అనపర్తి సీటు చేతులెలా మారిందంటే...

అనపర్తి టికెట్‌పై టీడీపీలో అసమ్మతి మొదలైంది. తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సీటును వేరే పార్టీకి ఎలా ఇస్తారని టీడీపీ నేత రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Update: 2024-03-28 13:08 GMT
Source: Twitter

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో అనపర్తి సీటు హాట్‌ సీట్‌గా మారింది. తొలుత టీడీపీకి కేటాయించిన ఈ సీటుపై ఇటీవల చర్చలు చేపట్టి బీజేపీకి అందించారు. కానీ అంతకుముందే ఇక్కడి నుంచి తమ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేయనున్నారని టీడీపీ ప్రకటించింది. ఇప్పుడు ఈ సీటును బీజేపీకి కేటాయించడంపై నల్లమిల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిని ప్రకటించాక సీట్లను ఎలా మారుస్తారని పార్టీ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు. తనకు కేటాయించిన సీటు అకస్మాత్తుగా వేరే పార్టీకి కేటాయించడం వెనక వైసీపీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

బదిలీ వెనక వైసీపీ హస్తం
అభ్యర్థిగా తనను ప్రకటించిన అనపర్తి సీటును ఒక్కసారిగా బీజేపీకి ఎలా ఇస్తారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ‘‘బీజేపీ-వైసీపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందంతోనే అనపర్తి సీటును నాకు కాకుండా చేశారు. వారు చేసిన కుట్ర ఫలించి ఈ సీటు బీజేపీ బ్యాగ్‌లోకి వెళ్లింది. పార్టీ కోసం ఎంతో శ్రమించిన తనకు ఇది తీరని అన్యాయమే. టీడీపీ తనను నమ్మించి మోసం చేసింది’’ అని ఆగ్రహించారు రామకృష్ణారెడ్డి. ఇదిలా ఉంటే అనపర్తి టికెట్‌ను బీజేపీ.. శివకృష్ణం రాజుకు కేటాయించింది. ఈ మేరకు బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో అనపర్తి కూడా ఉండటం, అక్కడి నుంచి శివకృష్ణం రాజు పోటీ చేయనున్నట్లు ఉండటంతో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. దీని వెనక వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
రాజీనామా యోచనలో రామకృష్ణ
పార్టీ తనకు చేసిన తీవ్ర అన్యాయంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన టీడీపీకి రాజీనామా చేసిన అనపర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనుచరులు సూచించారని సమాచారం. అందుకు రామకృష్ణారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారని, దీంతో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పడంపై యోచిస్తున్నారని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. తనకు సీటు డిమాండ్‌పై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూసిన తర్వాత రాజీనామా విషయంపై ఆయన ఓ నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.


Tags:    

Similar News