పవన్ ‘హరి హర వీరమల్లు’ ఓ రాజకీయ సవాల్!
పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు రాజకీయ ప్రేరేపితమా? ఎంటర్టైన్ మెంటా? ఆలోచింప జేస్తుందా?;
By : The Federal
Update: 2025-07-23 10:27 GMT
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు హరి హర వీరమల్లు సినిమా ఓ రాజకీయ సవాల్ అని చెప్పొచ్చు. ‘హరి హర వీరమల్లు’ సినిమా- సినిమాటిక్ ఈవెంట్ కంటే ఎక్కువగా జనసేనకు రాజకీయ ఉద్యమంగా నిలిచింది. ఈ సినిమా విజయం పవన్ కల్యాణ్ రాజకీయ ఇమేజ్‌ను బలపరుస్తుంది. జనసేన క్యాడర్‌ను ఉత్తేజ పరుస్తుంది. కూటమి ప్రభుత్వానికి సానుకూల ఇమేజ్‌ను తెస్తుంది.
వైఫల్యం వైఎస్సాసీపీ బాయ్‌కాట్ ఉద్యమాన్ని బలపరుస్తుంది. జనసేనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఈ సినిమా రాజకీయ సవాలుగా నిలిచినప్పటికీ, జనసేన దీనిని అవకాశంగా మార్చిన వ్యూహాన్ని గమనించొచ్చు. అయినప్పటికీ సినిమా విజయంపై అతిగా ఆధారపడటం రాజకీయంగా ప్రమాదకరం. విడుదల తర్వాత దాని విజయం లేదా వైఫల్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ (HHVM) సినిమా జులై 24, 2025న ప్రపంచవ్యాప్త విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం సినిమాటిక్ వినోదానికి మించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ప్రత్యేకించి జనసేన పార్టీపై అధిక ప్రభావం చూపనుంది. 2024 ఎన్నికల తర్వాత జనసేన క్యాడర్‌కు ఈ సినిమా తొలి రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా నిలిచింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లు, ఊరేగింపులు, కటౌట్‌లు, పూజలు పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. ఈ కార్యకలాపాలు సినిమా ప్రమోషన్‌ను రాజకీయ ఉద్యమంగా మార్చాయి.
జనసేనకు HHVM రాజకీయ ఉద్యమంగా ఎలా నిలిచింది?
2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా నిలిచింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాజకీయ కార్యకలాపాలు స్తబ్ధతకు చేరాయి. క్యాడర్‌ను ఉత్తేజ పరిచేందుకు పెద్ద ఈవెంట్ అవసరమైన సమయంలో HHVM ఈ లోటును పూరించింది. జనసేన కార్యకర్తలు సినిమా ప్రమోషన్‌ను రాజకీయ ఉద్యమంగా చేపట్టారు.
వూరేగింపులు, కటౌట్‌లు: రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలు కటౌట్‌లు ఏర్పాటు చేసి, ఊరేగింపులు నిర్వహించారు. ఈ కార్యకలాపాలు రాజకీయ ర్యాలీలను తలపించాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్: జులై 21, 2025న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈవెంట్‌కు రాజకీయ నాయకులు, మంత్రుల హాజరు సినిమా వేడుకను రాజకీయ సభగా మార్చింది.
క్యాడర్ ఉత్సాహం: 2024 ఎన్నికల తర్వాత జనసేన కార్యకర్తలకు ఇది తొలి రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా నిలిచి వారిలో ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యకలాపాలు జనసేన కార్యకర్తలకు రాజకీయ ఉత్తేజాన్ని అందించాయి. పవన్ కల్యాణ్ సినీ ఇమేజ్‌ను రాజకీయ శక్తిగా రూపొందించే వేదికగా ఈ సినిమా మారింది. అయినప్పటికీ, సినిమా ప్రమోషన్‌ను రాజకీయ ఉద్యమంగా మార్చడం విమర్శలకు తావిచ్చింది. ఇది జనసేన రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉందని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు.
సినిమా విజయం, రాజకీయ ప్రయోజనాలు
సినిమా కథ 17వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యంలో ధర్మం కోసం పోరాడిన కల్పిత యోధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ కథ పవన్ "ప్రజల కోసం పోరాడే నాయకుడు" ఇమేజ్‌తో సమానంగా నిలుస్తుంది.
విజయం పవన్ స్టార్ ఇమేజ్‌ను బలపరుస్తుంది. రాజకీయ ర్యాలీలు, ఎన్నికల ప్రచారంలో ఈ ఇమేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ సినిమా ఇమేజ్‌పై అధికంగా ఆధారపడటం రాజకీయ నాయకుడిగా పవన్ కల్యాణ్ విశ్వసనీయతను ప్రశ్నించేలా చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జనసేన క్యాడర్ ఉత్సాహం
సినిమా ప్రమోషన్‌లో కార్యకర్తల భాగస్వామ్యం క్యాడర్‌లో ఐక్యతను, ఉత్సాహాన్ని పెంచింది. ఈ ఉత్సాహం భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలకు ఊతమిస్తుంది. రాష్ట్రవ్యాప్త వూరేగింపులు, కటౌట్‌లు స్థానిక స్థాయి కార్యకర్తలను సమీకరించాయి. ఇది 2029 ఎన్నికలకు కీలకం. అయినప్పటికీ ఈ ఉత్సాహం సినిమా విజయంపై ఆధారపడి ఉంటుంది.
కూటమి ప్రభుత్వంపై సానుకూలత
కూటమి ప్రభుత్వం సినిమా టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇచ్చింది. సినిమా విజయం సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతుగా ప్రచారం చేయడానికి పనికొస్తుంది. ఈ మద్దతు విమర్శలను తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు. ఇది పవన్ రాజకీయ బాధ్యతలను దెబ్బతీసే అవకాశం కూడా లేకపోలేదు.
పాన్-ఇండియా రీచ్
HHVM తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. ఇది పవన్ ఇమేజ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీలకు జాతీయ రాజకీయ వేదికలపై ఈ ఇమేజ్ ఉపయోగ పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ సినిమా విజయంపై ఆధారపడి రీచ్ ఉంటుందని భావించొచ్చు.
సినిమా వైఫల్యం, రాజకీయ నష్టాలు
జూలై 21 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్, రఘురామకృష్ణ రాజు వైఎస్సార్ సీపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వైఎస్సార్ సీపీ అభిమానులు #BoycottHHVM హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ఉద్యమం చేపట్టారు. సినిమా వైఫల్యం ఈ ఉద్యమాన్ని బలపరుస్తుంది. ఇది జనసేన ఇమేజ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. వైఎస్సార్ సీపీ ఈ వైఫల్యాన్ని రాజకీయంగా ఆయుధంగా మలచడం ఖాయం.
పవన్ ఇమేజ్‌కు దెబ్బ
సినిమా విఫలమైతే పవన్ స్టార్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది ఆయన రాజకీయ ప్రజాదరణను దెబ్బతీస్తుంది. వైఎస్సార్ సీపీ వంటి ప్రతిపక్షాలు ఈ వైఫల్యాన్ని, పవన్ సినీ-రాజకీయ సమ్మేళనాన్ని విమర్శించడానికి ఉపయోగించుకుంటాయి. ఈ విమర్శలు పవన్ రాజకీయ నాయకత్వంపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి.
క్యాడర్ నిరాశ
సినిమా ప్రమోషన్‌లో జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వైఫల్యం క్యాడర్‌లో నిరాశను రేకెత్తిస్తుంది. ఇది భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలలో ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఈ నిరాశ పార్టీ సంస్థాగత బలాన్ని బలహీనపరుస్తుంది.
రాజకీయ విమర్శలు
సినిమా ఈవెంట్‌లను రాజకీయ సభలుగా మార్చడం ఇప్పటికే విమర్శలకు దారి తీసింది. సినిమా విఫలమైతే ఈ విమర్శలు తీవ్రమవుతాయి. జనసేన రాజకీయ విశ్వసనీయత దెబ్బతింటుంది. పవన్ రాజకీయ బాధ్యతలను సినిమా ప్రమోషన్‌తో ముడిపెట్టడం పార్టీ దీర్ఘకాలిక లక్ష్యాలకు హానికరం.
ప్రమోషన్ లో కీలక అంశాలు
ప్రీమియర్ షోలు, టికెట్ ధరలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ షోలకు రూ. 600 టికెట్ ధరతో అనుమతి ఇచ్చాయి. మొదటి 10 రోజులు టికెట్ ధరల పెంపును ఆమోదించాయి. ఈ నిర్ణయం విమర్శలను రేకెత్తించింది. ఇది పవన్ కళ్యాణ్ పట్ల పక్షపాతంగా కనిపించవచ్చని, ఇది ప్రభుత్వ నిష్పక్షపాతాన్ని దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు.
ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివాదం: జులై 21న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణ రాజు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. #BoycottHHVM ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివాదం జనసేన రాజకీయ వ్యూహాన్ని సంక్లిష్టం చేస్తోంది.
పవన్ ఇంటర్వ్యూ: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ మీడియాతో మాట్లాడుతూ, సినిమా కథ ఔరంగజేబు హయాంలో హిందువులపై విధించిన పన్నులను స్పృశిస్తుందని, ప్రజల కోసం పోరాడిన యోధుడి కథగా ఉంటుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి.
వార్తాపత్రికలు జనసేన కార్యకర్తల వూరేగింపులు, కటౌట్‌ల ఏర్పాటు, పూజలను హైలైట్ చేశాయి. ఈ కార్యకలాపాలు సినిమా ప్రమోషన్‌ను రాజకీయ ఉద్యమంగా మార్చాయి. ఈ వ్యూహం జనసేన రాజకీయ ఎజెండాకు శక్తినిస్తున్నప్పటికీ, సినిమాపై ఆధారపడటం ప్రమాదకరం.
HHVM విజయం లేదా వైఫల్యం జనసేన, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే చర్చ కొనసాగుతోంది.
దర్శకుడు జ్యోతి కృష్ణ వ్యాఖ్యలు
‘హరి హర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ పాత్రను రూపొందిస్తూ, ఆయనలోని నాయకత్వ లక్షణాలను గమనించారని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పారు. ఈ పాత్రను ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి ఐకానిక్ వ్యక్తులతో పోల్చారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను ఒక నీతివంతమైన, బలమైన, ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా చిత్రీకరించేలా స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు చెప్పారు. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు పవన్ కల్యాణ్‌ను ఒక హీరోగా కాకుండా నాయకుడిగా చూస్తున్నారని, ప్రతి సన్నివేశాన్ని కథను ఉన్నతంగా తీర్చిదిద్దేలా రూపొందించినట్లు జ్యోతి కృష్ణ తెలిపారు.
పవన్ కల్యాణ్ స్వయంగా చేసిన వ్యాఖ్యలు
సినిమా గురించి ఉప ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఇది రాజకీయ ఉద్దేశంతో తీసిన చిత్రం కాదని, ఇది ఒక యాక్షన్ త్రిల్లర్.. కుటుంబ వినోద చిత్రమని స్పష్టం చేశారు. ఈ చిత్రం కోహినూర్ డైమండ్‌ను గుంటూరు ప్రాంతం నుంచి తీసుకెళ్లిన సంఘటనలు, ఔరంగజేబు విధించిన జిజియా పన్నుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించలేక పోవడం గురించి మాట్లాడుతూ, తన రాజకీయ బాధ్యతల కారణంగా ప్రచారంలో పాల్గొనలేనని, కానీ నిర్మాత ఏఎం రత్నం కోసం మాట్లాడేందుకు వచ్చానని చెప్పారు.
వన్ కల్యాణ్ తన సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ... తాను ఇతర హీరోలతో పోలిస్తే వాణిజ్యపరంగా అంత పెద్ద స్థాయిలో లేనని, తన సినిమాలు ఇతరుల సినిమాలంత ఆదాయం తెచ్చే స్థాయిలో ఉండవని వినయంగా వ్యాఖ్యానించారు. ప్రధాన దృష్టి ఎప్పుడూ రాజకీయాలు, సామాజిక సేవపైనే ఉందని చెప్పారు.
తన సినిమా టికెట్ ధరలను మునుపటి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.10-15కి తగ్గించగా, ఇతర హీరోల సినిమాల టికెట్లు రూ.100కు విక్రయించారని, తన పోరాటం డబ్బు కోసం కాదని, న్యాయం కోసమని అన్నారు.