పరిశోధక విద్యార్థిలాగా పవన్‌ కల్యాణ్‌

నిత్యం సినీమాలు, స్క్రిప్టులు, డైలాగులు, పాటలు, డాన్సులు, ఫైట్‌లతో షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉండే పవన్‌ కల్యాణ్‌ అధికారంలోకి రావడంతో శాఖలతో కుస్తీ పడుతున్నారు. పరిశోధక విద్యార్థిగా మారి పోయారు.

Byline :  The Federal
Update: 2024-07-13 13:15 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలోని మిగిలిన మంత్రుల పరిస్థితి ఒకటైతే, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ది మరొక పరిస్థితి. పదేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నా పాలనకు మాత్రం కొత్తే. పూర్తి స్థాయి రాజకీయాల్లో వస్తున్నట్లు ప్రకటించినా, ఎక్కువుగా సినీమా షూటింగ్‌లతోనే బిజీగా ఉండే వారు. మధ్య మధ్యలో, సమయం దొరికినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూ వచ్చారు. 2024 ఎన్నికల సమయంలో మాత్రం తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. షూటింగ్‌లకు కొంత కాలం విరామమిచ్చి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫలితాలు అనుకూలంగా రావడం, భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎం చంద్రబాబు తర్వాత ప్రభుత్వంలో కీలకంగా మారి రెండో స్థానంలో ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ షెడ్యూల్‌ను మార్చుకున్నారు. ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో షెడ్యూల్‌ మారి పోయింది. తనకు కేటాయించిన శాఖలపై పట్టు పెంచుకునేందుకు దృష్టి సారించారు. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్‌ వాటర్‌ సప్లై, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అంట్‌ టెక్నాలజీ శాఖలను పవన్‌ కల్యాణ్‌కు కేటాయించారు. ఇవి తనకు ఇష్టమైన శాఖలని కూడా ఆయన ప్రకటించారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే పవన్‌ కల్యాణ్‌ ఒక పరిశోధక విద్యార్థిలాగా మారి పోయారు. శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడంలో లీనమయ్యారు. లోతుగా అ«ధ్యయనం చేయడానికి సమయం వెచ్చిస్తున్నారు. ప్రతీ శాఖ, దాని ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలు, సమస్యలు తదితర అంశాలపైన అధికారులతో ప్రత్యేకంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇప్పించుకుంటూ సంబంధిత అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో లీనమయ్యారు. ఒక పక్క శాఖకు సంబంధించిన అంశాలను తెలుసుకుంటూనే మరో వైపు అందులోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి సమస్యలను కూడా తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం గంటలు కాదు రోజుల తరబడి సమయాన్ని వెచ్చిస్తున్నారు. అందరితో సమావేశాలు నిర్వహిస్తూ గంటల తరబడి కూర్చుని, ఒపికగా వింటూ అధికారులను సైతం ఆశ్చర్య పరుస్తున్నారు.
సీఎం చంద్రబాబు మంత్రి వర్గంలో ఎడతెరపి లేకుండా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నది మంత్రి పవన్‌ కల్యాణ్‌ మాత్రమే అనే టాక్‌ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నో రకాల ఫైల్స్‌ చూడాల్సి వస్తోందని, ఈ ఫైల్స్‌ కాస్తా క్లిష్టంగా ఉన్నాయని, వీటిని అధ్యయనం చేస్తున్న క్రమంలో తనకు చదువు విలువ ఇప్పుడు తెలిసి వస్తోందని, తాను ఇంకా చదువుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేదని, పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసి ఉన్నా, కనీసం డిగ్రీ వరకైనా చదువుకుని ఉంటే ఫైళ్లను సులువుగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేదనే భావనను పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగానే వ్యక్తం చేశారు.
దీంతో పాటుగా తను ఫైళ్ల పట్ల ఎందుకు శ్రద్ధ పెడుతున్నాననే విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రతి ఫైల్‌ను క్లీయర్‌గా చదువుతున్నానని, అందులో ఏముందో తెలుసుకోకుండా సంతకం చేసేస్తే తర్వాత అందులో తప్పులు ఉండి తాను జైలుకెళ్ళాల్సిన పరిస్థితులు వస్తే తర్వాత పరిస్థితులు తారుమారు అవుతాయని ప్రజల సమక్షంలోనే వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ పరిశోధక విద్యార్థిలా మారి పోయారని, ప్రతి అంశాన్ని కూలంకుశంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారనే టాక్‌ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News