Rayalaseem Lift | సీమ రైతులకు తీరని కష్టాల ఎత్తిపోతలు
రెండు రాష్ట్రాల మధ్య మరో సమస్య తెరపైకి వచ్చింది. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతలకు ఎన్జీటీ బ్రేక్ వేసింది. సీఎం ఏమి చేస్తున్నారనే ప్రశ్నిస్తున్నారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-22 05:42 GMT
రాయలసీమలో వ్యవసాయానికి నికరజలాల కేటాయింపు జరగలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (Pothireddypadu Head regulator ) సామర్థ్యం పెంచడానికి ఉద్దేశించిన ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ కేంద్ర అనుమతి నిరాకరించింది. దీనివల్ల అదనంగా 23 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశం లేకుండా పోయింది.
వైసీపీ కాలంలో తీసుకువచ్చిన ఈ పథకాన్ని ఆపాలనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (National Green Tribunal - NGT ) ఆదేశంపై టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించలేదు. అంతకుముందే ఎన్టీజీ ముందు వాదనలు బలంగా వినిపించలేదనేది కూడా ఆరోపణ. దీనివల్ల సీమ ప్రాంత రైతాంగానికి నష్టం జరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఉన్న జలజగడాలు తీరకుండానే, మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది.
రాయలసీమ ప్రాంత ప్రయోజనాల కంటే అధికార పార్టీపై విపక్షం విమర్శలు సంధించడానికి అస్త్రం దొరికినట్టుగానే కనిపిస్తోంది. రాయలసీమ ప్రాంత హక్కుల పరిరక్షణకు ఎవరికి వారు ఛాంపియన్లుగా చెప్పుకోవడానికి శతవిధాల ప్రయత్నిస్తుండడం గమనార్హం.
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు నిరాకరించడం ద్వారా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడిందని రాయలసీమ రైతులు, సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ సేద్యపునీటి అవసరాలకు ఇప్పటి వరకు వాడుకుంటున్న 40 వేల క్యూసెక్కుల నీటి తరలింపునకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా అనుమతుల నిరాకరణ రాయలసీమ రైతాంగానికి శరాఘాతమేనని అభిప్రాయపడుతున్నారు.
ఈ విషయంలో ..
తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం. కేంద్ర పర్యావరణ శాఖ వద్ద వాదనలు వినిపించడంలో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం (TDP coalition governmen) అలసత్వంతో వ్యవహరించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ( NDA) ప్రభుత్వంలో టీడీపీ కూటమి భాగస్వామిగా ఉంది. ఒకనాటి తన సహచరుడైన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ (Telangana Congress)సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్టాడుతూ,
"రాయలసీమ ప్రాంతంలో పార్టీలు, సంఘాల ఏకాభిప్రాయం ఉండాలి. బచావత్ అవార్డు ట్రిబ్యునల్, చట్టం మేరకు హక్కుల సాధన కోసం పాలకులపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది" అని గుర్తు చేశారు. ఏపీ విభజన చట్టం (AP State Reorganization Act) లో ప్రస్తావించిన హక్కులు సాధించుకుంటే రాయలసీమ రైతులకు మేలు జరుగుతుందని బుజ్జా అభిప్రాయపడ్డారు. ఏపీ అంటే అమరావతి (Amaravati), పోలవరం (Polavaram) మాత్రమే కాదనే విషయం గుర్తించాలన్నారు. అన్ని పార్టీలు రాయలసీమ నీటి ప్రాజెక్టులపై తమ విధానం ప్రకటించాలని కూడా ఆయన కోరారు.
800 అడుగులు ఉంటేనే..
శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల మేరకు నీటి మట్టం ఉంటే మినహా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించలేని పరిస్థితి. దీంతో గత ప్రభుత్వ కాలంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. అదనపు నీరు కాదు. కనీసం ఉన్న నీటిని కూడా తీసుకునేందుకు వీలులేని స్థితిలో ఈ ప్రాజెక్టుకు మళ్లీ అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో విధివిధానాలను జారీ చేయాలని గత నెల 27వ తేదీ జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీంతో..
శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలించుకోడానికి వీలుగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ మంత్రి ఎన్. ఉత్తమకుమారరెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్శదర్శి రాహుల్ బుజ్జా లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర అటవీశాఖ నిపుణుల కమిటీ (ఎక్స్ పర్ట్ అండ్ అప్రైజర్ కమిటీ ) రాయలసీమ ఎత్తిపోతల పథకం సామర్థ్యం పెంపుదల కాదు. కదా, నీటిని ఎత్తిపోయడానికి కూడా అనుమతి నిరాకరించింది.
"ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయం" అని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమారరెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతపురానికి చెందిన "అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి" అధ్యక్షుడు కెవి. రమణ ఏమన్నారంటే..
"కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం ఎటువంటి అర్హతలు లేకున్నా అప్పర్ బద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. పనులు శరవేగంగా జరగడాన్ని గమనించిన గత వైసిపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యంపెంచి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పర్యావరణ అనుమతులు రాకుండా కేంద్రం దగ్గర ఫిర్యాదు చేసి, పనులను నిలబెట్టే ప్రయత్నం చేశారు" అని రమణ ఆరోపించారు.
"పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా హక్కుగా కేటాయించిన 44 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటున్నామని ఈఏసి ఎదుట కూటమి ప్రభుత్వం వాదించలేకపోయింది. దీంతో రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపివేయమని పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చింది" అని రమణ ఆరోపించారు.
ఆ.. కాలువలతో ఎవరికి మేలు
కృష్ణా నదిపై శ్రీశైలం వద్ద నిర్మించిన భారీ బహుళార్థక సాధక ప్రాజెక్టు. జలవిద్యుత్తు (Hydropower) ప్రాజెక్టుగానే ప్రతిపాదించినా, తరువాతి కాలంలో నీటిపారుదల అవసరాలకు కూడా చేర్చడం వల్ల మూడు లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టుకు గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అంటే 223 టీఎంసీలు నిలువ చేయడానికి వీలవుతుంది.
తెలంగాణ : శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కాలువ (Srisailam Project Left Branch Canal SLBC) ద్వారా 900 మోగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా యంత్రాలు అమర్చారు. తద్వారా విడుదల అయ్యే నీరు కాలువల నుంచి తెలంగాణలో మూడు లక్షల ఎకరాలకు సేద్యం జరుగుతోంది.
రాయలసీమ:శ్రీశైలం కుడికాలువ (Srisailam Project Right BranchCanal SRBC)ద్వారా కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే 16.4 కిలోమీటర్ల కాలువ నుంచి బనకచర్ల క్సాన్ రెగ్యులేటర్ కు చేరుతుంది. ఇక్కడియ నుంచి కుడి రెగ్యులేటర్ నుంచి బ్రాంచి కాలువ ద్వారా కడప, కర్నూలు జిల్లాల్లో 1.90 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి ఆదరువుగా ఉంది. గోరకల్లు బ్యాలెన్సింగ్ జలాశయానికి అంటే 112.7 కిలోమీటర్ల దూరంలోని అవుకు జలాశయానికి నీరు చేరుతుంది. కృష్ణా నది వద్ద శ్రీశైలం ప్రాజెక్టు వద్ద లభించే అదనపు నీటిని ఈ జలాశయాలకు మళ్లించే పథకం ఇది కావడం గమనార్హం.
వివాదానికి కారణం ఏమిటి?
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడానికి వీలుగా, అదనపు నీటిని తోడడానికి కృష్ణా నదిలో పైప్ లైన్ వేసే పనులు సాగుతున్నాయి. దీని పెంపుదల కోసం వైసీపీ ప్రభుత్వ కాలంలో తొమ్మిది కిలోమీటర్ల వరకు పనులు ప్రారంభించారు దీనిపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుపెడుతూనే ఉంది. అటు తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కూటమి భాగస్వామిగా ఉంది. కాగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదలకు కృష్ణా నదిలో సాగుతున్న నిర్మాణ పనులపై తెలంగాణ ప్రభుత్వ లేఖలు, ఫిర్యాదులను కేంద్ర పర్యావరణ శాక పరిగణలోకి తీసుకోవడం. పోతిరెడ్డిపాడు వద్ద పనులు ఆపాలనే ఆదేశాల నేపథ్యంలో మళ్లీ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడేందుకు ఆస్కారం కల్పించింది.
చోద్యం చూస్తున్నారా?
శ్రీశైలంలో 800 అడుగుల లోనే విద్యుత్ పేరు మీదుగా తెలంగాణ నీటిని కిందికి వదిలేస్తున్నది 800 అడుగుల నుంచే పాలమూరు- రంగారెడ్డి, దిండి అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు మళ్లిస్తున్నది, వీటిని ఆపివేయమని ఎన్జీటి ఉత్తర్వులు ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం 900 కోట్లతో శరవేగంగా పనులు జరుపుతున్నది. అయినా కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. శ్రీశైలంలో 880 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించలేని పరిస్థితి,అందుకే గత వైసిపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేస్తున్నారు.
అనంతపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
"సీఎం చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోతారు" అని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"విభజన చట్టం కింద ఏపీకి హక్కు 101 టీఎంసీల నీటిని వినియోగానికి మాజీ సీఎం వైఎస్. జగన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో ఎన్టీటీలో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు కేసులు వేయించారు" అని ఆరోపించారు.
"తెలంగాణ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల ద్వారా రోజుకు 2 టీఎంసీల నీటిని 798 అడుగుల ఎత్తు నుంచే తోడేసి డ్యాంను పూర్తిగా ఖాళీ చేస్తుంటే సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు" అని కూడా వ్యాఖ్యానించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీలో కేసుపై వాదనలు వినిపించలేక చేతులెత్తేశారా? లేక రేవంత్‌తో చేతులు కలిపారా? అనే అనుమానాలు ఉన్నాయి" అన్నారు.
పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల 80 టీఎంసీల లైవ్ స్టోరేజ్ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇది రాయలసీమ, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అది వైసీపీ మానసపుత్రిక
హంద్రీనీవా ప్రాజెక్టును దివంగత వైయస్సార్ 40 టీఎంసీలతో తీసుకొస్తే, రాయలసీమ రైతాంగానికి మేలు చేస్తుందని మరో 23 టీఎంసీలు పెంచడానికి వీలుగా పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడానికి వైఎస్. జగన్ ప్రాధాన్యతగా తీసుకున్నారు. దీనికోసం మాల్యాల నుంచి జీడిపల్లి వరకు కాలువలను వెడల్పు, లైనింగ్ పనులు, పంప్‌హౌస్‌ల నిర్మాణం చేసి, ప్రాజెక్టు కెపాసిటీని 63 టీఎంసీలుకు పెంచారు. చివర ఉన్న చిత్తూరు జిల్లాకు నీరు పారించాని గాలేరు-నగరికి 56వ కి.మీ. నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 79వ కి.మీ. వరకు రూ.3 వేల కోట్లతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలుపెట్టి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ. 1500 కోట్లు ఖర్చు చేశారు.
చిత్తూరు జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చక్రాయపేట ప్రాంతాలకు నేరుగా 20 టీఎంసీలు తీసుకెళ్లాలని తలచారు. దీనిద్వారా రాయలసీమలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు తోపాటు 700 చెరువులకు కొత్తగా ఏర్పడిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు అన్నింటికీ నీరందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. వృథాగా సముద్రంలో కలిసే నీటిని గాలేరు-నగరి నుంచి గండికోటకు నీరు తరలించేందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేశారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (Netional Green Tribunal - NGT ) అడ్డుపుల్ల వేసినా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక ఇది తమ నేతకు మంచిపేరు తెస్తుందనే అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనివల్ల డోన్ నియోజకవర్గంలో 63 చెరువులు, జీడిపల్లి నుంచి బీటీపీకి 114 చెరువులు, పుట్టపుర్తి నియోజకవర్గంలోని 119 చెరువులకు నీటిని తరలించే అవకాశం లేకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపుదలకు ఎన్టీజీ అడ్డుపుల్ల వేయడం అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టడానికి పార్టీలకు అవకాశంగా లభించింది. దీనిపై ప్రతిపక్షం ఎలాంటి పోరాటం సాగిస్తుంది. తన కర్తవ్యం ఏమిటనేది మాత్రం చెప్పకపోవడం, దీనిపై టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా స్పందించపోవడం గమనార్హం. దీంతో రాయలసీమ రైతులకు దగా పడడం సర్వసాధారణంగా మారింది.
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమకు మేలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. "సీఎం చంద్రబాబు ఆసక్తి చూపిస్తే, ఎస్టీటీలో అభ్యంతరాలు రావడానికి ఆస్కారం ఉందా?" అనే ధర్మసందేహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించిన మీదట తదుపరి కార్యాచరణ ఉంటుంది ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.