పవన్ కల్యాణ్ పుస్తక ప్రియుడే..బుక్ ఫెయిర్‌లో ఎన్ని కొన్నారంటే
విజయవాడ బుక్ ఫెయిర్‌లో భారీగా పుస్తకాలు కొన్న పవన్ కల్యాణ్.;
ఒకటి కాదు రెండు కాదు లక్షలాది పుస్తకాలు చదివానని, శ్రీశ్రీ, బాలగంగాధర్ తిలక్ కవితలను తన స్పీచ్‌లలో అప్పుడప్పుడు ఉటంకించే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆల్ ఆఫ్ సడెన్‌గా శనివారం విజయవాడ పుస్తక ప్రదర్శనలో దర్శనమిచ్చారు. విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో పుస్తక ప్రదర్శన కొనసాగుతోంది. దాదాపు 250కి పైగా బుక్ స్టాల్స్‌ను నిర్వహాకులు ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నర గంటల సేపు పుస్తక ప్రదర్శనలో కలియ తిరిగిన పవన్ కల్యాణ్, నిర్వాహకులతో కూడా మాట్లాడారు. చట్టాలు, చరిత్ర, పాలిటిక్స్, పబ్లిక్ పాలసీ, సైన్ అండ్ టెక్నాలజీ, వ్యవసాయం, అడవులు, వృక్ష సంపద వంటి రంగాలకు సంబంధించిన పుస్తకాలను ఆయన పరిశీలించారు. వీటితో పాటు తెలుగు సాహిత్యం, తెలుగు అనువాద సాహిత్యం, నిఘంటువులు, ఆధ్యాత్మికత వంటి అంశాలకు సంబంధించిన పుస్తకాలను కూడా ఆయన పరిశీలించి కొనుగోలు చేశారు. ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం చూసి సంతోషంచిన ఆయన.. డాక్టర్ విక్టర్ ఈ ఫ్రాంకిల్ రాసిన ఈ పుస్తకం చదివితే నిరాశ నిస్ప్రుహలను అధికమించి ఆశావాద భావన కలుగుతుందని, తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పుస్తకం ఎంతో ధైర్యాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. సన్నిహితులకు బహుమతిగా ఇచ్చేందుకు అధిక సంఖ్యలో ఈ పుస్తకాన్ని కొనుగోలు చేశారు.