జగన్ ఓడిపోతాడని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ చెప్పే లాజిక్ ఏమిటంటే..
ఒకప్పటి వ్యూహకర్త ప్రస్తుతం ప్రత్యర్ధి అయ్యారు. 2019లో జగన్ గెలుపు నల్లేరు మీద నడకేనన్న పెద్ద మనిషి ఇప్పుడు స్వరం మార్చారు. ఓడిపోతాడంటున్నారు, ఎందుకు..
ప్రశాంత్ కిషోర్ ఎలియాస్ పీకే. ఈపేరు ఎక్కడో ఉన్నట్టుంది కదూ.. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి రాజకీయ సలహాదారు. వ్యూహకర్త. జగన్‌ను వెన్నంటి ఉండి ఎన్నికల్లో గెలిపించడానికి అవసరమైన ఎత్తులు, పైఎత్తులు వేసిన వ్యక్తి. ఐదేళ్లు తిరిగే పాటికి ఆయనెందుకో జగన్‌కి వ్యతిరేకంగా మారిపోయారు. వైఎస్ జగన్ పని అయిపోయిందని ఒకసారి, గెలవడం కష్టమేనని మరోసారి వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో జగన్ గెలుపు అసాధ్యమంటున్నారు. ఇంతకీ ఆయన లాజిక్ ఏమిటో బయటపెట్టడం లేదు.
తాజాగా ఆయన ఏమన్నారంటే... ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ రావడం కష్టమన్నారు. ‘జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదు‘ అన్నారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ రాచరికపు చక్రవర్తి (మోనార్క్)లా జగన్ పాలన కొనసాగిస్తున్నారని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ సొమ్మును పంచడం తప్పితే ఆయన పాలనతో రాష్ట్రానికి ఒనగూరిందేమీ లేదు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ మాదిరి తాయిలాలివ్వడం తప్ప.. ప్రజల ఆకాంక్షలను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. నగదు బదిలీ మాత్రమే చేశారని.. ఉద్యోగాల కల్పనపైన, అభివృద్ధిపైన ఏమాత్రం దృష్టి సారించలేదు‘ అన్నారు ప్రశాంత్ కిషోర్. నిజానికి ఇటువంటి పథకాల రూపకల్పనలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా ఉంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడ తేడా వచ్చిందీ? చంద్రబాబుతో ఇటీవలి భేటీ అనంతరం ఆయన వైఖరిలో బాగా మార్పు వచ్చింది. జగన్‌పై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.