టికెట్స్ ఫ్యామిలీ ప్యాక్..! బాబూ... ఇదేందన్నా..!?

త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. సీనియర్లను కాదని.. ఒకే కుటుంబంలో ఇద్దరేసి వ్యక్తులకు టికెట్లు ఎలా ఇచ్చారని టిడిపిలో భంగపడిన మాజీలు ప్రశ్నిస్తున్నారు.

Update: 2024-03-27 07:45 GMT
Source: Twitter

(ఎస్.ఎస్.వి.భాస్కర్ రావ్)

తిరుపతి: అభ్యర్థుల ఎంపిక తీరు టీడీపీలో చిచ్చు రేపింది. "కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ "త్యాగాలకు సిద్ధం కావాలి" అనే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను మాజీలు, సీనియర్ నాయకులు తప్పుపడుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి సీట్లు ఎలా కేటాయించారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సాధారణంగా ఆహార పదార్థాలు. వస్తు సామాగ్రి ఫ్యామిలీ ప్యాక్ అందుబాటులో ఉంటాయి. టీడీపీలో మాత్రం టికెట్లు ఫ్యామిలీ ప్యాక్‌లా కేటాయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వల్ల టికెట్లు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యేలు, భంగపడిన సీనియర్ నాయకుల ఆగ్రహం చల్లారడం లేదు. పట్టు వీడకుండా, భీష్మించిన కొందరు రాజీకి ససేమిరా అంటున్నారు. గత్యంతరంలేని స్థితిలో ఇంకొందరు అధికార పార్టీ వైపు తొంగి చూస్తున్నట్లు సమాచారం.

తాజా ఎన్నికల కోసం టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు మూడు విడతలుగా అభ్యర్థులను ప్రకటించారు. ఇంకొన్ని సీట్లు ఇంకా ఖరారు చేయలేదు. ఫైనల్‌గా నాలుగో జాబితా కోసం నిరీక్షిస్తున్నారు. కూటమి పొత్తులో కుదరని లెక్కల వల్ల అభ్యర్థులను ప్రకటించడంలో కూడా అనిశ్చితి నెలకొంది. "పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. అధికార పార్టీపై పోరాడారు.. అరెస్టయ్యారు.. జైలుకు వెళ్లారు. భవిష్యత్ అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా త్యాగాలు తప్పవు" అని టికెట్లు దక్కని ఆశావహులు, మాజీ ప్రజాప్రతినిధులను మానసిక ఊరడింపు కోసం టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు విజయవాడ వర్క్‌షాప్‌లో చెప్పిన మాటలు ఇవి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మిత్ర పక్షంలో ఉన్న వారి కుటుంబాలకు, కొత్తగా పార్టీలో చేరిన వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఎలా కేటాయించగలిగారు అనే ఆవేదన టిడిపి నాయకుల్లో వ్యక్తం అవుతోంది. అసలు విషయంలోకి వస్తే..

కర్నూలు టిడిపిలో వికసించిన కమలం

పారిశ్రామికవేత్త అయిన టీజీ వెంకటేష్‌కు కర్నూలు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన నేర్పరితనం ఉంది. టిడిపితో రాజకీయ అరంగేట్రం చేసిన టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన మంత్రిగా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. రాజ్యసభ సభ్యుడు అయ్యాక బిజెపిలో చేరారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆయన తన పాత పరిచయాలు సంబంధాలు కొనసాగిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

కూటమి పొత్తుల నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం బిజెపికి కేటాయించారు. ఇక్కడి నుంచి తన కుమారుడు టీజీ విశ్వప్రసాద్‌ను పోటీ చేయించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తున్నారనీ తెలుస్తోంది. ఇప్పటికే కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ పేరు టీడీపీ జాబితాలో చోటుచేసుకుంది.

నెల్లూరు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి ప్రచారం

సింహపురి సిత్రమే వేరు… పార్టీలో చేరడమే ఆలస్యం..

పార్టీలో చేరడం ఆలస్యం. ఆ వ్యక్తికే కాదు భార్యకు కూడా టికెట్ ఇచ్చిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపిలో చోటు చేసుకున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. టీడీపీ వైపు తొంగి చూశారు. సాదరంగా స్వాగతించిన టీడీపీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు.. నెల్లూరు పార్లమెంటు సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇవ్వడంతో పాటు, ఆయన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా కోవూరు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇచ్చారు.

నెల్లూరులో నిర్వేదం..

పాత నీరు పోతే కొత్తనీరు వస్తుంటుంది... మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్న "సీనియర్ నాయకులను నిర్లక్ష్యం చేస్తున్నారు" అని వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్ బీసీ నాయకుడు మస్తాన్ యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. బీసీలు అధికంగా ఉన్న వెంకటగిరి అసెంబ్లీ సీటు ఆ వర్గానికి సీటు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

చివరి వరకు ఉత్కంఠ

టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారే కాకుండా, ఆ తర్వాత వచ్చిన సీనియర్లకు కూడా టికెట్ ఖరారు చేయడంలో జాప్యం చేశారు. ఆ కోవలో నిర్వేదానికి గురై.. " పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేశా.. 25 సంవత్సరాలుగా పార్టీతోనే నడుస్తున్నా. అదృష్టం ఎలా ఉందో వేచి చూస్తా" అని సర్వేపల్లి నుంచి టికెట్ ఆశించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మానసిక ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు టికెట్ కేటాయించడంతో ఆయన సాంత్వన చెందారు.

ఆగని కన్నీరు

"కష్టాలు ఎదురైనా పార్టీ కోసం పోరాటాలు చేశాను. శ్రేణులు కూడా కలిసి వచ్చాయి. ఆయన నాకు అన్యాయం జరిగింది" అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం సుగుణమ్మ కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీకి బలమైన సీటును కోల్పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం. కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లాలో టికెట్లు ఇచ్చారని మాట ప్రస్తావించకుండా ఆమె టీడీపీ నేతల త్యాగాలను గుర్తు చేస్తున్నారు.

కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి, కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవి రెడ్డి ప్రచారం

కడపలో సీన్ రిపీట్

జిల్లా టీడీపీలో కూడా అసంతృప్తి ఏమాత్రం తక్కువ లేదు. టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించారు. ఆయన భార్య రెడ్డప్ప గారి మాధవి రెడ్డి.. కడప అసెంబ్లీ సీటులో పోటీ చేస్తున్నారు. నోటిఫికేషన్ రాక ముందు నుంచి భార్యాభర్తలిద్దరూ కడప నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టికెట్ దక్కని నాయకులు మండిపడుతున్నారు. ఆ పార్టీలో టీడీపీ సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. అనేక సందర్భాల్లో " పార్టీ కోసం అవమానాలు పడ్డాం. పోరాటాలు చేశాం. వాటికి ఫలితం లేకుండా పోయింది. పార్టీ అధిష్టానమే చిచ్చు పెట్టింది" అని సీనియర్ నాయకుడు అమీర్ బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.

భార్యాభర్తలకు రెండో జాబితాలో అభ్యర్థిత్వం ప్రకటించిన ఆరంభంలోనే నిరసన వ్యక్తం అయింది. పార్టీ సీనియర్ నాయకుడు, అలంకానిపల్లికి చెందిన జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎం లక్ష్మిరెడ్డి సారధ్యంలో గత నెలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముస్లిం మైనార్టీ నాయకుడు అమీర్ బాబు, లక్ష్మిరెడ్డి నియోజకవర్గంలో ప్రభావితం చేయగలిగిన నాయకులు. అనేక పార్టీలను తచ్చాడినా, కడప సీటుపై ఆశతో మళ్లీ మాతృ సంస్థ టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు సీ. రామచంద్రయ్య (సిఆర్‌సి) పరిస్థితి కూడా ఎటు కాకుండా అయిపోయింది. బాలిశెట్టి హరిప్రసాద్ కూడా ఇక్కడ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు

" నాది టీడీపీతో 25 ఏళ్ల రాజకీయ జీవితం" అని మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి గుర్తు చేశారు. మరో పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి రాయచోటిలో టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్టానం తనకు అన్యాయం చేసిందని ఆయన ఫెడరల్ ప్రతినిధి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

మైదుకూరు: అసెంబ్లీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్

పుట్టాకు ఫ్యామిలీ ప్యాక్..

కడప జిల్లా మైదుకూరు నుంచి టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌కు జాక్పాట్ తగిలింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడుకు పుట్టా సుధాకర్ యాదవ్ వియ్యంకుడు.పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్ట మహేష్ యాదవ్. ఈయన యనమల రామకృష్ణుడికి అల్లుడు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్‌ను టీడీపీ ప్రకటించింది. దీంతో అక్కడి మాజీ ఎంపీ మాగుంట బాబు, గొర్రె ముచ్చు గోపాల్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

"ఏలూరు ఎంపీ స్థానం బీసీలకు మార్చడంలో కారణం నేనే. స్థానికేతరుడిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి" అని గోపాల్ యాదవ్ ఇటీవల ఒక సందర్భంలో ప్రశ్నించారు. యనమల వల్లే తనకు అన్యాయం జరిగిందని ఆయన అగ్రోదించారు.ఈయన పరిస్థితి ఇలా ఉంటే... సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పరిస్థితి మరోలా మారింది. తునిలో రెండుసార్లు వరుసగా ఓటమి చెందిన యనమల రామకృష్ణుడు స్థానంలో ఆయన అన్న కుమార్తె దివ్య అభ్యర్థిత్వాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో యనమల రామకృష్ణుడు చినుక వహించినట్లు సమాచారం.

ఎన్నికల వేళ పోటీ చేయాలనే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులో సీనియర్లు కూడా ఉన్నారు. మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకే కుటుంబంలో ఎక్కువ మందికి టికెట్లు ఇవ్వడం, ఔత్సాహికులను నిరుత్సాహపరిచే విధంగా అభ్యర్థులను ఖరారు చేశారన్న అంశంపై నిరసనలు ఆగడం లేదు. ఎన్నికల సమీపించే నాటికి వీరిని ఎలా దారిలోకి తెచ్చుకుంటారు అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News