ప్రచారంపై పురందేశ్వరి ఫోకస్..

ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి కసరత్తులు చేస్తున్నారు. ఈ ప్రచారంలో బీజేపీ జాతీయ నేతలు కూడా పాల్గొనే అవకాశం..

Update: 2024-03-25 13:23 GMT
Source: Facebook

ఆంధ్రలో ఎన్నికల ముందు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలకు సిద్ధం అవుతున్నారు. మరో రెండు రోజుల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ అధినేతలు చంద్రబాబు, జగన్ కూడా తమ ప్రచారాన్ని ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఆంధ్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ఎలా సాగించాలన్న అంశంపై పార్టీ నేతలతో చర్చలు కూడా చేస్తున్నట్లు సమాచారం. కాగా తన ప్రచారాన్ని రాజమండ్రి నుంచి ప్రారంభించి రాష్ట్రమంతా చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ర్యాలీలు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అన్న విషయాలపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేశారు.

రాజమండ్రి నుంచే ప్రచారం
వచ్చే నెల 5 నుంచి పురందేశ్వరి తన ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. రాజమండ్రి నుంచి ప్రారంభమై రాష్ట్రమంతా సాగే పార్టీ ప్రచార సభల్లో కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు కూడా హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు అందుబాటులో ఉండే సమయానికి అనుగుణంగా సభలు, ర్యాలీలు నిర్వహించేలా చూస్తున్నారు. అంతేకాకుండా కూటమి సభ్య పార్టీ నేతలతో కూడా కలిసి సంయుక్తంగా ర్యాలీలు, సభలు కూడా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. కూటమిలో భాగంగా తమకు కేటాయించిన అన్ని స్థానాల్లో గెలిచేలా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారాన్ని గట్టిగా చేయాలని పార్టీ పెద్దలు కూడా నిశ్చయించుకున్నారని సమాచారం.
ప్రచారానికి సిద్ధమైన మిత్రపక్షాలు
ఇప్పటికే తమ ఎన్నికల ప్రచారంపై టీడీపీ, జనసేన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 27 నుంచి ‘ప్రజాగళం’ పేరిట తమ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అదే విధంగా వైసీపీ కూడా ‘మేమంతా సిద్ధం’ పేరిట ఇడుపులపాయ నుంచి ఈ నెల 27 నుంచి సీఎం జగన్ కూడా ప్రచారాన్ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. దాంతో పాటుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన వారాహి వాహనాన్ని రంగంలో దించడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
Tags:    

Similar News