ఉత్తరాదిలో కాంగ్రెస్ తరపున షర్మిల ప్రచారం?
ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎపిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రచారం చేసేందుకు సిద్ధ కావాలని కాంగ్రెస్ పార్టీ సూచించినట్లు సమాచారం.
పూర్తిగా నీరసించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో కాస్త జీవం పోశారు వైఎస్ షర్మిల. 2024 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ పార్టీ తరపున ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పోటీలో ఉంచి గర్జించారు. అధికార వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా, అదే స్థాయిలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ప్రశ్నల వర్షం కురిపించారు. తాను కాపాడిన వైఎస్సార్‌సీపీ ఇప్పుడు ప్రజలను కాపాడలేకపోతున్నదని, అటువంటి పార్టీనీ వీడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. కడప పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసి అవినాష్‌రెడ్డిని ఓడించాలని పిలుపు నివ్వడంతో పాటు మా చిన్నాన్న చావుకు కారణమైన అవినాష్‌ను పార్లమెంట్ మెట్లు ఎక్కకుండా చూడాలని ఓటర్లను కోరారు. తన వంతుగా కాంగ్రెస్ పార్టీ మేలుకొలుపు కోసం రాష్ట్రమంతా చుట్టుముట్టారు. వైఎస్సార్ హావ భావాలతో అడుగులు వేసిన షర్మిల ప్రసంగాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారానికి పిలిపించి రాష్ట్ర సమస్యలపై హామీలు ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు.