సజీవ సమాధిని భగ్నం చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లాలో ఓ మాజీ సర్పంచి కుమారుడు 12 సంవత్సరాల క్రితం ఆ గ్రామ శివారులో ఓ ఆలయాన్ని సొంతంగా నెలకొల్పాడు. అక్కడే సజీవ సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు.;
By : The Federal
Update: 2025-03-31 06:23 GMT
మానవ ప్రంచం నివ్వెర పోయే సంచలన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను బతికి ఉండగానే తనకు తానుగా సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నం చేశారు. దాని కోసం గుంతను కూడా తవ్వుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తి సజీవ సమాధిని అడ్డుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠాలపురంలో ఆదివారం ఉగాది పర్వదినం నాడు చోటు చేసుకుంది.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పరంచి కైపు అంజిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి బతికి ఉండగానే తనకు తాను సజీవ సమాధి చేసుకొని చరిత్రలో నిలిచి పోవాలని కలలు కన్నాడు. దేవుడిలా మారి అందరి ఆరాధనలు పొందాలని భావిచాడు. అందులో భాగంగా ప్రతి రోజు ద్యానంలో నిమగ్నమయ్యే వాడు. దీని కోసం విఠలాపురం గ్రామ శివారు ప్రాంతంలోని తమ పొలంలో ఏకంగా ఓ దేవాలయాన్ని నిర్మించుకున్నాడు. దానిని భూదేవి ఆలయంగా ఏర్పాటు చేసుకున్నాడు.
ఉగాది పర్వదినం నాడు తనకు తాను సజీవ సమాధి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా రూపొందించుకున్న పథకం ప్రకారం కైపు కోటిరెడ్డి ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాడు. దీని కోసం ఒక గుంతను కూడా తవ్వుకున్నాడు. గత వారం రోజులుగా ఆ గుంతలో కూర్చోవడం, గుంతకుపైన రేకును కప్పుకోవడం, ధ్యానం చేస్తూ వస్తున్నాడు. ఇలా దాదాపు వారం రోజులు ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఇక తాను సజీవ సమాధి చేసుకునేందుకు నిర్ణయించుకున్న ఉగాది పర్వదినం రానే వచ్చింది. ఆదివారం ఉగాది పర్వదినం కావడంతో ఆదివారం వేకువజామునే కైపు కోటిరెడ్డి నిద్ర లేచాడు. తన కాలకృత్యాలు తీర్చుకున్నాడు. సజీవ సమాధికి సిద్ధమయ్యాడు. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో తన కుమారుడుని వెంటబెట్టుకొని విఠలాపురం గ్రామ శివారులోని తన పొలంలో తాను సొంతంగా నిర్మించుకున్న భూదేవి ఆలయం వద్దకు చేరుకున్నాడు.
సజీవ సమాధికి మానసికంగా సిద్ధపడిన కైపు కోటిరెడ్డి భూదేవి ఆలయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశాడు. ఈ సమయంలో తన కుమారుడుకి ఆదేశాలు ఇచ్చాడు. తాను గుంతలోకి దిగి ధ్యానం చేస్తున్న సమయంలో గుంతపై రేకు పెట్టి మట్టితో నింపేయాలని తండ్రి కైపు కోటిరెడ్డి తన కుమారుడుకి సూచించాడు. అనంతరం తాను సొంతంగా తవ్వుకున్న గుంతలోకి వెళ్లి ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. తండ్రి సిగ్నల్ ఇవ్వడంతో గుంతపై రేకును పెట్టి మట్టితో గుంతను పూడ్చేశాడు కైపు కోటిరెడ్డి కుమారుడు. అయితే ఈ విషయం కోటిరెడ్డి కుటుంబ సభ్యులకు తెలిసింది. పరుగు పరుగున తమ పొలంలోని భూదేవి ఆలయం వద్దకు చేరుకున్నారు. కొంత మంది స్థానికులు కూడా పరుగులు పెట్టారు. గుంతలో నుంచి బయటకు రావాలని తండ్రి అంజిరెడ్డి, మరి కొందరు కోటిరెడ్డిని కోరారు. గుంతలో నుంచి బయటకు రావాలని బ్రతిమాలారు. అయితే గుంతలో నుంచి బయటకు వచ్చేందుకు కోటిరెడ్డి నిరాకరించాడు. తాను ధ్యానంలో నిమగ్నమై ఉన్నానని, దయచేసి తన ధ్యానానికి భంగం కలిగించొద్దని వారిని వారించాడు.
ఇలా ఎంత సేపటికి గుంతలో నుంచి కోటిరెడ్డి బయటకు రాకపోవడంతో ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. పరుగు పరుగున వచ్చిన పోలీసులు స్థానికుల సహాయంతో కైపు కోటిరెడ్డిని గుంతలో నుంచి బయటకు తీశారు. గుంతలోకి దిగి, దానిని పూడ్చేసుకొని ధ్యానం చేయడం మంచిది కాదని పోలీసులు కోటిరెడ్డికి పోలీసులు తమదైన శైలిలో వారించారు. అయినా కోటి రెడ్డి తన మనసులో సజీవ సమాధి చేసుకోవాలనే సంకల్పాన్ని మరవ లేదు. ఎలాగైనా సజీవ సమాధి కావాలనే పట్టుదలతోనే కోటిరెడ్డి ఉన్నాడు. పోలీసులు ఉన్నంత వరకు వారి మాటలు విన్నట్టు నటించిన కోటిరెడ్డి, పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ గుంతలోకి వెళ్లి పోయాడు. ధ్యానంలో కోటిరెడ్డి నిమగ్నమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అటు కుటుంబ సభ్యులు, ఇటు స్థానికులు కలిసి కైపు కోటిరెడ్డిని గుంతలో నుంచి బయటకు తీశారు. అలా కైపు కోటిరెడ్డి సజీవ సమాధి ప్లాన్ భగ్నమైంది.