పిఠాపురంలోనే పవన్ కల్యాణ్ బస..
పిఠాపురంలోనే పవన్ కల్యాణ్ బస. చేబ్రోలులో ఓ రైతు నిర్మించుకున్న భవనంలోనే పవన్ ఉండనున్నారు. అద్దె కూడా వద్దన్న రైతు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. పిఠాపురంలో తనను గెలిపించాలంటూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. వారాహి విజయయాత్ర పేరిట జోరుగా ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్.. ఈ ప్రచార సమయమంతా పిఠాపురంలోనే బస చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే వెతుకులాట కూడా మొదలైంది. అయితే పవన్ కోసం చేబ్రోలులో నివాసం వెతుకుతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఒక నివాసాన్ని కూడా ఎంపిక చేశామని, పిఠాపురంలో సొంతింటి నిర్మాణం పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారని ఆయన అనుచరులు తెలిపారు. అందుకోసం చేబ్రోలు బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ ఇంటికే పవన్ కల్యాణ్ బస చేయడానికి ఎంపిక చేశారు. ఇక్కడి నుంచే పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యకలాపాలను కూడా సాంగించనున్నారు. అన్నిటికీ వీలుగా ఉండటంతోనే ఈ ఇంటిని ఖరారు చేశారని సమాచారం.
భవనం అద్దె ఎంతంటే
పవన్ కల్యాణ్ బస చేయడానికి ఎన్నుకున్న ఇంటికి అద్దె విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గానే ఉంది. పవన్ ఎంత కాలం కావాలంటే అంత కాలం ఇక్కడ ఉండొచ్చని, అన్నాళ్లు తనకు అద్దె ఏమీ వద్దని రైతు ఓదూరి నాగేశ్వరరావు అన్నారట. కాదు కూడదు అనడంతో తనకు నెలకు ఒక్క రూపాయి అద్దె ఇస్తే చాలని, అంతకు మించి అక్కర్లేదని అన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ ఇంటికి దగ్గర్లోనే హెలీప్యాడ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
పిఠాపురంకు పవన్ హామీలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని దేశంలో ఆదర్శవంతంగా మారుస్తానని, ఒక ఎమ్మెల్యే తలచుకుంటే నియోజకవర్గానికి ఎంత చేయగలడో అంతా చేస్తానని భరోసా ఇచ్చారు. పిఠాపురం పరిధిలో ఉన్న 54 గ్రామాలను అభివృద్ధి చేస్తానని, ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తానని వెల్లడించారు.