ఈసీపైకి రేవంత్ సైన్యం

సోమవారం వరకు చూస్తాం, అప్పటికీ క్యాబినెట్ నిర్వహణకు అనుమతి రాకపోతే మంత్రివర్గం మొత్తంతో ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘాన్ని కలుస్తాం రేవంత్ రెడ్డి వ్యాఖ్య.

Update: 2024-05-19 08:40 GMT
Revanth Reddy

‘సోమవారం వరకు చూస్తాం, అప్పటికి కూడా క్యాబినెట్ నిర్వహణకు అనుమతి రాకపోతే మంత్రివర్గం మొత్తంతో ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల సంఘాన్ని కలుస్తాం’ ఇది తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య. ఇది వ్యాఖ్యగానే అనిపిస్తున్నా ఇందులో హెచ్చరిక కూడా అంతర్లీనంగా కనబడుతోంది. చర్చించాల్సిన అంశాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అనేకం ఉండగా క్యాబినెట్ సమావేశానికి ఎన్నికల కమీషన్ అనుమతించకపోవటంపై రేవంత్ రెడ్డి మండిపోతున్నారు. శనివారం జరగాల్సిన క్యాబినెట్ సమావేశం రద్దయ్యింది. క్యాబినెట్ సమావేశం నిర్వహణకు అనుమతి కావాలని ఒకవైపు కోరుతునే మరోవైపు శనివారం క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని రేవంత్ డిసైడ్ చేశారు. అందుకనే క్యాబినెట్ సమావేశానికి హాజరుకావాలని మంత్రులందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారమిచ్చింది.

సమాచారం అందగానే మంత్రులు, శాఖల ముఖ్య కార్యదర్శలు, ఉన్నతాధికారులంతా సెక్రటేరియట్ కు చేరుకున్నారు. అయితే ఎన్నిగంటలు వెయిట్ చేసినా క్యాబినెట్ సమావేశం నిర్వహణకు కమీషన్ నుండి అనుమతి రాలేదు. దాంతో రేవంత్ కు మండిపోయింది. తర్వాత సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో పై విధంగా ప్రకటించారు. రైతు సమస్యలు, వర్ష ప్రభావంతో నష్టపోయిన పంటలు, చెల్లించాల్సిన పరిహారం, జూన్ 2 రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగియటం, విభజన సమస్యల పరిష్కారం, రైతుసంక్షేమం, ధాన్యం కొనుగోళ్ళు, రైతురుణమాఫీకి నిధుల సమీకరణ మార్గాల్లాంటి అనేక అంశాలపై చర్చించాలని అనుకున్నట్లు రేవంత్ మీడియాతో చెప్పారు. సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు క్యాబినెట్ సమావేశం పెట్టుకోవాలని అనుమతి కోరినా ఎన్నికల కమీషన్ నిరాకరించటం అన్యాయమంటు రేవంత్ తీవ్రంగా ఆక్షేపించారు.

అందుకనే సోమవారం వరకు వెయిట్ చేస్తామని అప్పటికి కూడా క్యాబినెట్ నిర్వహణకు అనుమతి రాకపోతే మంగళవారం ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ఎన్నికల కమీషన్ను కలుస్తామని చెప్పారు. కమీషన్ కు చెప్పటం కన్నా హెచ్చరిస్తున్నట్లే ఉంది. కమీషన్ ఎందుకు క్యాబినెట్ సమావేశానికి అనుమతించలేదంటే ఈనెల 27వ తేదీన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నిక జరుగుతోంది. బహుశా ఈ ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కోడ్ అమల్లో ఉంది కాబట్టి క్యాబినెట్ సమావేశం నిర్వహణకు కమీషన్ అనుమతించినట్లు లేదు. మూడు జిల్లాల్లో ఎంఎల్సీ ఎన్నికను దృష్టిలో పెట్టుకుంటే మరి మిగిలిన జిల్లాల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి ? అన్నది రేవంత్ ప్రభుత్వం ప్రశ్న. ఖరీఫ్ సీజన్లో రైతుల విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, భారీవర్షాల్లో జరిగిన పంట నష్టాలపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వం మే 27వ తేదీన ఎన్నిక అయిపోయేంతవరకు వెయిట్ చేయాలంటే సాధ్యమేనా ?

విధానపరమైన నిర్ణయాలు కాకుండా భారీవర్షాలు, పంటల నష్టాల్లాంటి వాటిపైన చర్చించేందుకు క్యాబినెట్ సమావేశ నిర్వహణకు అనుమతించకపోవటంపై మంత్రులు కూడా ఆక్షేపిస్తున్నారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, విభజన సమస్యలు, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని లాంటి అంశాలపైన చర్చించేందుకు అవకాశం లేకపోయిందని మంత్రులు వాపోతున్నారు. సోమవారం నాటికి కూడా క్యాబినెట్ సమావేశానికి అనుమతి రాకపోతే మంగళవారం ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమీషన్ను కలుస్తామని రేవంత్ చెప్పటం ఇపుడు ఆసక్తిగా మారింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News