పవన్ కల్యాణ్ పోటీపై వీడిన సస్పెన్స్..

అసెంబ్లీ ఎన్నికల్లో తానెక్కడి నుంచి పోటీ చేయనున్నది పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎంపీగా పోటీపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

Update: 2024-03-14 10:12 GMT
Source: Twitter


ఆంధ్రలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. ప్రతి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నేతలు ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిల్చోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అందులో గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన జనసేన పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి ఎన్నికల బరిలో నిల్చుంటారన్నది అత్యంత సస్పెన్స్‌గా ఉంది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయనున్నది పవన్ స్వయంగా ప్రకటించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

అక్కడి నుంచే పవన్ పోటీ

త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. ‘‘నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదు’’అని స్పష్టం చేశారు. పిఠాపురం ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జగన్‌ను ఇంటికి పంపేయాలని, అందుకు సరైన సమయం కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు.

అయితే కొంత కాలం నుంచి పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశం ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉంది. కొంతమంది మళ్ళీ భీమవరం నుంచే ఆయన ఎన్నికల్లో నిలబడతారంటే మరికొందరు మాత్రం గాజువాక, పిఠాపురం, భీమవరం స్థానాలను పవన్ పరిశీలిస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంతలోనే కేంద్ర కేబినెట్‌లో స్థానం సంపాదించాలన్న ఆలోచనతో ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. దీంతో పవన్ పోటీపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ వదంతులను పవన్ తన అధికారిక ప్రకటనతో పటాపంచలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుంచే పోటీ చేస్తానని తెలిపారు.

మార్పు కోసమే రాజకీయాల్లోకి

తాను రాజకీయాల్లోకి అధికారాన్ని అనుభవించడానికి రాలేదని రాష్ట్రంలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘‘పార్టీని 150 మందితో ప్రారంభించాం. ఇప్పుడు 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు పార్టీలో ఉన్నారు. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇవ్వడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎవరూ బతకకూడదు.. మా గుంపే బతకాలని అనుకుంటే కుదరదు. జగన్ అంటే నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. మమ్మల్ని తొక్కేస్తాం అంటే మేము కూడా మిమ్మల్ని తొక్కేస్తాం’’అని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు తన కుటుంబం మొత్తాన్ని ఇబ్బందిపెడతారని చాలా మంది భయపెట్టారని గుర్తు చేశారు.

నాపై దాడి జరిగిందో..

అందరూ చట్టాలు చెప్పేవారే కానీ పాటించేవారు లేరని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అధికారంలో ఉన్న వాళ్లు ఇంత దారుణాలకు పాల్పడతారా అనిపిస్తోంది. నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో అది మీ ఊహలకే వదిలేస్తున్నానంటూ హెచ్చరించారు. ‘‘ప్రజల కష్టాలు, కన్నీళ్లు నావే అనుకుని పనిచేస్తున్నా. నటుడిగా, ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా నేను తెలుసు. తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప.. నాశనం కాము. అప్పులు తెచ్చి సంక్షేమాల పేరిట పంచితే శ్రీలంకలో అధ్యక్షుడి భవనానికి పట్టిన గతే తాడెపల్లి ప్యాలెస్‌కూ పడుతుంది. శ్రీలంక అధ్యక్షుడి దుస్థితే ముఖ్యమంత్రికి కూడా వస్తుంది. అలా జరగదని సీఎం ఏం గ్యారెంటీ ఇస్తారు’’అని ప్రశ్నలు గుప్పించారు.


Tags:    

Similar News