త్యాగాలకు అలవాటు పడ్డ పవన్‌కళ్యాణ్
బీజేపీ కోసం జనసేన త్యాగం చేసినట్లుంది. ఏమిటా త్యాగం. ఎందుకు చేసింది. ఎన్‌డీఏ కూటమిలోకి ఎలాగైనా టీడీపీని చేర్చాలనుకున్న పవన్‌కళ్యాణ్ కోర్కె నెరవేరింది.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-03-12 04:10 GMT
ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల చిక్కులకు తెరపడింది. బీజేపీ కూటమిలో తెలుగుదేశం చేరటంతో పాటు ఎవరికి ఎన్ని సీట్లో తేల్చేసింది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకో 50 మందిని ప్రకటిస్తే సరిపోతుంది. బీజేపీ మాత్రం రానున్న ఎన్నికల్లో జాక్ పాట్ కొట్టిందని చెప్పొచ్చు. ఏకంగా ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తోంది. పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ఖరారు చేయాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో నాలుగు సీట్లు టీడీపీ పొత్తుతో బీజేపీ సాధించింది.
ఎక్కడ తగ్గాలో తెలిసిన పవన్
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు టీడీపీ కేటాయించింది. అయితే సుదీర్గ చర్చల్లో బీజేపీ కోసం జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. ఏకంగా రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు మూడు అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇచ్చింది. బీజేపీ, జనసేనలు రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది.
పొత్తులతో జగన్‌కు చుక్కలు చూపిద్దాం..
పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సర్థుబాటు పూర్తయింది. వెంటనే అభ్యర్థులను ప్రకటించి జగన్‌కు వణుకు పుట్టించాలి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దెబ్బకు దిమ్మ తిరగాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో మనం ఓటర్లను ఆకర్షించలేమని నాయకుల మధ్య ఆసక్తికర చర్చ సాగినట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు నివాసంలో జరిగిన చర్చలో బీజేపీ ముఖ్య నాయకులతో పాటు పవన్‌కళ్యాణ్, బాబులు పాల్గొన్నారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు మకాం వేసిన వచ్చిన నేతలు ఎవరికి ఎన్ని సీట్లనేది తేల్చారు. ఎక్కడెక్కడ అనేది కూడా తేల్చారు. వెంటనే అభ్యర్థులను ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు.
జన సైనికుల్లో అసంతృప్తి
రానున్న ఎన్నికల్లో తమను ఓటర్లు ఆదరిస్తారనుకుని కొన్ని నియోజకవర్గాల్లో జన సైనికులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. వారి ఆశలపై పవన్‌కళ్యాణ్ నీళ్లు చల్లారు. 60 అసెంబ్లీ సీట్ల డిమాండ్ నుంచి 21 సీట్లకు పరిమితం అయ్యారు. ఇది జనసేన నాయకుల్లో అసంతృప్తికి దారి తీసింది. మొదట 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్న జనసేన ఎలాగైనా మరో ఆరు సీట్లు సంపాదించి 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని జన సైనికులు భావించారు. అయితే వారి ఆశలు నెరవేరలేదు. ఎవరైనా నిరసన గళం వినిపిస్తే బయటకు పంపిస్థానని ఇప్పటికే జనసేన అధినేత ప్రకటించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో జనసైనికులు ఉన్నారు.