'సిద్ధేశ్వరం' అలుగుకు ప్రజా శంకుస్థాపన
ఈ నెల 31న రెండు లక్షల మందితో 9వ వార్షికోత్సవం నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సమితి నిర్ణయించింది. ఇంకా ఏమి తీర్మానించారంటే..;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-11 14:09 GMT
రాయలసీమ సమగ్రాభివృద్ధికి పాలకులపై ఒత్తిడి పెంచే దిశగా కార్యక్రమాలను చేపట్టాలని ముఖ్య అతిథిగా పాల్గొన్నరాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి పిలుపు నిచ్చారు. రెండు లక్షల మందితో మే 31న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన, 9వ వార్షికోత్సవం నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాచరణ సమావేశం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగింది. సమితి కార్యవర్గసభ్యుడు పట్నం రాముడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బుజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడారు.
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రాయలసీమ అన్ని రంగాల్లో మరింత వివక్షకు గురైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ఆశలను వమ్ము చేసే విధంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తీర్మానాలు
1. మే 31న సిద్దేశ్వరం అలుగు తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. రెండు లక్షల మందితో నిర్వహించే కార్యక్రమంలో ప్రాజెక్టు అలుగుకు ప్రజలే శంకుస్థాపన.
2. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూల్ లో ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
3. సుమారు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని కోరింది. ఆ నిధులతో పనులు చేపడితే రాయలసీమలో సుమారు 4.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్ కు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది.
4. ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి కలెక్టరేట్ కార్యాలయం తక్షణమే తొలగించాలని తీర్మానించారు.
ఒత్తిడి పెంచడానికే
రాయలసీమ అభివృద్ధికి చేపట్టాల్సిన వివిధ అంశాలపై ప్రజలను చైతన్యం చేస్తాం అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉంది" అని గుర్తు చేశారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన వివిధ రంగాలలో విద్యా, వైద్య, ఆరోగ్య,వ్యవసాయ, సాగునీటి, ఉద్యోగ రంగాలలో జరుగుతున్న వివక్షపై ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణ పై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రతినిధుల ముందు ఆయన ఉంచారు.
"రాయలసీమపై పాలకుల నిర్లక్ష్య వైఖరిని తొలగించే దిశగా రెండు లక్షల మంది స్వచ్ఛందంగా సిద్దేశ్వరం అలుగు తొమ్మిదో వార్షికోత్సవంలో పాల్గొనే విధంగా చేపట్టే కార్యాచరణ అమలు చేయడానికి సమాయత్తం కావాలి" బొజ్జా కోరారు.
విశిష్ట అతిథి మానవ వనరుల శిక్షకుడు గజ్జల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ,
"రాయలసీమ ప్రాంత ప్రజలను మమేకం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. " ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం, రాయలసీమ కార్యాచరణ విజయవంతం చేయడానికి ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు. నంద్యాల జిల్లాలోని సుమారు 18 మండలాల నుంచి హాజరైన ప్రతినిధుల సభలో రాయలసీమ కార్యవర్గ సభ్యులు, రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎన్. రెడ్డి వందన సమర్పణ చేశారు.