రెచ్చగొట్టారా? కూడగట్టారా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అన్ని వర్గాల్లోను కలకలం రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు హిందూవులను రెచ్చ గొడుతున్నాయా? అన్ని మతాలను కూడగుట్టుతున్నాయా? అనే సందిగ్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చగా మారింది. తిరుమల లడ్డుకు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏ నాడు ఇటువంటి దుష్పరిణామాలు జరగ లేదు. వెంకటేశ్వరుని ప్రతిష్టకు భంగం కలగ లేదు. కానీ జగన్ ప్రభుత్వంలో ఇది జరిగింది. దీనికి అందరూ ఒక్కటి కావాలి. అందరు కలిసి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇచ్చారనే దానిపై చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో దాదాపు 319 దేవాలయాలు అపవిత్రమయ్యాయి. రామతీర్థంలో రాముడి తల నరికితే ఆ తలను అర్చకులు చేత పట్టుకుని బాధపడుతుంటే తన మనసు కలత చెందింది. అస్థిరత క్రియేట్ చేయాలని తనకు లేదు. అపవిత్రం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం. అందుకే అందరూ ఏకం కావాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రామతీర్థం రాముడు విషయాన్ని ఒకటికి మూడు సార్లు తన మాటల్లో చెప్పుకొస్తూ హిందువుల మనసులు కూడగట్టే యత్నం చేశారు.