ఢిల్లీ ఫలితాలపై పవన్‌ కల్యాణ్‌ రియాక్షన్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వాసం మరోమారు రుజువైందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.;

Update: 2025-02-08 11:55 GMT

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై.. ప్రధాని నరేంద్ర మోదీని, హోం మంత్రి అమిత్‌ షాని ఓ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిస్తుందని, ఆ విధంగా మోదీ పాలన సాగిస్తున్నారని అన్నారు. మోదీ నిర్థేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర చాలా కీలకమని, డబుల్‌ ఇంజన్‌ సర్కారు ద్వారా దేశ రాజధానిలో సమ్మిళత డెవలప్‌మెంట్‌ సాధ్యమం అవుతుందన్నారు. మోదీ పాలన, అమిత్‌ షా రాజకీయ అనుభవం.. చాతుర్యం.. వెరసి సత్ఫలితాలను ఇచ్చాయని మోదీ.. అమిత్‌ షాలను పొగడ్తలతో ముంచెత్తారు.

పవన్‌ కల్యాణ్‌ ఏమన్నారంటే..
2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకం. ఈ తరుణంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించడం స్వాగతించదగ్గ పరిణామం. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమం క్షేత్ర స్థాయికి చేరుతాయి. ఢిల్లీ అభివృద్దికి, దేశ రాజధానిలోని ప్రజల శ్రేయస్సు, సంక్షేమం కోసం వికసిత సంకల్ప్‌ పత్రం ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల మెప్పు పొందాయి. నరేంద్ర మోదీపై ఢిల్లీ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక అక్కడి ఘన విజయం. ఆర్థిక అవకతవకలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతాయని అక్కడి ప్రజలు విశ్వసించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొన్నారు. ఆయన రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలను ఇచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖా మాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా.. కూటమిని ముందుకు తీసుకువెళ్లడంలో సఫలీకృతులయ్యారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో విజయానికి మూల కారకులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అమిత్‌ షా, జెపి నడ్డాకి, బీజేపీ, మిత్ర పక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు. అంటూ పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.
Tags:    

Similar News