పోలీసులు వద్దన్నారు..జగన్ గుంటూరు వెళ్లారు
ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.;
By : The Federal
Update: 2025-02-20 13:43 GMT
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సీఎం చంద్రబాబు అన్నారు. అమలులో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లారు. కోడ్ అమలులో ఉంది.. రావొద్దని పోలీసులు చెప్పినా జగన్ వినలేదు. కోడ్‌ను ఉల్లంఘించి మరీ వెళ్లారని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా ఉండటం సరైంది కాదు. ప్రజా సమస్యల మీద స్పందించేందుకు వివిధ వేదికలు ఉన్నాయని, వాటి ద్వారా స్పందించొచ్చని సీఎం చంద్రబాబు అన్నారు.
మిర్చికి విదేశాల్లో డిమాండ్ తగ్గింది. దీని వల్ల మిర్చి రైతులు నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల గురించి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో అనే దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ మర్చి రైతుల సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చామన్నారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద 25 శాతం మాత్రమే ఇస్తారన్నారు. అది కూడా ఐసీఏఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం ఏపీలో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా ధర నిర్ణయించే పరిస్థితులు వచ్చాయన్నారు. సాగు ఖర్చులను రియలిస్టిక్‌గా లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలన్నారు. ఇలాంటివన్నీ సరి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. శుక్రవారం దీనిపై చర్చించిన తర్వాత ఓ స్పష్టత వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ కోసం ఏం చేయాలనే దానిపైన ఆలోచనలు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ అమలు గురించి కూడా చర్చించినట్లు చెప్పారు.