిగిన రాజమండ్రి వరకు అన్ని వివరాలను సేకరించాం. సీసీ ఫుటేజీలను సేకరించాం. వీటిని ఫోరెన్ సిక్ ల్యాబ్‌కు పంపించాం. ప్రవీణ్ పగడాల మరణం అనేక అనుమానాలు, ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో దర్యాప్తు చాలా పగడ్బంధీగానే చేపట్టాం. ఎక్కడా ఏ క్లూ దొరికినా దానిని పరిశీలనకు తీసుకోవడం జరిగింది. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదల్లేదు. అందువల్లే ఈ కేసును దర్యాప్తు చేయడానికి చాలా రోజులు పట్టింది. నిజనిజాలు నిర్థారించడానికి సమయం పట్టింది. అయితే రామవరప్పాడు జంక్షన్ వద్ద మాత్రమే సీసీ ఫుటేజీ లభించలేదు. పాస్టర్ ప్రవీణ్ ఫోన్ రికార్డులను కూడా పరిశీలించాం. ఆయన ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను కూడా గుర్తించాం. దర్యాప్తులో భాగంగా మృతుని కుటుంబ సభ్యులను కూడా విచారించాం. అన్ని రకాల కోణంలోను, లభ్యమైన అన్ని ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రవీణ్ పగడాలది ప్రమాద వశాత్తు జరిగిన మరణమే అని నిర్థారణ అయినట్లు డీఐజీ అశోక్‌కుమార్ తెలిపారు.
అయితే ప్రవీణ్‌ది హత్య అని, ఎవరో ఆయనను హత్య చేశారని, అనుమానాస్పద మృతి అని రకరకాల ప్రచారాలు కొంత మంది చేశారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారికి కూడా నోటీసులు ఇచ్చి, వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రికి వస్తున్నారనే విషయం ఆయన కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ప్రయాణ మార్గంలో ఆరుగురితో ప్రవీణ్ మాట్లాడారు. మూడు చోట్ల మద్యం కొనుగోలు చేశారు. లిక్కర్ షాపుల్లోను, పెట్రోలు బంకుల్లోను యుపీఐ ద్వారా చేసిన లావాదేవీలను కూడా సేకరించాం.
అంతేకాకుండా మార్గ మధ్యలో ఒక పోలీసు అధికారి ప్రవీణ్‌తో మాట్లాడారు. మద్యం తాగి ప్రయాణం చేయొద్దని ఆ పోలీసు అధికారి ప్రవీణ్‌ను వారించారు. అయినా ప్రవీణ్ లెక్క చేయలేదు. పోలీసు అధికారి మాటలు వినకుండా ప్రవీణ్ ప్రయాణించారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రవీణ్ ప్రయాణంలో మూడు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదంలో బుల్లెట్ హెడ్‌లైటు కూడా పగిలి పోయి డ్యామేజ అయ్యింది. అయినా ఆగకుండా సిగ్నల్ లైట్ వేసుకుని ఆయన ప్రయాణం కొనసాగించారు. ముందుగానే ఆయన మద్యం సేవించి ఉండటం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రవీణ్ మరణించారని డీఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. చాలా సుదీర్ఘంగా దర్యాప్తు చేపట్టిన ఈ కేసుకు ఇంతటితో ముగింపు పలకాలని, దీనిపైన సోషల్ మీడియాలో ఎలాంటి అవాస్తవ వ్యాఖ్యలు చేయడం కానీ, మాట్లాడటం కానీ చేయొద్దని ఆయన కోరారు.