ఆ అమ్మాయిని చంపి అతడు రైలు కింద పడ్డాడు!
సామర్లకోటలో వెలుగులోకి వచ్చిన సంచలనం
By : The Federal
Update: 2025-10-02 03:37 GMT
ప్రేమన్నాడు.. ఆ పిల్ల గొంతుకోశాడు..
నాన్నా, నువ్వంటే ఇష్టమన్నాడు, రైలు పట్టాల మీద తలపెట్టాడు..
ప్రేమించిన వాళ్ల కోసం బతకాల్సిన ఓ యువకుడు క్షణికావేశంలో బతకుబుగ్గి పాల్జేసుకోవడంతో పాటు కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. ఇంతటి దారుణ సంఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో జరిగింది.
సామర్లకోట మండలం పనసపాడు, హుస్సేన్‌పురంలో ఈ ఇద్దరి మృతదేహాలూ కలకలం రేపాయి. ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ప్రేమ పేరిట ఓ బాలికను తనవెంట ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన యువకుడు పదునైన బ్లేడుతో ఆ అమ్మాయి గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తానూ రైలుపట్టాలపై తలపెట్టి ప్రాణాలొదిలాడు.
ఆ అమ్మాయి, అబ్బాయిది గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం. ఒకే ఊరు కావడంతో చాలా కాలంగా పరిచయం ఉంది. ఆ అమ్మాయి పేరు దీప్తి. ఇంటర్ చదువుతోంది. అతని పేరు అశోక్. పాలిటెక్నిక్ చదివాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది.
ఉన్నట్టుండి ఆ యువకుడు సెప్టెంబర్ 30న ఊళ్లోకి వచ్చారు. వస్తూ వస్తూ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారికి తలనీలాలిచ్చి సొంత ఊరికి చేరుకున్నాడు. బంధువుల మోటారు సైకిల్ తీసుకుని కాకినాడ వెళ్లి విద్యార్థినితో పనసపాడు చేరుకున్నాడు. గాడేరు కాలువ సమీపంలో ఆమె గొంతుకోసి హత్య చేశాడని పోలీసుల అనుమానం. అశోక్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ‘ఐయాం సారీ.. ఐలవ్‌యూ సోమచ్ నాన్నా.. నిన్ను వదిలివెళ్లిపోతున్నాను’... అని ఫోన్ నుంచి తండ్రి రామకృష్ణకు మెసేజ్ పంపించాడు. బంధువుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు.
పనసపాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ సమీపంలోని గాడేరు కాలువగట్టుపై జి.దీప్తి అనే 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని శవం కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అదే సమయంలో హుస్సేన్‌పురం రైల్వే ట్రాక్‌పై గుండుతో ఉన్న కొమ్మూరి అశోక్ (19) మృతదేహం గుర్తించారు. బాలిక చనిపోయినచోట లభ్యమైన టోపీ ఆధారంగా అతనే హత్య చేసి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా తేల్చి దర్యాప్తు వేగవంతం చేశారు. రైల్వే పట్టాల సమీపంలో లభ్యమైన ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా మృతుడు, బాలిక గొల్లప్రోలు మండలంలోని దుర్గాడ గ్రామానికి చెందినవారని తేలింది. ఫోన్ కాల్‌డేటా విశ్లేషిస్తున్నారు.
ఆ బాలికను 9వ తరగతి నుంచి ప్రేమిస్తున్నానని వెంటపడటంతో ఆమె కుటుంబసభ్యులు కూడా గతంలో హెచ్చరించారు. అయితే ఇద్దరికీ సెల్‌ఫోన్‌లో పరిచయం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.