ఇదేమి తీరు శంకరా ?

రౌడీషీటర్కు కేక్ తినిపించిన ఎమ్మెల్యే. వరస ఘటనలతో వివాదాలకు హేతువవుతున్న టీడీపీ నేతలు

Update: 2024-08-29 13:00 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం) 

కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల వైఖరి వివాదాస్పమవుతోంది. కొందరు దురుసుగా, దూకుడుగా ముందుకెళ్తుంటే.. మరికొందరు అదుపు తప్పుతున్నారు. రెండు రోజుల క్రితం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి పుట్టిన రోజు వేడుకల్లో యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారులు పాల్గొనడం, ఆమెతో కేక్ కట్ చేయించి చప్పట్లు కొట్టడం పెను దుమారం రేపింది. ఆ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయి సదరు పోలీసు అధికారులకు చార్జి మెమోలు కూడా జారీ చేశారు. ఇక తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ఆస్మిత్రెడ్డి ఇసుక తవ్వకాల వ్యవహారంలో అక్కడి సీఐ తన మాట వినలేదన్న కోపంతో ధర్నాకు దిగారు. ఆ పోలీస్ సీఐ తనకు సారీ చెప్పాల్సిందేనని హంగామా చేయడంతో చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బలవంతంగా ఆ సీఐతో వీడియో కాల్లో సారీ చెప్పించారు. ఈ వ్యవహారం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అలాగే గుంటూరు ఎమ్మెల్యే మాధవి భర్త గళ్లా రామచంద్రరావు.. తమకు చెందిన నాలుగెకరాల పొలాన్ని తక్కువ ధరకే అమ్మాలని, లేదంటే బైక్తో ఢీకొట్టి చంపేయడానికి ప్రయత్నించారని పీసనపాడుకు చెందిన కె. వెంకట్రావు అనే రైతు

నేరుగా కోర్టులోనే ఫిర్యాదు చేసిన వైనం కూడా రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఇవన్నీ సీరియల్గా జరుగుతున్న తరుణంలో తాజాగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్.. గబ్బర్ అనే రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనకు కేక్ను కూడా తినిపించారు. గతంలో ఈ రౌడీషీటర్ను పట్టణ బహిష్కరణ చేయాలంటూ శ్రీకాకుళం పట్టణ వర్తకులు, వ్యాపారులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఇప్పుడు అదే రౌడీషీటర్తో ఎమ్మెల్యే అంటకాగుతున్నారంటూ పట్టణ వాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీటరు ఎమ్మెల్యే కేక్ తినిపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా టీడీపీ అధికారంలోకి వచ్చాక అదుపు తప్పుతున్న తమ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల అతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనంతో ఉన్నట్టు చెబుతున్నారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఇన్నాళ్లూ తెచ్చుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. వారు చేస్తున్న పనుల వల్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంద'ంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి వాటిని సహించబోనని ఒకింత ఘాటుగానే హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఈ ఘాటు హెచ్చరికలు ఇలాంటి వారిలో మార్పు తెస్తాయా? లేదా? అన్నది చూడాలి! 

Tags:    

Similar News