Constitution - SFI | రాజ్యాంగ హక్కుల కోసం మరో పోరాటం
రాజ్యాంగ హక్కులు మరింత బలహీనం అయ్యాయి. ప్రాథమిక హక్కుల కోసం ఉద్యమాలే శరణ్యమని ఎస్ఎఫ్ఐ జాతీయ నేత సాను గుర్తు చేశారు.
దేశంలో బలహీనవర్గాల హక్కులు బలహీనంగా మారాయని ఎస్ఎఫ్ఐ (Student's Federation Of India - SFI) జాతీయ అధ్యక్షుడు విపి. సాను ఆందోళన వ్యక్తం చేశారు. దీనికోసం విద్యార్థులు మరో పోరాటానికి సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో "దేశంలో ప్రాథమిక హక్కులు, లౌకిక, సామ్యవాద విలువలు" అనే అంశాలపై శనివారం నిర్వహించిన సెమినార్ లో సాహు మాట్లాడారు.
వర్సిటీలోని ప్రకాశం భవన్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాలను SFI అఖిల భారత అధ్యక్షులు VP, సాను, రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్షుడు అక్బర్ ఎస్ఎఫ్ఐ జెండా అవిష్కరించారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) SFI అధ్యక్షుడు నరేంద్ర అధ్యక్షతన జరిగిన సెమినార్లో విపి. సాను మాట్లాడుతూ, బీజేపీ సారధ్యంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి దేశంలో రాజ్యాంగ విలువలుఉల్లంఘనలకు అడ్డు లేకుండా పోయిందన్నారు. విద్యారంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల డ్రాప్ ఔట్ పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యావ్యవస్థ వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.