సీఎంకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఇసుక, మద్యం!
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇసుక సరఫరా, మద్యం వ్యాపారం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎవరు కారకులు?
ఇసుక సరఫరా, మద్యం వ్యాపారం గత ప్రభుత్వంలో ప్రభుత్వమే నిర్వహించింది. ప్రస్తుతం ఈ రెండింటినీ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వారికి అప్పగించింది. సకాలంలో ఇసుక వినియోగదారులకు చేరటం లేదు. పైగా ఉచితంగా ప్రభుత్వం తీసుకుపోవాలని చెబుతున్నా బోలెడంత డబ్బు ఇసుక కోసం చెల్లించాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. ఇసుక నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ వారికి అప్పగించడంతో క్వారీల వద్ద ఇష్టారాజ్యంగా ఉంటోందని ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లే వారు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకుని వెళ్లినా ఒక్కోసారి రోజంతా అక్కడ నిలబడాల్సి వస్తోందంటున్నారు. తవ్వేవారు ఆలస్యం చేసినా, లారీలకు ఎత్తేవారు ఆలస్యం చేసినా తామే ఇబ్బంది పడాల్సి వస్తోందని, పైగా లారీలు క్యూకట్టి ఉండాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.
రాత్రులకు రాత్రులు హైదరాబాద్, బెంగళూరులకు వందల్లో లారీలు ఇసుక లోడ్‌లతో వెళుతున్నా పట్టించుకునే వారు లేరని, ఎవరైనా వారిని ఆపితే పలానా తాలూకూ వారని చెప్పగానే పంపించేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అయినా దందా ఆగటం లేదని పలువురు బిల్డర్‌లు చెబుతున్నారు. పేరు చెప్పేందుకు ఇష్టపడని బిల్డర్లు ఎవరు తీసుకెళుతున్నారనే విషయం అధికారులకు స్పష్టంగా తెలుసునని అంటున్నారు.