అభ్యర్థులపై ఫోన్‌ సర్వేలు

ఎంపిక చేసిన అభ్యర్థి గురించి మరోసారి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవాలని బాబు నిర్ణయించారు. ఫోన్‌ సర్వేలు మొదలు పెట్టారు.

Byline :  The Federal
Update: 2024-01-06 10:52 GMT
Chandrababu TDP President

తెలుగుదేశం పార్టీ ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికను ఒక కొలిక్కి తెచ్చింది. ఇప్పటికే మొదటి విడతగా ప్రకటించే 90 మంది అభ్యర్థుల జాబితా తయారు చేసింది. డిసెంబరు ఆఖరు నాటికి జాబితాను ప్రకటించాలని ముందుగా చంద్రబాబు అనుకున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాలు వరుసగా ప్రకటిస్తుండటంతో తిరిగి టిడీపీ ఆలోచనలో పడింది. ఎంపిక చేసిన అభ్యర్థి గురించి మరోసారి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా ఉంటే తీసుకోవాలని బాబు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫోన్‌ సర్వేలు మొదలు పెట్టారు. ఫోన్‌లు నేరుగా నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులకు, సాధారణ ఓటర్లకు వేరువేరుగా వెళతాయి. వారి నుంచి వచ్చే అభిప్రాయాలను సేకరించి అభ్యర్థి ఎంపికను ఫైనల్‌ చేస్తారు. ఇదో కొత్త విధానమని చెప్పవచ్చు. పార్టీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయనే వివరాలు అధికారంలో ఉండగా ఫోన్‌ల ద్వారా సేకరించారు. వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి పథకాల్లో మార్పులు చేర్పులు చేశారు. అయితే అభ్యర్థుల ఎంపికలోనూ ఈ కసరత్తు చేయడం వెనుక రాబిన్‌శర్మ ఆలోచన ఉందని సమాచారం.

గెలుపే టార్గెట్‌
అభ్యర్థులు గెలుపు గుర్రాలు కావడమే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నది. గతంలో పార్టీలోని ముఖ్యనాయకుల సూచనలు, సలహాలు ఎక్కువగా తీసుకునే వారు. నేరుగా అధినేతకు వచ్చిన సమాచారం మేరకు అభ్యర్థి ఎంపిక ఉండేది. ఇప్పుడు అలా కాకుండా సర్వేలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఐదు సంస్థల ద్వారా ఇప్పటికే సర్వేలు చేయించి అభ్యర్థులను నిర్థారించారు. తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్న చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బలాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. అవసరమైతే అక్కడ కూడా అభ్యర్థులను మార్చాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం. సామాజిక సమీకరణలు, రాజకీయ బలాబలాలు, ప్రజల్లో వారిపై ఉన్న ఆదరాభిమానాలను మరోసారి బేరీజు వేసుకుంటే మంచిదనే అభిప్రాయానికి పార్టీ నేతలు వచ్చారు.
పొత్తుల సీట్లు ఆలస్యంగా ఖరారు
ఇక పొత్తుల విషయానికి వస్తే ఇప్పటికే చంద్రబాబునాయుడుతో పవన్‌కళ్యాణ్‌ చర్చలు జరిపారు. పొత్తు ప్రతిపాదనలో ఉన్న నియోజకవర్గాల గురించి ఎటువంటి ప్రకటన చేయకుండా కొంత ఆలస్యంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే పొత్తు నియోకవర్గాల విషయాన్ని కూడా త్వరగా తేలిస్తే మంచిదని పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం.
పెరిగిన నేతల సందడి
టీడీపీ టిక్కెట్‌ కావాలనే ఆశావహులు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబు దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి చంద్రబాబును గురువారం టీడీపీ కార్యాలయంలో కలిశారు. అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌రెడ్డి తన సహచరులతో తరలివచ్చారు. నరసరావుపేట నుంచి నల్లపాటి రాము అనుచరవర్గం వచ్చింది. జయహో బీసీ సదస్సుకు హాజరైన కొందరు నేతలు చంద్రబాబుకు తమ బయోడేటాలు అందించారు. తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని జయహో బీసీ సదస్సు వేదికపైనే అభ్యర్థించారు. పెనుకొండ టికెట్‌ ఆశిస్తున్న సబిత, చిత్తూరు ఆశిస్తున్న నాజర్, గుంతకల్‌ రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, ప్రొద్దుటూరు టికెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిలు చంద్రబాబుకు తమ గురించి చెప్పుకున్నారు.


Tags:    

Similar News