పుట్టాకు ఇంటి పోరు
కడప నుంచి ఏలూరు వచ్చి పోటీ చేస్తామంటే స్థానికులు చేతకాని వారా?. ఆ మాత్రం బలమున్న టీడీపీ నాయకులు స్థానికంగా లేరా?. అంటున్నారు ఏలూరు టీడీపీ శ్రేణులు.;
By : The Federal
Update: 2024-04-04 13:17 GMT
జి. విజయ కుమార్
ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న పుట్టా మహేష్‌కుమార్ యాదవ్‌కు ఇంటి పోరు ఎక్కువైంది. ఇంటిలోని పోరు ఇంతంత కాదయా.. అంటూ వేమన చెప్పిన పద్యాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకు ఆయనకు ఇంటి పోరు ఎక్కువైందంటే పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ స్థానికుడు కాకపోవడం. ఎక్కడో కడప జిల్లా నుంచి వచ్చి ఏలూరు పార్లమెంట్ సీటు సంపాదించడం. ఇక్కడ సీటు కోసం పోటీ పడిన స్థానిక టీడీపీ, బీజేపీ వాళ్లంతా తల్లకిందులు కావడం. ఇది అసలు విషయం.
చక్రం తిప్పిన మామ
తెలుగుదేశం మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు, చంద్రబాబును ఒప్పించి అల్లుడైన మహేష్‌కుమార్ యాదవ్‌కు ఏలూరు పార్లమెంట్ సంపాదించగలిగారు. అయితే పార్టీలోని ముఖ్య నాయకులను మాత్రం తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు. దీంతో రగడ మొదలైంది. సీటు సంపాదించడానికి నానా కష్టాలు పడితే స్థానిక పార్టీ వారు ఆమోదించడానికి ఇంకెన్ని కష్టాలు పడాలోనని యనమల సైతం తలపట్టుకున్నారు. స్థానికంగా సత్యనారాయణగౌడ్, గోరుముచ్చు గోపాల్ యాదవ్‌లు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ సీటు కోసం పోటీ పడ్డారు. వారి ఆశలు నిరాశలయ్యాయి. బెజిపీ నుంచి కూడా ఇదే సీటు కోసం గారపాటి సీతారామాంజనేయ చౌదరి తీవ్ర ప్రయత్నం చేశారు. ఆయన బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా ఏలూరు పార్లమెంట్‌కు బిజెపీ కన్వీనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన తపన ఫౌండేషన్ ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరవయ్యారు. దీంతో బిజెపి వారంతా ఆయనకే సీటు వస్తుందని భావించారు.
స్థానికులు సహకరిస్తారా?
పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థానికుడు కాదనే ముద్ర బలంగా స్థానికుల్లో నాటుకొని పోయింది. అలాగే సీటు కోసం ప్రయత్నించి విఫలమైన నాయకులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానికులు సహకరిస్తారా? సహకరించాలంటే యనమల ఎలాంటి వ్యూహం రచిస్తారో అనే చర్చ ఏలూరు పార్లమెంట్ నియోజక వర్గం బిజెపి, జనసేన, టీడీపీ నేతల్లో సాగుతోంది.
వ్యూహాలు రచించడంలో యనమల దిట్ట
లాయర్ చదువుకున్న యనమల రామకృష్ణుడు వ్యూహాలు రచించడంలో దిట్ట. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు యనమల సింగిల్ హ్యాండ్‌తో డీల్ చేస్తారు. ఎంత సమస్యనైనా సింపుల్‌గా సొల్యుషన్ చూపడం యనమల స్పెషాలిటీ. ఒక్కో సారి చంద్రబాబు కూడా యనమలను ఆశ్చర్యపోతారు. కొండిరిగి పైన పడినా చలించడని, అంత గుండె నిబ్బరంతో ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదనే కితాబు కూడా చంద్రబాబు నుంచి యనమలకు వచ్చిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేత యనమల. అదంతా రంగరించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు అల్లుడు గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నారు. ఒకానొక సమయంలో సుజనా చౌదరి కూడా పోటీ పడిన ఏలూరు పార్లమెంట్ సీటును అందరినీ తెలివిగా తప్పించి చంద్రబాబు, బిజెపిలను ఒప్పించి తన అల్లుడికి ఇప్పించిన యనమలకి సహార నిరాకరణ చేస్తున్న వారినందరినీ ఒక గొడుకు కిందకు తీసుకొని రావడం పెద్ద కష్టమేమి కాదని చర్చించుకుంటున్నారు. అల్లుడు, అభ్యర్థి మహేష్ కుమార్ యాదవ్‌కి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఎన్ని వ్యూహాలు పన్నినా నాన్‌లోకల్‌నే ముద్ర నుంచి అంత సులువుగా బయట పడటం సాధ్యం కాదని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ తన బాధను వ్యక్తం చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.