బ్యాంకును దోచి.. మర్రిచెట్టు తొర్రలో దాచిన ముసుగు దొంగ

పట్టపగలే సీఎంఎస్ వ్యాన్‌లో చోరీ చేశాడో దొంగ. ఆ నగదును ఎక్కడ దాచాలో తెలియక మర్రిచెట్టు తొర్రలో పెట్టారు. ఆ తర్వాత ఏమైందంటే..

Update: 2024-04-20 10:29 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: జాతీయ బ్యాంకు ఏటీఎం మిషన్లలో ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది సీఎంఎస్ వాహనంలో తీసుకెళ్లి నగదు నింపుతుంటారు. అదును చూసి ఆ వాహనం నుంచి అక్షరాల రూ. 64 లక్షలు దర్జాగా దోచుకున్నాడు. ఆ సొమ్మును ఓ మర్రిచెట్టు తొర్రలో దాచాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగ ఎవరో తెలుసుకున్నారు. గ్రామానికి వెళ్లి నిందితుని తమదైన స్టైల్‌లో విచారణ చేశారు. నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు మరో ఇద్దరు ఇంటి దొంగలను కూడా అరెస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే చోరీ చేసిన సొమ్మును కూడా రికవరీ చేశారు. ఆ వివరాలను ఒంగోలు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇవి.

నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిఎంఎస్ (క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇన్ఫో సిస్టం లిమిటెడ్) సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఏటీఎం మెషిన్లలో నింపేందుకు తీసుకెళ్తున్నారు. మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు వద్ద ఉన్న ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపారు. మధ్యాహ్నం కావడంతో వెంట తెచ్చుకున్న భోజనం తినడానికి బంకులోని గదిలోకి వెళ్లారు. ఆ సమయంలో..

 

ముసుగు దొంగ చేతివాటం

నగదుతో ఉన్న సిఎంఎస్ వాహనం వద్ద ఎవరూ లేరనే విషయాన్ని ఓ ముసుగు దొంగ గమనించాడు. ఇదే అదునుగా .. వాహనం వెనుక వైపు తలుపు తాళాలు పగలగొట్టాడు. రూ.64 లక్షల విలువ కలిగిన రూ.500 నోట్ల కట్టలను చోరీ చేసి ఉడాయించాడు. నింపాదిగా భోజనం చేసి వచ్చిన వాహనం సిబ్బంది వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించారు. ఆందోళనకు గురయ్యారు. వాహనం లోపల పరిశీలించగా..

అందులో రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. రూ.500 నోట్ల కట్టలు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందారు. రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. సిబ్బంది సబ్ నుంచి సమాచారం అందుకున్న సిఎంఎస్ మేనేజర్ గుజ్జుల వెంకట కొండారెడ్డి ఒంగోలు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ నాలుగు బృందాలను దర్యాప్తు కోసం ఏర్పాటు చేశారు.

రంగంలోకి దిగిన.. ఒంగోలు అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్స్‌) ఎస్వీ శ్రీధర్‌రావు, తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల కోసం వాకబు చేశారు. అదృష్టవశాత్తు సమీపంలోనే సీసీ కెమెరాలు ఉండడం, అవి కూడా పనిచేస్తూ ఉండడం ముసుగు దొంగ భరతం పట్టేలా చేసింది. ముసుగు ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి వాహనంలో నగదు చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరా రికార్డ్ చేసింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గతంలో సీఎంఎస్‌ సంస్థలో పనిచేసి, ఉద్యోగం వదిలేసిన సన్నమూరు మహేష్‌గా గుర్తించారు.

 

మర్రిచెట్టు తొర్రలో.. నగదు

సిఎంఎస్ వాహనం నుంచి చోరీ చేసిన నగదు కట్టలను ఎక్కడ దాచాలో మహేష్‌కు అర్థం కాలేదు. నోట్ల కట్టలను తన స్వగ్రామమైన సంతనూతలపాడు మండలం కామేపల్లి వారి పాలెంలో తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఆ గ్రామానికి వెళ్ళిన పోలీసులు నిందితుడు మహేష్‌ను తమదైన శైలిలో విచారణ చేశారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మర్రిచెట్టు తొర్రలో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనక సిఎంఎస్ మేనేజర్ గుజ్జుల వెంకట కొండారెడ్డి, రాచర్ల రాజశేఖర్ అనే వ్యక్తి కూడా ఉన్నారని గుర్తించినట్లు ఒంగోలు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరించారు. " మాకు ఫిర్యాదు అందిన గంటల వ్యవధిలోనే కేసును పరిష్కరించాం" అని ఆయన అన్నారు.

భద్రత ముఖ్యం

నగదు చోరీకి గురైన సిఎంఎస్ వాహనం వద్ద తీసుకున్న భద్రతా చర్యలు కూడా సజావుగా లేవని ఆయన గుర్తు చేశారు. ఏటీఎం యంత్రాలలో నగదును నింపడానికి తీసుకెళ్లే వాహనాల వద్ద హోం శాఖ నిబంధన ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆయన హెచ్చరించారు. " నగదు చోరీకి గురైన వాహనంలో సీసీ కెమెరా పనిచేయడం లేదు". భద్రత కూడా సరిగా లేదని ఆయన తప్పు పట్టారు. సిఎంఎస్ వాహనాల్లో సీసీ కెమెరా అమర్చడంతో పాటు ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సిబ్బంది భోజనం లేదా బ్యాంకు లోకి వెళ్లిన ఒక సెక్యూరిటీ గార్డ్ కచ్చితంగా వాహనం వద్ద కాపలా ఉండాలని ప్రత్యేకంగా ఆయన సూచించారు. ఈ కేసును ఛేదించిన అధికారులు పోలీసు సిబ్బందిని ఆయన సత్కరించారు.

Tags:    

Similar News