చర్చకు 'సిద్ధమా'? జగన్ కు సవాల్ విసిరిన సీఎం
కడపలో పదునైన అస్త్రాలు సంధించిన సీఎం చంద్రబాబు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-09-01 12:42 GMT
కడప జిల్లా పర్యటనలో సీఎం ఎన్. చంద్రబాబు అనేక అంశాలపై వైసీపీకి సవాళ్లు విసిరారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? అని కూడా ఆయన మాజీ సీఎం వైఎస్. జగన్ ను ఉద్దేశించి నేరుగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో వైఎస్. జగన్ కూడా పులివెందుల పర్యటనకు రావడం గమనార్హం.
ఉమ్మడి కడప జిల్లా (అన్నమయ్య జిల్లా) రాజంపేట మండలం మునక్కాయలపల్లెలో సీఎం ఎన్. చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేయడానికి హాజరయ్యారు. సోమవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చంద్రబాబు మన్నూరు వద్ద ఏర్పాటు చేసిన హెలీపాడ్ కు చేరుకోవాలి. నిర్ణీత సమయానికి గంట ఆలస్యంగా ఆయన వచ్చారు. అనంతరం బోయినపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక నుంచి సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా ప్రసంగించారు. వైసీపీ నేతలను ప్రధానంగా మాజీ సీఎం వైఎస్. జగన్ ను ఉద్దేశించి ఏమన్నారంటే...
"సిద్ధం.. సిద్ధం అని ఎగరతావుండారు. దేనికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చిద్దాం. అసెంబ్లీకి వస్తారా" అని సీఎం చంద్రబాబు నిలదీశారు.
"మీ ప్రభుత్వంలో అర్హులకు సరిగా పింఛన్లు ఇచ్చారా? కులవృత్తులకు తోడ్పాటు ఇవ్వాలన లక్ష్యానికి పునాది వేసింది నేను" వీటిపై చర్చిద్దామా అని కూడా సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
"రాయలసీమ రాళ్లసీమగా మార్చారు. దీనిని రతనాల సీమగా మార్చడానికి ఓ యజ్ణం చేస్తున్నా" అని సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమలో మీరు (వైఎస్. జగన్) రక్తం పారించాలని చూశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం హంద్రీనీవా కాలువలో చివరి ఆయకట్టు కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు నీరు పారించడం ద్వారా టీడీపీ ఎంచుకున్న లక్ష్యాన్ని సాకారం చేశామని ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు వివేకా హత్య కేసులో గొడ్డలి పోటుపై కూడా అసెంబ్లీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు సీఎం చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు.
సంపద సృష్టి.. ఆదాయం పెంపు
రాష్ట్రంలో ప్రజల జీవనప్రమాణాలు పెంచడానికి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.
"సంస్కరణలు అమలు చేయడం ద్వారా సంపద సృష్టించడం నా ముందు ఉన్న కర్తవ్యం. ఆ సంపదను కూడా ప్రజల సంక్షేమానికి వెచ్చించి, పేదరికం రూపుమాపడానికి ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా" అని చంద్రబాబు వివరించారు.
"రాష్ట్రం కోసం నేను యంత్రంలా పనిచేయడమే కాదు. అధికారులతో కూడా పనిచేయిస్తున్నా. దీనికి ఉద్యోగులు, ప్రజల సహకారం అవసరం" అని ఆయన కోరారు.
ఆదరించండి అండగా ఉంటాం..
ఆదాయం పెంచడం ద్వారా ఉపాధి కల్పించడానికి కార్యక్రమాలు అమలు చేస్తున్నానని సీఎం చంద్రబాబు తన లక్ష్యాన్ని వివరించారు. మీ భవిష్యత్తు (ప్రజల కోసం శ్రమిస్తున్న టీడీపీ, కూటమి పార్టీలకే మళ్లీ అవకాశం ఇవ్వండి అని రానున్న ఎన్నికలకు కూడా ముందస్తుగానే ఆయన కోరారు. మధ్యలో ఐదేళ్లు ఆదరించని కారణంగా ఎంతమేరకు నష్టపోయారు? రాష్ట్రాభివృద్ధికి ఏర్పడిన ప్రతిబంధకాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ కూటమిని మళ్లీ అదరిస్తే, మరింత అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో రాజంపేటకు చేరుకున్న సీఎం ఎన్. చంద్రబాబుకు మన్నూరు వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్థనరెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు అధికారులు, టీడీపీ నేతలు స్వాగతం పలికారు.