నాడు జై జవాన్, నేడు జై కిసాన్

రైతు అవసరాలు తీరుస్తున్న మినీ ఎయిర్పోర్టు !

Update: 2024-11-22 01:50 GMT

ఎక్కడైనా ఎయిర్పోర్టులో ఏముంటాయి? విమానాలుంటాయి. రన్ వేలపై ఆ విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కానీ అక్కడ విమానాశ్రయంలో పంటలు పండుతున్నాయి. పండించిన పంటలను ఎండబెట్టడానికి, ఆర బెట్టడానికి రన్వే ఉపయోగపడుతోందంటే ఆశ్చర్యంగా లేదూ? అలాంటి ఎయిర్పోర్టు ఎక్కడుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది కదూ? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాం రండి!

రెండో ప్రపంచ యుద్ధం జరిగే రోజులవి. అప్పటికి మన దేశం బ్రిటిషర్ల పాలనలో ఉంది. ఆ యుద్ధంలో మన దేశం కూడా పాలుపంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటి బ్రిటిష్ పాలకులు విజయనగరం జిల్లా బాడంగిలో ఒక ఎయిర్ స్ట్రిప్ (మినీ ఎయిర్పోర్టు) ను 1941లో నిర్మాణాన్ని చేపట్టి 1942లోనే పూర్తి చేసింది. ఆ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యాన్ని తరలించడానికి రాయల్ ఎయిర్ ఫోర్స్ కోసం ఈ ఎయిర్ స్ట్రిప్ను కమాండ్ బేస్ గా ఉపయోగించారు.

 

221 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎయిర్ స్ట్రిప్ అప్పటి అతి పెద్ద రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరాల్లో ఒకటి. అక్కడ కంట్రోల్ రూమ్, ప్రత్యేక భూగర్భ ఆయుధ డిపో, సిగ్నల్ టవర్, పలు బంకర్లను ఏర్పాటు చేశారు. సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ ఫైటర్స్, హాకర్, హరికేన్ ఫైటర్స్, బాంబర్లు, బీ-57 కాన్బెర్రా వంటివి ఇక్కడ ఉండేవి. అప్పట్లో యుద్ధ అవసరాలు, సరకుల రవాణాకు 227 ఎకరాల్లో రెండు రన్వేలు ఏటీసీ, బంకర్లు నిర్మించారు.

రెండు రన్వేలు, తూర్పు, పడమరలకు ఒకటి, ఉత్తర దక్షిణాలకు మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్ నుంచి సైనికులను ఇతర దేశాలకు తీసుకెళ్లేవారు. యుద్ధం ముగిసిన తర్వాత 1946లో దీనిని మూసివేశారు. ఆ తర్వాత ఎఫ్సీఐ దీనిని కొంతకాలం పాటు వరి, గోధుమలు నిల్వకు ఉపయోగించింది. ప్రస్తుతం ఈ ఎయిర్ స్ట్రిప్లో పనికిరాని భూముల్లో రైతులు పంటలు పండించుకుంటున్నారు. తమ పంటలను నిరుపయోగంగా ఉన్న ఆ రన్ వేలపై ఎండబెట్టుకుంటున్నారు. ఈ రన్వేల మధ్యలో వృద్ధ వృక్షాలు దర్శనమిస్తూ వాటి రూపు రేఖలను పూర్తిగా మార్చేశాయి. ఎనిమిది దశాబ్దాల నాటి ఈ ఎయిర్ స్ట్రిప్ దేశంలోని అతి పురాతన ఎయిర్ ప్లో ఒకటి. ఇది అప్పట్నుంచి నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది.

దశాబ్దాలుగా అమలు కాని ప్రకటనలు..

బాడంగి ఎయిర్ స్ట్రిప్ను మళ్లీ వినియోగంలోకి తేవాలన్న ప్రతిపాదన దశాబ్దాల నుంచీ ఉంది. యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ స్థావరం అవసరం. తూర్పునావికాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నానికి హైదరాబాద్, భువనేశ్వర్కంటే బాడంగి చేరువలో ఉన్నందున యుద్ధ విమానాలను అక్కడ ఉంచడానికి వీలుంటుంది. అందువల్ల రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఈ బాడంగి ఎయిర్ స్ట్రిప్ను తిరిగి వినియోగంలోకి తేవాలని నేవీ యోచించింది.

విశాఖలో ఫ్రంట్ లైన్ ఫైటర్ మిగ్ 29కే ఎయిర్ క్రాఫ్ట్ స్క్వాడ్రన్ను ఉంచాలని యోచిస్తున్నందున భవిష్యత్తులో బాడంగి ఎయిర్ స్ట్రిప్ సరైన ప్రత్యామ్నాయమని నిర్ణయానికొచ్చింది. ఈ ఎయిర్ స్ట్రిపన్ను పునరుద్దరించడంతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్కు సహాయ పడటానికి నేవీ కొన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రతిపాదించింది. శిక్షణ కోసమే కాకుండా అత్యవసర వినియోగానికి కూడా అక్కడొక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని యోచించింది.

 

దీనిపై నావికాదళ ఉన్నతాధికారులు సైతం ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. 2013లో అప్పటి నేవీ అడ్మిరల్ దేవేంద్రకుమార్ జోషి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. హాక్ ఎం.కే.132 అడ్వాన్స్డ్ జెట్ ట్రైనర్ (ఏజెటీ) ఎయిర్ క్రాఫ్ట్ ఇండక్షన్ వేడుకకు విశాఖ వచ్చిన ఆయన.. దేశంలో పెరుగుతున్న భద్రతావసరాలను తీర్చడానికి తూర్పు తీరంలో ప్రత్యామ్నాయ ఎయిర్ ఫీల్డ్ను అభివృద్ధి చేయాలని నౌకాదళం యోచిస్తోందని, బాడంగి ఎయిర్ స్ట్రిప్ ఇందుకు అనువైనదని చెప్పారు.

భూ సేకరణ, ఇతర అంశాలపై అధికారులు, స్థానికులతో సంప్రదించి ప్రాజెక్టు చేపడతామన్నారు. కానీ ఆ ప్రకటన చేసి ఇప్పటికి పదేళ్లు దాటినా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అలాగే బాడంగి ఎయిర్ స్ట్రిప్ను అభివృద్ధి చేసి ఫైటర్ జెట్ల పైలట్లకు శిక్షణ కేంద్రంగా మార్చాలని కూడా గతంలో ప్రయత్నాలు చేసినా కార్యరూపం దాల్చలేదు.

తాజాగా ఆయుధ డిపో కోసమని..

తాజాగా బాడంగి ఎయిర్ స్ట్రిప్ (మినీ విమానాశ్రయం)ను పునర్నిర్మించాలని నేవికాదళం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. శత్రు దేశాల ముప్పును ఎదుర్కొనేందుకు బాడంగిలో మరో నేవీ ఆర్మమెంట్ డిపో (ఆయుధ నిల్వల కేంద్రం-ఎస్ఏడీ) నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అది పూర్తయితే మందుగుండు, క్షిపణులు, టార్పెడోలు, ఇతర రసాయన ముడి సరకుల నిల్వ, నిర్వహణ, సకాలంలో సరఫరా చేసే బాధ్యతను ఆయుధ డిపోల నుంచి సాగేలా నేవీ చూస్తుంది.

ఇది అందుబాటులోకి వస్తే ఫైటర్ జెట్ల పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు బాడంగి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం విశాఖ ఎన్ఏడీ, నేవీ, రెవిన్యూ అధికారులు అక్కడకు వెళ్లి పరిశీలించారు. ఎయిర్ స్ట్రిప్కు ఇరుపక్కలా భూములను 'టి' ఆకారంలో సేకరించాలని నేవీ అధికారులు కోరారు. ఎయిర్ స్ట్రిప్కు ఇక్కడున్న 227 ఎకరాలతో పాటు అదనంగా మరో 1700 ఎకరాలు అవసరమని తాజాగా ప్రతిపాదించారు.

 

ముగడ, మల్లంపేట, పూడివలస, రామచంద్రాపురం, కోడూరు, పరిధిలో భూసేకరణకు ధర నిర్ణయించే అవకాశం ఉంది. బాడంగి భోగాపురం విమానాశ్రయానికి 70 కి.మీలు, జాతీయ రహదారికి 7 కి.మీలు, డొంకినవలస రైల్వే స్టేషన్కు 3 కి.మీల దూరంలో ఉండడం ఉపయోగకరమని భావిస్తోంది. నౌకలకు కావలసిన సరకులు సకాలంలో అందించడానికి ఎయిర్ వే, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లకు సామగ్రి తరలించడానికి సమీపంలో రైల్వే మార్గం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.

అన్నీ ఆసక్తికర అంశాలే..

ఈ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణంలో బ్రిటిషర్లు స్థానికులను ఎక్కువగా వినియోగించే వారని చెబుతారు. దీని నిర్మాణానికి మూడు, రెండున్నర టన్నుల బరువుండే రోడ్డు రోలర్లు ఉపయోగించారు. వీటిని మనుషులతో లాగించేవారని, లాగలేకపోతే కొరడాలతో కొట్టేవారని స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ రోడ్డు రోలర్లు ఇప్పటికీ బాడంగిలో సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక ఒకప్పుడు మన ఊళ్లో ఎయిర్పోర్టు ఉండేది.. అని స్థానికులు, పరిసర గ్రామాల వారూ తమ మనువలు, మనవరాళ్లకు చెబుతుంటారు.

 

వాటి ఆనవాళ్లను చూడడానికి సంక్రాంతి, దసరా వంటి సెలవుల్లో అక్కడకు వెళ్లి వస్తుంటారు. కనుమ రోజున ఈ రన్వేపై భారీ జాతరను ఏర్పాటు చేస్తుంటారు. ఇలా ఈ ఎయిర్ స్ట్రిప్ గురించి అన్నీ ఆసక్తికర అంశాలే కనిపిస్తాయి. దశాబ్దాల తరబడి ఈ ఎయిర్ స్ట్రిపన్ను సమూలంగా మార్చేస్తామంటూ వస్తున్న కథనాలు అక్కడ స్థానికులను ఏమాత్రం కదలించడం లేదు. ఆందోళన చెందడం లేదు. ఎందుకంటే ఇన్నాళ్లూ అవేమీ కార్యరూపం దాల్చకపోవడంతో ఎప్పటిలాగే తమ ఎయిర్పోర్టు భూముల్లో నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. వాటిని ఎండబెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News