కడపలో సెంటిమెంట్‌తో కొట్టనున్న షర్మిల
కడపలో ఆమె సెంటిమెంట్ యాత్ర వర్క్‌అవుట్ అవుతుందా.. వైఎస్‌ఆర్ బిడ్డను ఆశీర్వదించి ఆమోదిస్తారా?;
Byline : G.P Venkateswarlu
Update: 2024-04-05 05:15 GMT
సెంటిమెంటే ప్రధాన అస్త్రంగా కడప జిల్లాలో ఏపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని శుక్రవారం ప్రారంభించారు. కడప జిల్లా బద్వేలు నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను ఏపి న్యాయ యాత్రగా కొనసాగించనున్నారు. బద్వేలు నియోజక వర్గం ఎఏకెఎన్ మండలం అమ్మగంపల్లె వద్ద ఉదయం పది గంటలకు యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఇటుకల పాడు సవిశెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్యపల్లి నర్సాపురం, గుంటవారిపల్లి, కలసపాడు, మహానందిపల్లి, మామిళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరుమామిళ్ల, పాయలకుంట్ల, బద్వేలు టౌన్, అట్లూరు మీదుగా బస్సు యాత్ర సాగుతుంది.
చిన్నాన్న చివరి కోరిక కోసం..
దేవుడి దీవెనలతో నాన్న ఆశీర్వాదంతో అమ్మ ప్రేమతో చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలు దేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్రరాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశిస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నాను. అంటూ వైఎస్ షర్మిలా రెడ్డి ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలను కోరారు. షర్మిల గురువారం సాయంత్రం ఇడుపులపాయ చేరుకొని అక్కడే బస చేశారు. కాంగ్రెస్ పార్టీ సన్నిహితులు ముఖ్యులను పిలిపించుకొని మాట్లాడారు. ఏపి న్యాయ యాత్రను విజయవంతం చేసేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు.
అవినాష్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి..
రాష్ట్రలలో కాంగ్రెస్‌పార్టీ పునర్జీవం పొందేందుకు ఇది మంచి తరుణమనే ఆలోచన కాంగ్రెస్‌పార్టీలోని ప్రతి నాయకుడిలోను ఉంది. కడప పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ ఆయనను ఎంత ఘోరంగా చంపారో అనే అంశాన్ని ప్రజలకు వివరిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డిని చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి ఎంత సౌమ్యుడో ఎంత మందికి సహాయం చేశారో మీకు తెలియంది కాదని అటువంటి వ్యక్తిని కుట్ర రాజకీయాలకు బలిచేయడం దారుణమని ఇప్పటికే వైఎస్ వివేకా కుమార్తె సునీత న్యాయ స్థానం మెట్లు ఎక్కి దిగుతూనే ఉంది. చనిపోయే ముందు మా చిన్నాన్న కోరుకున్నది ఒక్కటే. నేను కడపకు ఎంపిగా ఉండాలని.. ఆయన ఎందుకు ఆ కోరిక కోరారో ఇప్పుడు మా అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే అర్థమవుతుందని షర్మిల అంటున్నారు.
నిందితులను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు..
చిన్నాన్నను చంపిన వారిని జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నారు. దీని వెనుకేముంది? ఓటర్లు ఒక్క సారి ప్రశాంతంగా ఆలోచించాలి. మానవత్వానికి కనీస విలువ కూడా ఇవ్వని అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్‌లో మళ్లీ గెలిచారంటే.. చట్టం.. న్యాయం లేనట్టే అని భావించాల్సి వస్తుంది. అంటూ ప్రచార రంగంలో దూసుకొని పోతున్నారు వైఎస్ షర్మిల. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అన్నా నేను రాజన్న బిడ్డను మీ ఆశీర్వాదం కావాల అని ఓటర్ల మనసులను గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి విజయమ్మ షర్మిల దీవించి పంపేటప్పుడు ఒక్క సారి ఆమె ముఖాన్ని పరిశీలిస్తే ఆవేదనను దిగిమింగుకునేటప్పుడు ఎలా ఉంటుందో అంతటి బాధ ఆమెలో కనిపించిందని చెప్పొచ్చు. బిడ్డకు నుదుటిపై బొట్టు పెట్టి మనసారా గుండెలకు హత్తుకొని ప్రచార సమరానికి సాగనంపారు.