ఉండి టీడీపీలో రఘురామరాజు చిచ్చు

ఉండిలో తెలుగుదేశం పార్టీ మూడు ముక్కలైంది. 35ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ పాలన కోరుకున్న ఇక్కడి ఓటర్లు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

Update: 2024-04-12 07:15 GMT

ఉండి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నియోజక వర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్క సారి మినహా ప్రతి సారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. కే రామచంద్రరాజు వరుసాగా ఐదు సార్లు కాంగ్రెస్‌ను ఓడించారు. 2004లో పాతపాటి సర్రాజు కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొంది రామచంద్రరాజును ఓడించారు. తిరిగి 2009, 2014 ఎన్నికల్లో వి శివరామరాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గాలి విపరీతంగా వీచినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మంతెనరామరాజు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మంతెన రామరాజు(రాంబాబు)ను టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు మొదటి జాబితాలోనే ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉంది.

రఘురామ కలకలం..
నరసాపురం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణమరాజు ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సోషల్‌ మీడియాతో.. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడితో మాట్లాడుతూ ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినట్లు ప్రచారం చేసుకున్నారు. సుమారు 15 రోజులుగా తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు ఓట్లు వేయాలని నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం ప్రారంభించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామరాజుతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కు తోచని స్థితిలోకి వెళ్లాయి. రఘురామకృష్ణమరాజుకు తెలుగుదేశం పార్టీ టికెట్‌ ఇచ్చిందా.. ఇవ్వ లేదా.. అనే విషయం తెలుగుదేశం పార్టీ వారికి తెలియక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రఘురామ చేస్తున్న నాటకాలు కట్టిపెట్టక పోతే ఊరుకునేది లేదని పాలకొల్లు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉండి టీడీపీ కార్యకర్తలు అల్టిమేటం ఇచ్చారు. భారీ స్థాయిలో గుమికూడిన కార్యకర్తలు ఉండి నియోజక వర్గంపై క్లారిటీ ఇవ్వాలని నినాదాలు చేస్తూ చంద్రబాబుకు అడ్డు నిల్చున్నారు. సెక్యురిటీ వారు వారిని పక్కకు నెట్టి వేస్తూ చంద్రబాబును కారు వద్దకు తీసుకొని రావడం విశేషం. అంత జరిగినా చంద్రబాబు నుంచి ఒక్క మాట కూడా రాలేదు.
కలవపూడి శివ వేరు కుంపటి
వేటుకూరి వెంకట శివరామరాజు(కలవపూడి శివ) తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని.. తెలుగుదేశం పార్టీ తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో మంచి మెజారిటీతో శివరామరాజు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు టికెట్‌ ఇవ్వ లేదు. అయితే నరసాపురం పార్లమెంట్‌ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. పార్టీ ఆదేశానుసారం నరసాపురం పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణమరాజు చేతిలో ఓడి పోయారు. వైఎస్‌ఆర్‌సీపీలో తీవ్ర వివాదాస్పాదుడుగా మారి రాజకీయాలనే కలుషితం చేసిన వ్యక్తిని తిరిగి టీడీపీలోకి తీసుకొని మా నెత్తిపై కూర్చోపెట్టడం ఏమిటంటూ శివరామారాజు బగ్గుమంటున్నారు. తాను స్వల్ప తేడాతో మాత్రమే ఓడిపోయానని కలవపూడి శివ చెప్పడం విశేషం. ఇదే పార్లమెంట్‌ నుంచి 2019లో పోటీ చేసిన కొణిదల నాగబాబు మూడు స్థానానికి పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో రఘురామకృష్ణమరాజును చంద్రబాబు ఎందుకు ఎంకరేజ్‌ చేస్తున్నారో.. అర్థం కాక కలవపూడి శివ కూడా ఉండిలో ప్రచారం చేపట్టారు. అది ఎటువంటి ప్రచారమంటే.. ప్రతి రోజు ఎక్కడ చీకటి పడితే అక్కడ నిద్ర చేయడం.. పగలంతా ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దీంతో ఒక పక్కన మంతెన రామరాజుకు.. మరో పక్క రఘురామకృష్ణమరాజుకు చెమటలు పడుతున్నాయి.
పార్టీ అధ్యక్షురాలును వదలని కార్యకర్తలు
ఉండి తెలుగుదేశం కార్యకర్తలు పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటిని ముట్టడించారు. మధ్యలో రఘురామకృష్ణమ రాజు ఎవరంటూ నిలదీశారు. రామలక్ష్మి ఇంటి ముట్టడి కార్యక్రమం రోజంతా జరిగింది. ఈమె రాజ్య సభ ఎంపీగా కూడా గతంలో పని చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏమి చెప్పాలో.. కార్యకర్తలను ఎలా సముదాయించాలో అర్థం కాక ఆమె తలపట్టుకున్నారు.
జగన్‌ను వ్యతిరేకించాడనే రఘురామను పార్టీలో చేర్చుకున్నారా..
రఘురామకృష్ణమరాజు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీగా గెలిచిన నాటి నుంచి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. వరుసగా జగన్‌పై కేసులు పెట్టడం.. కోర్టులకెక్కడం.. సీబిఐ కేసులో విచారణ మొదలు పెట్టాలని కోరడం.. సీబిఐ.. ఇడీలకు ఒకటికి రెండు సార్లు బెయిల్‌ పిటీషన్‌ను రద్దు చేయించాలని కోరడం వంటి కార్యక్రమాలతో ఈ ఐదేళ్ల కాలం జగన్‌ను గుక్క తిప్పుకోకుండా చేశారు. చంద్రబాబుకు ఆ వ్యవహారం బాగా నచ్చినట్లుంది. అందుకే రఘురామకృష్ణమరాజును తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇక్కడ ఎవరి కొంపకు నిప్పు అంటిస్తాడో అని తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం. అయినా అవేవీ చంద్రబాబు చెవికి ఎక్క లేదు. కార్యకర్తలు బాబును నిలదీసినా పట్టించుకోలేదు. నినాదాలు చేసినా వారి వంక చూడ లేదు. ఇవి దేనికి సంకేతమనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీ పెట్టిన 40 ఏళ్ల కాలంలో 35 ఏళ్ల పాటు టీడీపీ అభ్యర్థులే ఇక్కడ పాలించారు. టీడీపీకి అంతటి బలమైన ఉండి నియోజక వర్గంపై ఇంత సందిగ్దత ఎందుకు?. అసలు చంద్రబాబు మనసులో ఏముంది?. ఈ నియోజక వర్గంపై చంద్రబాబు వ్యూహం ఏమిటి? అనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న తీవ్ర చర్చ.
Tags:    

Similar News