చంద్రబాబు రాజకీయ వికలాంగుడా..?

‘పొత్తులు అనే ఊత కర్ర లేకుండా చంద్రబాబు కదలలేడు’ అని మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన విమర్శలు చేశారు.

Update: 2024-03-21 01:20 GMT
మీడియాతో మాట్లాడుతున్న పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్, తిరుపతి)

"పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలవలేడు. కదలలేనీ ఓ రాజకీయ వికలాంగుడు" అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క జనసేన మరోపక్క బీజేపీ.. ఊత కర్రలుగా ఉండి తీరాలనీ వాగ్బాణాలు సంధించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'బస్సు యాత్రకు సిద్ధం' చేయడానికి వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ప్రతినిధులతో కర్నూలులో బుధవారం ఆయన సమీక్షించారు.

ఈ బస్సు యాత్రపై సీఎం పర్యటనల సమన్వయకుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, హ‌ఫీజ్ ఖాన్‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, బాల‌నాగిరెడ్డి, సాయిప్ర‌సాద్‌రెడ్డి, కంగాటి శ్రీ‌దేవి, ఎంపీ అభ్య‌ర్థి బీవై రామ‌య్య‌, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఇంతియాజ్‌, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, బుట్టా రేణుక తో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుది మొదటి నుంచి కూడా అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే నైజం అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల కంటే అధిక స్థానాలను కైవసం చేసుకుని మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన ధీమాగా చెప్పారు. రానున్న తమ ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు సాధించి, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారని ఆయన పునరుద్ఘాటించారు. ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.

నోరు అదుపులో పెట్టుకోండి..

మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ చీఫ్‌ కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోవాలని పెద్దిరెడ్డిని ఉద్దేశించి హెచ్చరించారు. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాఫియాతో పొత్తు లేకపోతే పెద్దిరెడ్డి నిలబడగలడా అని ప్రశ్నించారు. స్వేచ్ఛగా పోలింగ్‌ జరిగితే పుంగనూరులో పెద్దిరెడ్డి ఓడిపోక తప్పదని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News