ఇంటి కోసం 12 ఎకరాలు కొన్న పవన్‌ కళ్యాణ్‌

సోమవారం పిఠాపురం పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తన సొంత పనిని కూడా పూర్తి చేసుకున్నారు.

Update: 2024-11-06 05:10 GMT

ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున ఇంటిని నిర్మించనున్నారు. సొంత నియోజక వర్గమైన పిఠాపురంలో సొంత గృహాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ సిద్ధం చేస్తున్నారు. తాను ఇల్లు కట్టుకునేందుకు చిన్న స్థలం సరిపోదని, కనీసం రెండు ఎకరాలైనా కావాలని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే చాలా బాగుంటుందని ఎన్నికల సమయంలో పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. దాని కంటే ముందు తాను పిఠాపురం వదిలిపెట్టి పోనని, ఇక్కడే సొంత ఇల్లు కట్టుకుంటాని, పిఠాపురం వాసులకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలుత జూలై నెలలోనే భూములను కొనుగోలు చేశారు. భోగాపురం రెవిన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడ రెవిన్యూ పరిధిలో 2.08 ఎకరాలు కొనుగోలు చేశారు. సోమవారం పిఠాపురం పర్యటనకు వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ భూమి కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన భూమి సరిపోదని ఇంకా కావాలనే ఉద్దేశంలో ఉన్న ఆయన ఇది వరకు కొనుగోలు చేసిన ప్రాంతాల్లో భూములను చూశారు. మరో 12 ఎకరాలను కొనుగోలు చేశారు. సోమవారం ఓకే చేయడంతో పాటు కొనుగోలు కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ వంటి ఇతర ప్రక్రియ అంతా ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ తోట సుధీర్‌ మంగళవారం పూర్తి చేశారు. ఈ స్థలంలో పెద్ద ఎత్తున సొంత ఇంటితో పాటు క్యాంపు కార్యాలయం, జనసేన పార్టీ ఆఫీసును నిర్మించనున్నారు. వాటికి సంబంధించిన ప్లాన్‌లను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలిసింది.

Tags:    

Similar News