సీమ రాజకీయ తెరపై వారి జీవితం ఓ ఆదర్శ సంతకం..!
రాజకీయం ఉద్యోగమైతే.. విరమణ కూడా ఉండాలి. కొందరు రాయలసీమ నేతలు ఈ మాటను అక్షర సత్యం చేశారు.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: రాయలసీమలో రక్తాక్షరిని చెరిపి వేస్తూ, రాజకీయాల నుంచి స్వచ్ఛంద రిటైర్మెంట్ ప్రకటించిన కొందరు ఆదర్శంగా నిలిచారు. మరొకరు సన్యాసం స్వీకరించారు. నేటితరం రాజకీయాలకే కొత్త నిర్వచనం చెప్పిన రాయలసీమలోని ఆదర్శవంతమైన వ్యక్తులు ఆ సందేశం ఇచ్చారు. రాయలసీమ అంటే .. కక్షలు, హత్యలు, ఫ్యాక్షన్ అనేది ఎప్పటి మాటో.. ఆదర్శవంతమైన రాజకీయాలకు తమ జీవితాలను అంకితం చేసిన ఆణిముత్యాలకు నెలవు అనేది సత్యం.
అందులో.. రాజకీయాలకు స్వస్తి చెప్పి, ఆస్తులు దానధర్మాలు చేసి, సన్యాసం స్వీకరించిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు. రాజకీయాలంటే వ్యాపారం కాదు. ఆదర్శంగా ఉండాలనే కాదు. చేతల్లో చూపిస్తూ, దారిద్యం అనుభవించిన రాజకీయ దివిటీలు మరో ఇద్దరు. ఇలాంటి ఆదర్శవంతమైన జీవితాలను చూసిన ప్రస్తుత పాలకులు కళ్ళు తెరవకపోగా.. ఉద్యోగులకే కాదు.. రాజకీయాల్లో కూడా బదిలీలు ఉంటాయని కొత్త భాష్యం చెబుతున్నారు. రాజకీయాల్లో విరమణ ఉండాలని ఆచరణలో చూపించిన నాయకులు ఎలా వ్యవహరించారంటే..
విభిన్నమైన శైలి..
చిత్తూరు జిల్లాలో పార్టీలతో పాటు కొన్ని కుటుంబాలు రాజకీయాలను శాసిస్తాయి. ఆ కోవలో నిలిచేవి పీలేరు ( వాల్మీకిపురం), తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు ( పలమనేరు) ప్రాంతాల్లో కనిపిస్తాయి. అందులో ప్రధానంగా నూతన కాల్వ రామకృష్ణారెడ్డిది విభిన్నమైన శైలి. సైకిల్ పంచకట్టు, గుబురు మీసాలతో ఎప్పుడు తమలపాకు, వక్కలు నములుతూ.. కనిపించే ఎన్. రామకృష్ణారెడ్డి అంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కూడా దడే. చంద్రబాబు నాయుడుని ధైర్యంగా నిగ్గదీసే ధైర్యం కలిగిన నాయకుడు నూతన కాల్వ రామకృష్ణారెడ్డి. సర్పంచ్‌గా 1981లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 2004లో ఎంపీ హోదాలో ఆయన రాజకీయాలకు స్వచ్ఛందంగా విరమణ పలికారు.
పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలం కెలవాతి గ్రామానికి చెందిన నూతన కాల్వ రామకృష్ణారెడ్డి 1936 జనవరి 14వ తేదీ జన్మించారు. 1981- 85 చౌడేపల్లి పంచాయతి సమితికి ఎన్నికయ్యారు. 1983లో జడ్పీ చైర్మన్‌గా పని చేశారు. . 1985 నుంచి 1994 వరకు పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రామకృష్ణారెడ్డి, 1996 నుంచి 2004 వరకు చిత్తూరు ఎంపీగా ఉన్నారు.
2004 లో విరమణ
టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుపై అలిపిరి బాంబు దాడి ఘటన నేపథ్యంలో ఏడాదికి ముందే 2004లో ఎన్నికలు జరిగాయి. ప్రచారం కోసం పుంగనూరులో జరిగిన ప్రచార సభలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో రామకృష్ణారెడ్డి రాజకీయాలకు సెలవు ప్రకటించారు. అంతకుముందే 1996 ఉప ఎన్నికల్లో తన కుమారుడు అమర్నాథ్ రెడ్డిని పొంగనూరు నుంచి పోటీ చేయించి గెలిపించారు. 2004లో కూడా పుంగనూరు నుంచి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత నియోజకవర్గం అనంతరం పలమనేరులో అమర్నాథ్ రెడ్డి గెలిచారు.
"గల్లా ' వారసుల శాశ్వత విరమణ
దశాబ్దాల చరిత్ర కలిగిన గల్లా కుటుంబం రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగింది. రాజకీయవేత్త తండ్రి రాజగోపాల్ నాయుడు వారసురాలిగా మూడు దశాబ్దాల క్రితం అరంగేట్రం చేసిన గల్లా అరుణకుమారి 2019 ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో ఎంపీగా ఎన్నికైన పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కూడా రాజకీయాలను శాశ్వతంగా తప్పుకున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలోని రెండు కుటుంబాలు పదవులు, రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమించుకున్నాయి.
చంద్రబాబుకు గురువు
స్వాతంత్ర ఉద్యమకారుడిగా, రైతు నాయకుడిగా పేరు సంపాదించుకున్న పాటూరు రాజగోపాల్ నాయుడు 1950- 1960 లో ఎన్జీరంగా సహచరుడిగా రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఈయనను టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు గురువుగా చెప్పుకుంటారు. పార్లమెంటేరియన్‌గా, రచయితగా సేవలు అందించిన పాతూరి రాజగోపాల్ నాయుడు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు..
తండ్రి బాటలో..
తండ్రి పాతూరి రాజగోపాల్ నాయుడు (రాజన్న) కుమార్తె గల్లా అరుణకుమారి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1989లో తొలిసారిగా చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1994 నుంచి 2014 వరకు గలరుకుమారి ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు విజయం సాధించారు. 2004- 2014 లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కే రోశయ్య, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆమె రాష్ట్ర విభజన నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత టిడిపిలో చేరిన ఆమె 2014 ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి 2019 ఎన్నికల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. ఇప్పుడు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు.
తల్లి బాటలో..
పాతూరి రాజగోపాల్ నాయుడు మనవడు, గల్లా అరుణ కుమారి కుమారుడు గల్లా జయదేవ్ టిడిపి నుంచి 2014 ఎన్నికల్లో.. గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన ఆయన 2019లో గెలిచారు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎదురైన కొన్ని సవాళ్లు నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. తండ్రి గల్లా రామచంద్ర నాయుడు వారసుడిగా అమర్ రాజా కంపెనీ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు సామాజిక కార్యక్రమాలకు పరిమితమవుతామని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలో రెండు కుటుంబాలు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నాయి. ప్రస్తుతం తాత రాజన్న ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే, రాయలసీమ రాజకీయాల్లో మరో ఆణిముత్యం, వైరాగ్యంలోకి వెళ్ళింది.
సన్యాసం స్వీకరించిన శివ రాముడు
మాటల్లో మెత్తదనం. చేతల్లో గట్టితనం కలిగిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వడ్డేమాను శివరామకృష్ణ రావు వైరాగ్యంతో సన్యాసం స్వీకరించారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన శివరామకృష్ణ రావు 2021 ఏప్రిల్‌లో సన్యాసం స్వీకరించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నుంచి శివరామకృష్ణ రావు 1972లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన 1978లో గెలుపొందారు. 9183, 1985లో ఓడిపోయారు. 1989లో మళ్ళీ గెలిచారు. 1994 నుంచి 2001 వరకు జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములు చూశారు. అన్నిసార్లు ఆయనకు టికెట్ రావడానికి కారణం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న అనుబంధం. శివరామకృష్ణ రావును డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి.. స్వామి అని పిలిచే గౌరవం అభిమానం కలిగిన వ్యక్తి.
ఆదర్శం ఆయన జీవితం
అనంతపురం జిల్లా ధర్మవరం చెందిన జి. నాగిరెడ్డి ఆదర్శవంతమైన నాయకుడు. టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావుతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారిలో ఒకరైన గుండమ్మగారి నాగిరెడ్డి 1983 నుంచి 89 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన ఆదర్శవంతమైన జీవితం సాగించారు. అవినీతి మచ్చ లేకుండా జీవనం సాగించిన ఆయన కటిక దరిద్రాన్ని అనుభవించారని చెబుతారు. ఆసుపత్రిలో ఉన్న కుమారునికి చికిత్స చేయించుకునేందుకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది. నాగిరెడ్డి మాటలు విన్న ప్రేక్షకుల్లో ఆటో రిక్షా వాళ్లు కూడా స్పందించి ఆర్థిక సహాయం అందించారు అంటే ఆయన ఎంతటి దయనీయస్థితిని అనుభవించారనేది ఈ సంఘటన చెబుతుంది.
ఇలా ఎన్నో కుటుంబాలు..
చక్రం తిప్పిన అనేక కుటుంబాలు, వ్యక్తులు రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమించారు ఆ కోవలో కడప జిల్లా చెందిన కందుల కుటుంబం కూడా ఒకటి. కందుల రాజమోహన్ రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా కూడా పనిచేశారు. రసం ఆ కుటుంబ ఉనికి కనిపించడం లేదు. అదే కోవలో పులివెందులలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డినీ ఓడించిన డిఎన్ రెడ్డి, రాయలసీమ ఉద్యమంతో పరుగులు పెట్టించిన ఎంవీ రమణారెడ్డి వారసులు కూడా లేరు. అంతకు ముందు నుంచే రాయలసీమ ఉద్యమానికి తిరుపతిలో ఊపిరి పోసిన సీనియర్ నాయకుడు ఎమ్‌వి మైసూరారెడ్డి కూడా రాజకీయంగా కనిపించడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపురం కర్నూలు జిల్లాల్లో కూడా రాజకీయంగా చక్రం తిప్పిన అనేక కుటుంబాలు రాజకీయ యవనిక నుంచి దూరమయ్యాయి.