రఘురామా.. సీటుపై మోజు వదల్లేవా!

టికెట్ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు.

Update: 2024-03-29 08:16 GMT
Source: Twitter

రానున్న ఎన్నికల్లో రఘురామకృష్ణ రాజు అభ్యర్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ నుంచి నరసాపురం టికెట్ లభిస్తుందన్న ఆయనకు కమలం పార్టీ మొండిచేయి చూపింది. దీంతో ఆయన టీడీపీలో చేరి.. తెలుగుదేశం తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. తాజాగా తన అభ్యర్థిత్వంపై రఘురామకృష్ణ క్లారిటీ ఇచ్చారు. నరసాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానన్న నమ్మకం తనకు ఇంకా ఉందని, పవన్, చంద్రబాబు, మోదీపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను ప్రజలు ఆదరించే ప్రసక్తే లేదని తనకు గట్టి నమ్మకం ఉందని మరోసారి అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేశారు.

నాకెందుకు అన్యాయం చేస్తారు
‘‘జగన్‌మోహన్ రెడ్డిని ఎదిరించినప్పుడు నన్ను జైల్లో పెట్టించారు. అప్పుడు చంద్రబాబు నాకు ఎంతో సహాయం చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకెందుకు అన్యాయం చేస్తారు. జైల్లోనే నన్ను చంపకుండా, నా పదవి పోకుండా అండగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు నాకు అన్యాయం చేస్తారన్న ఆలోచన కూడా లేదు. నాకు టికెట్ లభించడంపై నా నియోజకవర్గాల్లోని ప్రజలకే కాదు సీఎం జగన్‌ను ద్వేషించే ప్రతి ఒక్కరికీ ఉంది. కావున నాకు సీటు తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉంది’’అని వ్యాఖ్యానించారు.
అందుకే అంతరం వచ్చింది
తనకు బీజేపీ రాష్ట్ర అధిష్టానానికి మధ్య పరిచయం గానీ, సాన్నిహిత్యం గానీ అంతగా లేదని, అందుకే టికెట్ విషయంలో తమ మధ్య అంతరం వచ్చి ఉంటుందని చెప్పారు రఘురామ. తనకు మద్దతుగా వేల మంది ఫోన్లు చేశారని, ఈ క్రమంలోనే తనకు కూటమి వందకు వందశాతం న్యాయం చేస్తుందన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానంతో తనకు అంతరంపై కసరత్తులు చేస్తున్నానని, ప్రస్తుతం తమ మధ్య ఏకాభిప్రాయం ఏర్పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని వివరించారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలి
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నారని, వీటికి సంబంధించి హైదరాబాద్‌లో ఉన్న సీబీఐ కోర్టును జగన్.. 3వేల వాయిదాలు కోరారని గుర్తుచేశారు. ‘‘ఆ కేసులను త్వరగా విచారించాలని, ఇన్నాళ్లు న్యాయస్థానాకి రానందుకు జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రెండు పిటిషన్‌లు దాఖలు చేశాను. ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు.. ఏప్రిల్ 1న విచారించనుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రజాకోర్టులో సైతం ఆ ఉన్మాదిపై ఒంటరి పోరాటం చేస్తున్నాను. తనను అడ్డుకోవడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. నన్ను చంపడానికి, డిస్‌క్విలిఫై చేయడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు టికెట్ రాకుండా చేయడానికి పన్నిన పన్నాగాలు కూడా నిర్వీర్యం కానున్నాయి. ఆ ఉన్మాది.. పన్నాగాలు తెలిసే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న అంశాన్ని ముందుగా వెల్లడించలేదు’’అని తెలిపారాయన. అయితే నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని రఘురామ భావించారు. ఆ టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో.. తమ అభ్యర్థిగా రఘురామను కాదని అనూహ్యంగా శ్రీనివాస వర్మకు కేటాయిస్తున్నట్లు కమలం పార్టీ ప్రకటించింది.
Tags:    

Similar News