సాగర్ నుంచి నీటివిడుదల చేయనందునే స్వాధీనం
కృష్ణా బోర్డుకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు అప్పగించలేదు
Byline : The Federal
Update: 2023-12-01 11:02 GMT
కృష్ణా బోర్డుకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను కేంద్రం ఎందుకు అప్పగించలేదు
రాష్ట్రాల విభజన చట్టం ప్రకారం ఎవరి ప్రాజెక్టును వారు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు
నీళ్ల పంచాయతీ అయితే ఇన్నాళ్లు ఎందుకు చూస్తూ ఉన్నట్లు
(జి.పి. వెంకటేశ్వర్లు)
సాగర్ నుంచి తాగునీరు విడుదల చేయాలని నెల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాసాం. అయినా పట్టించుకోనందునే ఆంధ్రా భూభాగాన్ని స్వాధీనం చేసుకుని సాగర్ నుంచి తాగు నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏ విధమైన గొడవలు లేవు. తాము అక్కడికి వెళుతున్నప్పుడు పోలీసులు అడ్డగించారు. వారికి పరిస్థితిని చెప్పి కాస్త ఫోర్స్‌గానే వెళ్లాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
నీటి విడుదల కోసమే స్వాధీనం
సాగర్ నుంచి తాగునీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ ఇచ్చినా పట్టించుకోలేదని నాగార్జున సాగర్ ప్రాజెక్టు పల్నాడు జిల్లా సూపరింటెన్‌డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి ఫెడరల్‌కు తెలిపారు. అందువల్లే ప్రాజెక్టులో ఏపీకి ఉన్న భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి తప్పు
కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి తప్పని నీటిపారుదల రంగ విశ్లేషకులు శంకరయ్య అన్నారు. కృష్ణా బోర్డుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్‌లపై పూర్తి అధికారాలు ఇచ్చి వారికి స్వాధీనం చేయలేదని, అందువల్లే ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయని అన్నారు.
ఇది రాజకీయ కోణమేనా?
నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికీ రాజకీయం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రాజకీయ పంచాయతీ కాకుంటే నాలుగున్నర ఏళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం 2023 నవంబరు 30 సాయంత్రం నేరుగా పోలీసులతో డ్యామ్ వద్దకు వెళ్లి ఏపీ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఏమిటనేది పెద్ద చర్చగా మారింది. 13వ వాటర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర, తెలంగాణ భూభాగాల్లో ఎవరి పరిధిలో వారు ఉన్నారు.
ఎందుకు వివాదం
నాగార్జున సాగర్ నుంచి సాగు, తాగునీటిని తీసుకునేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు హక్కు ఉంది. సాగర్ డ్యామ్ సగం తెలంగాణలో, సగం ఏపీలో ఉండటం వల్ల రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అప్పుడప్పుడు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వ అధికారులే ఏపీకి కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రాష్ట్రాల నాయకత్వం సఖ్యతతో ఉండటం వల్లనే ఇది సాధ్యమైంది.
విభజన చట్టం ఏమి చెప్పింది
శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూడాలని, నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ తెలంగాణ చూడాలని విభజన చట్టంలో కేంద్రం పేర్కొంది. అయితే శ్రీశైలం డ్యామ్ ఎడమ భాగంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం చేపట్టి ఎడమవైపు నిర్వహణ అంతా వారే చూస్తున్నారు. కుడివైపు నిర్వహణ ఏపీ ప్రభుత్వం చూస్తున్నది. ఇక సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల తెలంగాణ ప్రభుత్వమే చేస్తున్నది. ఇది విభజన చట్టానికి విరుద్ధం. ఇందులో కేంద్రం తప్పిదాలు కూడా ఉన్నాయనేది ఇరిగేషన్ విశ్లేషకుల వాదన.
ప్రస్తుతం డ్యాముల్లో నీటి పరిస్థితి
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాముల్లో 80 టీఎంసీల నీరు ఉంది. ఈ నీటిని 2024 జూన్ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల తాగునీటికి మాత్రమే విడుదల చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకున్నాయి. ఆ ప్రకారం నీటి విడుదల జరగాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు మూడు నెలలకు ఒక సారి నీరు ఇవ్వాలి. తాగునీరు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పట్టించుకోలేదు.
ఇప్పుడు ఎందుకు ఇలా..
ఉన్నట్లుండి ఏపీ ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని స్వాధీనం చేసుకోవడం వెనుక రాజకీయ కోణం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ నేత చంద్రబాబునాయుడు చెప్పినట్లు చేస్తుందని, అందువల్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనే ఆలోనతో ప్రాజెక్టులోని 13 గేట్లను స్వాధీనం చేసుకుంది.
డిసెంబరు 1న అధికారుల సంప్రదింపులు
2023 డిసెంబరు 1న సాయంత్రం ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ కార్యదర్శులు సంప్రదింపులు జరిపేందుకు నిర్ణయించారు. వీరి సంప్రదింపుల సందర్భంగా తీసుకునే నిర్ణయాలను బట్టి తదుపరి కార్యచరణ ఉండే అవకాశం ఉంది.