దివ్యాంగుల గ్రీవెన్స్.. దేశంలోనే తొలిసారి..

దివ్యాంగుల సమస్యలపై దేశంలో తొలిసారిగా పోలీసులు స్పందించారు. “దిశ- దివ్యాంగ్ సురక్ష” పేరిట దివ్యాంగులకు పోలీసు సేవలను అందుబాటులోకి తెచ్చారు.

Update: 2024-04-04 09:33 GMT
Police HelpLine

(తంగేటి నానాజీ)

విశాఖపట్నం: భారత దేశంలోనే మొట్ట మొదటి సారి దివ్యాంగుల కోసం విశాఖ సిటీ పోలీసులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. "దిశ - దివ్యాంగ్ సురక్ష"హెల్ప్ లైన్ సేవల విధానాన్ని ప్రవేశపెట్టారు.ఎప్పటి నుంచో దివ్యాంగ సంఘాలు ప్రభుత్వాలకు, అధికారులకు తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలంటూ వినతులు ఇస్తూనే వస్తున్నాయి. వీటిపై స్పందించి కలెక్టర్ కార్యాలయాల్లో దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశారు. వీరి వినతుల కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక ర్యాంపుల నిర్మాణం కూడా జరిగింది. ఇప్పటివరకు దివ్యాంగుల సమస్యలకు కలెక్టర్లు, ప్రభుత్వాలే స్పందించాయి. తాజాగా ఇప్పుడు పోలీసు శాఖ కూడా స్పందించింది.

వాట్సాప్ నెంబర్ల కేటాయింపు...

విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ. రవి శంకర్ అయ్యన్నార్ తొలిసారిగా దివ్యాంగుల కోసం "దిశ -దివ్యాంగ్ సురక్ష" హెల్ప్ లైన్‌ను కమిషనరేట్‌లో ఏర్పాటు చేశారు. దివ్యాంగులు ఫిర్యాదు చేసే విధంగా రెండు వాట్సాప్ నెంబర్లను కేటాయించారు. వారి ఫిర్యాదులలో సారాంశాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్వేర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. వాట్సాప్ ఫిర్యాదులతోపాటు నెలలో ఒకరోజు 'డయల్ యువర్ సిపి' కార్యక్రమం కూడా నిర్వహించనునట్టు సీపీ ప్రకటించారు.

‘‘దివ్యాంగుల కోసం ముఖ్యంగా బదిరులు, అంధుల కోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. ఇందులో దివ్యాంగులకు అర్థమయ్యేట్టుగా నిపుణులతో పాటు సైన్ విధానం ద్వారా దివ్యాంగులు చేసిన ఫిర్యాదుపై కంట్రోల్ రూం వెంటనే స్పందిస్తుంది. ఇందుకు గాను ఒక ప్రత్యేక ప్రింటర్‌ను ఏర్పాటు చేసి, అందులో ఇంగ్లీష్‌లో టైప్ చేస్తే అవతలి అంధులైన వారికి బ్రెయిలీ లిపి ద్వారా తీసుకున్న చర్యల గురించి వెంటనే తెలియజేస్తాం’’ అని పోలీస్ కమిషనర్ రవిశంకర్.. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి తెలిపారు.

దివ్యాంగుల ఫిర్యాదులపై తక్షణ చర్యలు...

దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఈవ్ టీజింగ్, సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న వివక్షపై కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సత్వర చర్యలు చేపడతామని పోలీసులు చెబుతున్నారు. జాతీయ వికలాంగుల చట్టం- 2016 ప్రకారం దివ్యాంగులు ఫిర్యాదు చేస్తే సెక్షన్ 92ను అనుసరించి వెంటనే ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు చేయనున్నారు.

నిన్న భూ సమస్యలు… నేడు దివ్యాంగ సమస్యలు...

కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ సమస్యలపై ఇదివరకు స్పందించిన విశాఖ పోలీసులు... ఇప్పుడు దివ్యాంగుల సమస్యలపై దృష్టి పెట్టారు. సివిల్ డిస్ప్యూట్ అంటేనే పొమ్మన్న పోలీసులు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి భూ సమస్యలను పరిష్కరించారు. ఇదే కోవలో దివ్యాంగుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. నగర పోలీస్ కమిషనర్‌గా డాక్టర్ ఏ రవిశంకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇలాంటి సంస్కరణలు జరుగుతున్నాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి.





 


దివ్యాంగ సంఘాల హర్షం....

దివ్యాంగుల ఫిర్యాదుల స్వీకరణకు విశాఖ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్ లైన్ విధానంపై దివ్యాంగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ వికలాంగుల నెట్వర్క్ ప్రతినిధి పూర్ణమిదం విశాఖ పోలీసుల చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 'వికలాంగులు చేస్తున్న ఫిర్యాదులపై సత్వరమే స్పందించండి. ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా దివ్యాంగులు నేరుగా ప్రవేశించి స్థానిక పొలీస్ అధికారులను కలిసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. ఇంకా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు లేవు. ర్యాంపుల నిర్మాణం చేపట్టాలి. 201 జాతీయ వికలాంగుల చట్టం ప్రకారం వికలాంగులకు చేయూత నిచ్చి న్యాయం చేయాలి' అంటూ పూర్ణమిదం కోరారు.

Tags:    

Similar News