ఈ ఎమ్మెల్యేలకు జైలు తప్పదా?

అల్లర్లకు కారకులుగా చెబుతున్న ముగ్గరు ఎమమ్మెల్యేలపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఆధారాలు ఉన్నా పోలీసులు వారిపై ఇప్పటి వరకు కేసులు పెట్టలేదు.

Update: 2024-05-18 07:59 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హింస చెలరేగింది. పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాల్లో జరిగిన దాడులకు ముగ్గరు ఎమ్మెల్యేలు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీరిపై ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ లో కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్నిక రోజు, మరుసటి రోజు గొడవలు జరిగి రాళ్లు రువ్వుకోవడం, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో దాడులకు తెగబడటం జరిగాయి. ఈ దాడుల్లో పోలీసులు కూడా గాయపడ్డారు. కొందరు పోలీసు అధికారుల ఉదాసీనత ఇందుకు ప్రధాన కారణమని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కారణమని భావించిన పోలీసు అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకుంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గం, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి వర్గం రోడ్డుపైనే రాళ్లు రువ్వుకోవడం, కర్రలు, గొడ్డళ్లు, కత్తులతో స్వైర విహారం చేశారు. ఇళ్లపై కూడా దాడులు చేశారు. జెసి వర్గం ఇళ్లపై పెద్దారెడ్డి వర్గం దాడులు చేయగా, ప్రభాకర్ రెడ్డి వర్గంపై పెద్దారెడ్డి వర్గం దాడులకు తెగబడింది. ప్రత్యేక పోలీసుల బలగాలు అల్లర్లను ఆపుదామని ప్రయత్నిస్తే వారిపై కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ సంఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు వంద మందిని ఈ రాళ్లదాడి కేసులో అరెస్ట్ లు జరిగాయి. జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు జెసి అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జేసీ కుటుంబంపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. పెద్దరెడ్డిపైనా పలు కేసులు ఉన్నాయి.

పెద్దారెడ్డిపై ఇప్పటి వరకు సుమారు 28 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ప్రధాన మైనవి కిడ్నాప్ లు, మోసాలు, హత్యాయత్నాలు, అల్లర్లు, ఆస్తుల ఆక్రమణలు, మహిళలపై దాడులు, మారణాయుధాలు కలిగి ఉండటం, ప్రభుత్వ అధికారులను అడ్డగించి విధులను ఆటంకపరచడం, ఉద్యోగులను ప్రలోభపెట్టడం వంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ ఎక్కువగా తాడిపత్రి, ఎల్లనూర్ గ్రామాల్లో ఉన్నాయి.

మాచర్ల నియోజకవర్గం ఫ్యాక్షన్ కు పెట్టింది పేరు. ఈ ఎన్నికల్లో కారంపూడి మండలంలో ఎక్కువ గొడవలు జరిగాయి. వెల్తుర్తి, దుర్గి మండలాల్లోనూ గతంలో హత్యలు జరిగాయి. ఇక్కడ పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఈయనకే 2024 ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ టిక్కెట్ ఇచ్చింది. టిడిపి అభ్యర్థిగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి పోటీకి దిగారు. ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఎన్నక రోజు, మరుసటి రోజు చాలా మంది అనుచరులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ పలువురితో రెచ్చిపోయి దాడులు జరిగాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెళ్లి లక్షారె వర్గానికి చెందిన 7గురిని కారుకు లారీ ఢీకొట్టించి ఆ తరువాత వేటకొడవళ్లతో నరికి మర్డర్ చేశారు. వీరు పిన్నెళ్లి రామక్రిష్ణా రెడ్డకి దగ్గరి బంధువులు. అప్పుడు బ్రహ్మారెడ్డి తల్లి దుర్గాంభ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ సంఘటన 1999లో మాచర్ల, దుర్గికి మధ్య జరిగింది. ఈ కేసులో రుజువులు లేకపోవడంతో కేసును కోర్టు కొట్టివేసింది. వడ్డీ వ్యపారాలు, అక్రమంగా ఆస్తు సంపాదించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. 2014లో టిడిపి ఎమ్మెల్యే అంజిరెడ్డిపై దాడి, మాచవరం మండలం చెన్నాయపాలెం భూ వివాదంలో అక్కడి ఎస్సీలపై దాడి కేసులు ఉన్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులను పోటీకి నామినేషన్ లు వేయకుండా నిరోధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 13న జరిగిన ఎన్నికల్లో కారంపూడి, ఒప్పిచర్ల, కంభంపాడు, తుమురుకోడు, రెంటాల, రెంటచింతల, రచ్చమళ్లపాడు, లోయపల్లి, మాచర్ల గ్రామాల్లో హింస చెలరేగింది. దాడులు జరిగాయి. హత్యాయత్నాలు జరిగాయి. ఆస్తుల ధ్వంసం జరిగింది.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చంద్రగిరి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు. కుమారునికి తోడుగా ఉంటూ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై తిరుపతిలోని మహిళా యూనివర్సిటీలో దాడికి పాల్పడ్డారు. టీడీపీ అభ్యర్థికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికంతటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు ఎన్నికల్లో జరిగిన దాడులకు సంబంధించి సుమారు వంద వరకు కేసులు ఉన్నాయి. కొన్ని కేసులు ఈ ప్రభుత్వంలో తీసేయించుకున్నారు. చంద్రగిరిలో ఒక ఇంటికి నిప్పంటించి దుండగులు పారిపోయారు. ఈ సంఘటన ఈనెల 14 ఉదయం జరిగితే యూనిర్సిటీలో మధ్యాహ్నం జరిగింది.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై కేసులు నమోదు చేసేందుకు సిట్ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా పోలీస్ స్టేషన్స్ కు సిట్ అధికారులు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీంతో ఈ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవనున్నాయి. అలా జరిగితే వీరు జైలు గోడల మధ్యకు పోక తప్పదు.

Tags:    

Similar News