ఒక్క ఫొటో.. సీటునే లేకుండా చేసింది!

అధికార పార్టీ నేతలతో ఉన్న ఫోటోలు ఓ జనసైనికుడి తలరాతను మార్చేసింది. ఆ స్థానంలో జనంతో ఉన్న వ్యక్తి.. జన సైనికుడిగా తెరమీదకి వచ్చారు.

Update: 2024-04-06 02:40 GMT
ఔట్: భాస్కర్ రావ్, ఇన్: జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్

(ఎస్.ఎస్.వి..భాస్కర్ రావ్)

తిరుపతి: రాజకీయాల్లో ఏ క్షణమైనా.. ఏదైనా జరగొచ్చు..! కూటమి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన వ్యక్తిని అధికార పార్టీ ప్రతినిధులతో దిగిన ఫోటోల రూపంలో దురదృష్ట దేవత వెంటాడింది. జనానికి తెలియని ఆ జననేతను పక్కకు తప్పించి రెండవ కృష్ణుడిని తెరపైకి తీసుకువచ్చారు. కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో ఈ వ్యవహారం జరిగింది. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తూ వస్తున్నారు. 2004 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ వైభవం ప్రారంభమైంది.

దాదాపు 20 సంవత్సరాల తర్వాత రైల్వే కోడూరులో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని భావించిన వారికి నిరాశ ఎదురైంది. రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నాలుగుసార్లు, టీడీపీ ఐదు సార్లు, వైఎస్ఆర్‌సీపీ మూడు ఎన్నికల్లో విజయం సాధించింది. 1983 నుంచి 1999 వరకు టీడీపీ కంచుకోటగా ఉన్న రైల్వే కోడూరులో ఆ పార్టీ గెలిచి 25 ఏళ్లు కావస్తుంది.


నియోజకవర్గంలోని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, మండల పరిధిలో 1,82,655 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దళిత, గిరిజన ఓటర్లు 50 వేల మందికి పైగానే ఉన్నారు. దాదాపు 35 నుంచి 40 వేల మంది ఓటర్లు బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉంటే, కమ్మ, రెడ్డి, ముస్లిం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.

మధ్యేమార్గంగా తెరపైకి జనసేన

2024 ఎన్నికల కోసం టీడీపీ కూటమిలో నుంచి ఈ సీటు జనసేన దక్కించుకుంది. టీడీపీ నాయకుల్లో కుదరని సయోధ్య వల్ల ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి లేని పరిస్థితుల్లో సైకిల్ గుర్తు కూడా కనిపించకుండా పోయింది. రైల్వే కోడూరు శాసనసభ కాదు రాజంపేట పార్లమెంటు స్థానంలో కూడా బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండడమే. విషయానికి వస్తే.. టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ నేత, ఇంకో మాజీ ఎమ్మెల్సీ మధ్య సఖ్యత కొరవడింది.

మధ్య మార్గంగా మాజీ ఎంపీ ఏ. సాయి ప్రతాప్ మామ పైన పీవీఎస్ మూర్తి ద్వారా జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా పెనగలూరు మండలం ఎన్‌ఆర్ పురం దళితవాడకు చెందిన ఎనమల భాస్కరరావును ప్రకటించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు కలవరానికి గురయ్యారు. ముక్కూ ముఖం తెలియని వ్యక్తి పేరు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ వ్యక్తికి..

శాపమైన ఫోటోలు...

పెనగలూరు మండల వైఎస్ఆర్‌సీపీ జడ్పీటీసీ సభ్యుడు ఉదయగిరి సుబ్బరాయుడుకు స్వయాన చెల్లెలి కొడుకు అయిన పెనగలూరు మండలానికి చెందిన ఎనమల భాస్కరరావును జనసేన అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. బీటెక్ చదివిన భాస్కరరావు మొదటి నుంచి వైఎస్ఆర్‌సీపీ నాయకుల కనుసనల్లో ఉంటున్నారని చేసే విధంగా ఉన్న ఆయన ఫోటోలు వైరల్ అయ్యాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు వైఎస్ఆర్‌సీపీ నాయకుల కనుసనల్లో మెలుగుతుంటారని ఆధారాలను చూపుతూ, స్థానిక నాయకులు ఫిర్యాదులు చేశారు. రైల్వే కోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముక్క రూపానంద రెడ్డి, జనసేన రాష్ట్ర, జోనల్ నాయకులు దాతంశెట్టి నాగేంద్ర, జోగినేని మణి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కలిసి ఆధారాలు చూపించారని సమాచారం. అధికార పార్టీ నాయకులతో దిగిన ఫోటోలు ఆధారులుగా లభ్యం కావడంతో, యనమల భాస్కరరావు పేరు అభ్యర్థిత్వమే రద్దు చేసినట్లు చెబుతున్నారు. ఇలా ఆ వ్యక్తికి దురదృష్ట దేవత వెంటాడింది.


వరించిన అదృష్టం..

2024 ఎన్నికల పొత్తుల నేపథ్యంలో రైల్వే కోడూరు నుంచి ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వారిలో బీటెక్ చదివిన ఓబులవారిపల్లె మండలం ముక్కావారి పల్లి సర్పంచ్ అరవ శ్రీధర్ కూడా ఒకరు. రెండు రోజుల క్రితం వరకు అదృష్ట దేవత ఆయనతో దోబూచులాడిన ఎట్టకేలకు ఆయన ఆశలు ఫలించాయి. కూటమిలోని అన్ని పార్టీలు అరవ శ్రీధర్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపడంతో ఆయన పేరును ఖరారు చేశారు. చిన్న వయసులోనే ముక్కా వారి పల్లె పంచాయతీకి రెండోసారి ఆయన సర్పంచ్‌గా ఉన్నారు. రైల్వే కోడూరు శ్రీధర్‌ను పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి అప్పటివరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కీలక నాయకులందరూ హాజరు అయ్యారు. ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.

కలసి వచ్చిన నేతలు

మొదట స్తబ్దతగా ఉన్న కీలకమైన వర్గాల్లో కమ్మ, సామాజిక వర్గం నాయకులు, టీడీపీ శ్రేణులు కలిసి వచ్చాయని వాతావరణం చెబుతోంది. రైల్వే కోడూరు నియోజకవర్గం చరిత్రలో రాజకీయంగా ఇలాంటి ఉపద్రవాన్ని చవిచూసిన దాఖలాలు లేవు. ప్రధాన కారణం నియోజకవర్గంలో ఒంటిచేత్తో నడిపిన టీడీపీ నాయకుడు, స్పిన్ ఫెడ్ మాజీ చైర్మన్ కట్టా నారాయణయ్య భౌతికంగా లేకపోవడం ఒక కారణమైతే.. ఆయన కుమారులు ఇద్దరు నాయకత్వ లక్షణాలు కోల్పోవడం మరో కారణంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రైల్వే కోడూరు మండలాల్లో సమీకరణలు కూడా మారే అవకాశాలు లేకపోలేదని ఆశాభావం వ్యక్తం అవుతుంది.


కల్లోలానికి కారణాలు ఇవే..

2014 ఎన్నికలకు పూర్వం టీడీపీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా చిట్వేలి మండలం ఎగువపల్లికు చెందిన కస్తూరి విశ్వనాథం నాయుడును టీడీపీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు నియమించారు. తిరుపతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడిన విశ్వనాథ నాయుడు ఇటీవల కాలంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి టచ్‌లోకి వెళ్లారని తెలిసింది. ఆ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి విభేదించి బయటకు వచ్చిన ముక్కా రూపానంద రెడ్డికి టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆర్థికంగా, రాజకీయంగా స్థిరంగా ఉన్న ఆయన పార్టీ శ్రేణులను సమీకరించడంలో విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కోడూరు సెగ్మెంట్ జనసేన ఖాతాలోకి వెళ్ళింది.

ఇన్‌చార్జ్ల వైఫల్యం వల్ల టీడీపీ అభ్యర్థిగా రెండుసార్లు ఓటమి చెందిన పంతగాని నరసింహ ప్రసాద్‌కు టికెట్ ఇచ్చి ఉంటే.. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎన్నికల తీరు విభిన్నంగా ఉండేదని చెబుతున్నారు. పంతగాని నరసింహ ప్రసాద్ మాజీ మంత్రి, నటుడు, నిర్మాత డాక్టర్ ఎన్ శివప్రసాద్‌కు స్వయానా అల్లుడు. శివప్రసాద్ చంద్రబాబు నాయుడుకు సహ విద్యార్థి.. నియోజకవర్గ నాయకుల మాటలు విని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు చేతులు కాల్చుకున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన అభ్యర్థిని మార్పు చేయడం వల్ల పరిస్థితి కొద్దిగా అనుకూలించే వాతావరణం ఉందని భావిస్తున్నారు.

బత్యాలను ఎందుకు కాదన్నారు..?

నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ పెత్తనం సాగేది. కట్టా నారాయణయ్య మరణం ఆ తర్వాత .. 20 నుంచి 25 వేల ఓట్లను ప్రభావితం చేయగలిగిన సత్తా ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడుకు కూడా ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన రాజంపేట నుంచి టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. ఈయనకు కూడా రాజంపేట అసెంబ్లీ స్థానంలో టికెట్ దక్కలేదు.

బత్యాల బలప్రదర్శన

బత్యాల బల ప్రదర్శన

గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఎక్కడి నుంచి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైల్వే కోడూరులో శుక్రవారం ఆయన తన అనుచరులతో భారీ బల ప్రదర్శన నిర్వహించారు. మళ్లీ రాజంపేట పట్టణంలో కూడా తన సత్తా ఎంతో చూపించడానికి బల ప్రదర్శనకు సమాయత్తమవుతున్నట్లు బత్యాల అనుచరుల ద్వారా తెలిసింది. ఆ తర్వాత కూడా విజయవాడలో తన బలాన్ని చాటి చెప్పడానికి జనంతో ప్రదర్శన నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యంగా టీడీపీ నుంచి టికెట్ కోసం ఆయన ఒత్తిడి పెంచడానికి ఈ కార్యక్రమాలకు పూనుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో ఏం జరిగింది..

1999 ఎన్నికల్లో రైల్వే కోడూరు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డాక్టర్ గుంటి వెంకటేశ్వర ప్రసాద్ ఓటమి చెందారు. 2004లో మళ్లీ ఆయన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా టికెట్ సాధించారు. ఈ ఎన్నికలను గెలిపించి తీసుకువస్తే ఎమ్మెల్సీ సభ్యత్వం ఉంటుందని బత్యాల చంగల్‌రాయుడుకు ఆ రోజుల్లో టాస్క్ ఇచ్చారని తెలిసింది. మేరకు పని చేసిన బత్యాల చంగల్ రాయుడు సహకారంతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు కూడా బత్యాల పార్టీకి సహకారం అందిస్తే రాజకీయంగా ఆయనకు మేలు జరుగుతుంది కదా..! అని ఆనాటి విషయాలను రైల్వే కోడూరు ప్రాంత నాయకులు ప్రస్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది వేచి చూద్దాం..!

కొరముట్లకు కాలం కలిసి వస్తోందా!?

కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుకు కలిసి వస్తాయా? అనే విషయం పైన లెక్కలు ఇస్తున్నారు వేస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో... వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు 2009లో 39,359 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా 2012 ఉప ఎన్నికల్లో 34,465 ఓట్లు, 2014లో 64, 848 ఓట్లు, 2019 ఎన్నికల్లో ఆయన వరుసగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన విజయం నల్లేరు మీద నడక అవుతుందా..? కాస్త కష్టపడాలా అనే విషయాలపై పార్టీ నాయకులు సమీక్షలో తన మొనగాళ్లుగా ఉన్నారు.



Tags:    

Similar News