మోదీతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు.

Update: 2024-11-27 11:03 GMT

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ బుధవారం పార్లమెంట్‌ భవనంలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాల్లో తాగు నీరు ప్రజలకు సకాలంలో అందడం లేదని, కలుషిత నీరు ఎక్కువుగా ఉంటోందని, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచి ఆరోగ్యవంతులుగా ఉంచాలంటే స్వఛ్చమైన తాగు నీరు అందించాల్సిన అవసరం ఉందని ప్రధానికి పవన్‌ కళ్యాణ్‌ వివరించారు. కేంద్ర జలజీవన్‌ మిషన్‌ ద్వారా ప్రస్తుతం చాలా గ్రామాల్లో తాగు నీరు అందిస్తున్నామని, ఈ పథకానికి ఇచ్చే నిధులు పెంచడంతో పాటు పథకం కాల పరిమితిని పెంచాలని కోరారు. అంతకు ముందు కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. పవన్‌ కళ్యాణ్‌ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏపీని గట్టెక్కించాలని, నిధులు ఇతోదికంగా ఇవ్వాలని కోరారు. తొలి సారిగా ఎక్కువ మంది కేంద్ర మంత్రులతో పవన్‌ కళ్యాణ్‌ భేటీ కావడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ను ఢిల్లీలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరీ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి కలిశారు.

మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజిత్‌ సింగ్‌ను పవన్‌ కళ్యాణ్‌ కలిశారు. రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ ప్రోగ్రామ్‌ కింద ఏపీకి కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి అందలేదని, ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పంచాయతీరాజ్‌ నిధులు, కేంద్ర ప్రోత్సాహకం, సహకారంతో పాటు కీలకమైన అంశాలపై చర్చించారు. రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ యోజన పథకం కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ రూ. 215.8 కోట్లకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. అయితే ఈ పథకం కింద 2021వ సంవత్సరం తర్వాత రాష్ట్రానికి నిధుల విడుదల పూర్తిగా ఆగిపోయింది. ఈ పథకానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 40శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపాదించిన నిధుల్లో మొదటి విడతగా రూ. 107.90 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో 3లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ, డీపీఆర్‌సీ భవనాల నిర్మాణాలను, 200 గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణం, 500 గ్రామ పంచాయతీలకు కంప్యూటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు శాశ్వత భవనం లేదు. దీని నిర్మాణానికి రూ. 20 కోట్లు ఇవ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:    

Similar News