మునిసిపాలిటీల్లో రాజకీయ అలజడి

కూటమి, వైఎస్సార్సీపీలు మునిసిపాలిటీల్లో రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. పట్టుకోసం ఎవరికి వారు అడుగులు వేస్తున్నారు.;

Update: 2025-02-04 06:16 GMT

తెలుగుదేశం, దాని మిత్రపక్షాలు మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ లలో ఆధిపత్యం సాధించేందుకు పావులు కదిపాయి. రాష్ట్రంలో 12 చోట్ల ఎన్నికలు జరగగా ఏడు చోట్ల తెలుగుదేశం, మిత్రపక్షాలు గెలిచాయి. మరో ఐదు మునిసిపాలిటీల్లో మంగళవరం ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకు వైఎస్సార్సీపీ వారే మేయర్లు, మునిసిపల్ చైర్మన్ లుగా ఉన్నారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రంగంలోకి దిగి టీడపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కూటమి అభ్యర్థిగా పోటీకి దిగిన డి రమేశ్ కుమార్ వైఎస్సార్సీపీ బలపరిచిన లక్ష్మిపై గెలుపొందారు. మునిసిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవడంతో అక్కడి తెలుగుదేశం పార్టీ వారిలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్లుగా కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.

గైర్హాజరైన వైఎస్సార్సీపీ సభ్యులు

చాలా మునిసిపాలిటీల్లో వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నిక సమయంలో గైర్హాజరయ్యారు. దీంతో కూటమి వారి అభ్యర్థిని ఎన్నుకోవడం ఈజీ అయింది. ఏలూరులో 17 మంది వైఎస్సార్సీపీకి సభ్యులు ఉన్నారు. అందరూ గైర్హాజరయ్యారు. వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీకి రాజీనామా చేయడం, పార్టీ కార్యకర్తలు, నాయకులకు దూరంగా ఉండటం కూడా ఇక్కడ వైఎస్సార్సీపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఆకుల మల్లీశ్వరి తెలుగుదేశం పార్టీ తరపున పోటీకి దిగటంతో వైఎస్సార్సీపీ సభ్యులు అడ్డం తిరిగారు దీంతో మంగళవారానికి ఎన్నిక వాయిదా పడింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, కాకినాడ జిల్లా తుని మునిసిపాలిటీల్లో కోరం లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి.

తెలుగుదేశంలోకి వెళ్లిన సభ్యులు

చాలా మునిసిపాలిటీల్లో ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరుపు గెలిచిన వారే ఉన్నారు. అయితే వీరు నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ప్రకటించి ఎన్నికల్లో పోటీకి దిగటంతో అలజడి రేగింది. పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరుగుతున్న ప్రతి మునిసిపాలిటీలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో అలజడి చోటు చేసుకుంది. కార్పొరేషన్ లో 47 మంది కార్పొరేటర్లు ఉండగా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. మిగిలిన 46 మంది వైఎస్సార్సీపీ సభ్యలు కావడం విశేషం. సోమవారం ఎన్నిక సందర్బంగా బస్ లో వారు కార్పొరేషన్ కు వెళుతుంటే తెలుగుదేశం, జనసేన పార్టీ వారు దాడి చేసి బస్ అద్దాలు పగుల గొట్టారు. దీంతో పెద్ద అలజడి చోటు చేసుకుంది. నలుగురు కార్పొరేటర్లను తెలుగుదేశం వారు కిడ్నాప్ చేశారని వైఎస్సార్సీపీ వారు ఆరోపించారు. కొందరిని హోటల్స్ కు తీసుకెళ్లి కూటమి వారు నిర్బంధించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉద్రిక్తతల మధ్య మంగళవారం ఎన్నిక జరగనుంది.

తెలుగుదేశంలోనూ అంతర్గత పోరు

తెలుగుదేశం పార్టీలో అభ్యర్థులుగా ఎవరిని పెట్టాలనే అంశంపై పలు చోట్ల అంతర్గత పోరు కూడా చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపాలిటీలో మునిసిపల్ చైర్మన్ ఎన్నికపై ఎమ్మెల్యే సౌమ్య, ఎంపీ కేశినేని చిన్నిల వర్గ పోరుతో వాయిదా పడింది. ఎంపీ ఒక అభ్యర్థిని ప్రతిపాదించగా, ఎమ్మెల్యే ఒక అభ్యర్థిని ప్రతిపాదించారు. దీంతో సభ్యులను మునిసిపాలిటీకి రాకుండా ఇరు వర్గాల వారు అడ్డుకున్నారు. కోరం లేక ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఇలా కొన్ని చోట్ల వర్గపోరు కూడా నడుస్తూనే ఉంది. వైఎస్సార్సీపీకి బలమున్న చోట బలవంతంగా పదవిని చేజిక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి.

వైఎస్సార్సీపీలో చర్చ

వైఎస్సార్ సీపీకి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ తిరుపతి వంటి పట్టణంలోనూ కూటమి నాయకులు అరాచకం చేస్తున్నారనే చర్చ మంగళవారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశంలో జరిగింది. ఎలాగైనా తెలుగుదేశం, జనసేన అరాచకాలకు అడ్డుకట్ట వేయాలనే ఆలోచనలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు వైఎస్సార్సీపీ వారు చెబుతున్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం, జనసేన పార్టీల్లోని ముఖ్యమైన నాయకులపైనా చర్చ జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆందోళనా కార్యక్రమాలు జరగాలని, అందుకు ప్రణాళికా బద్దంగా అడుగులు వేయాలనే నిర్ణయం పార్టీ తీసుకుంది.

భారీ పోలీస్ బందోబస్త్

అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న నందిగామ, తిరుపతి, ఏలూరు, పాలకొండ వంటి మునిసిపాలిటీల్లో పోలీసులు మొహరించారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొట్లాటలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయినా గొడవలు జరిగితే వెంటనే అరెస్ట్ చేసేందుకు కూడా వెనుకాడకుండా అడుగులు వేయాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు.

Tags:    

Similar News