టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 110 మంది గుర్తింపు.. పోలీసులు కూడా..

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు, వారి కార్యకర్తలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Update: 2024-09-17 11:21 GMT

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు, వారి కార్యకర్తలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఈ దాడిలో పాల్గొన్న 110 మందిని గుర్తించామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో కొందరు పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్ఫష్టం చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా తమకు అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అనేక మంది కోర్టును ఆశ్రయించగా.. కొందరికి మాత్రమే ఈ మినహాయింపు లభించిందని ఆయన చెప్పారు. వారిని కూడా అతి త్వరలోనే విచారణకు పిలవనున్నామని, మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాపతులో భాగంగా అదుపులోకి తీసుకున్న నందిగం సురేష్ సహా పలువురుని విచారిస్తున్నామని, వారి నుంచి సేకరించిన సమాచారం మేరకు దర్యాప్తును ముందుకు సాగిస్తామని ఆయన అన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వహించిన అధికారులపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

వైసీపీ నేతల విచారణ..

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వైసీపీ నేతలకు కాస్తంత ఊరట లభించింది. వారికి మధ్యంతర రక్షణ కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి వైసీపీ నేత తమ పాస్‌పోర్ట్‌లను పోలీసులకు హ్యాండోవర్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నందిగం సురేష్‌ను పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతనితో పాటు పలువురు ఇతర నేతలను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, లాయర్ గవాస్కర్‌లను పోలీసులు విచారించారు. కాగా నదిగం సురేష్ మినహా మరే ఇతర వైసీపీ నేత కూడా విచారణకు సహకరించలేదని సతీష్ కుమార్ చెప్పారు. ఏ ప్రశ్న అడిగినా.. తెలీదు, గుర్తులేదు అంటూ దాటవేత సమాధానాలు చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

పాస్‌పోర్ట్ అప్పగింతకు కుప్పిగంతులు

పాస్‌పోర్ట్ అప్పగించే విషయంలో కూడా వైసీపీ నేతలు వింతవింత సమాధానాలు చెప్తున్నారాని పోలీసులు వర్గాలు చెప్తున్నాయి. అడిషనల్ ఎస్పీ కొల్లి శ్రీనివాస రావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో వైసీపీ నేతల విచారణ జరిగింది. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ఆదేశించినట్లు వారు తమ పాస్‌పోర్ట్‌లు హ్యాండోవర్ చేయాలని పోలీసులు కోరారు. వీరిలో దేవినేని అవినాష్, లతశిల రాఘురామ్ తమ పాస్‌పోర్ట్‌లను పోలీసులకు హ్యాండోవర్ చేశారు. కాగా లేళ్ల అప్పిరెడ్డి మాత్రం తనకు పాస్‌పోర్ట్ లేదని చెప్పగా, జోగి రమేష్ తన పాస్‌పోర్ట్ గడువు ముగిసిందని, దానిని రిన్యువల్ చేయించాక హ్యాండోవర్ చేస్తానని చెప్పినట్లు సమాచారం. కాగా ఈ విషయాలపై కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వారు చెప్పిన సమాధానాల్లో వాస్తవమెంత అన్న విషయాన్ని తెలుసుకునేలా చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు వర్గాలు చెప్తున్నాయి.

Tags:    

Similar News