TIRUMALA || ఏకశిలానగరం ఒంటిమిట్టలో నిత్యాన్నదానం
జర్మన్ షెడ్ల కింద ఆగష్టు నుంచి అందుబాటులోకి తెస్తామంటున్న టీటీడీ ఈఓ.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-07-14 13:30 GMT
"తిరుమల తరహాలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద టీటీడీ నిత్యాన్నదాన పథకం అమలు చేయనుంది"
ఒంటిమిట్ట వద్ద ప్రస్తుతం రోజుకు 1500 మందికి మాత్రమే ఈ సదుపాయం అందులో ఉంది. వంద కోట్ల రూపాయాలతో మరింత విస్తృతం చేయనున్నారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో సోమవారం తిరుపతి జేఈవో వి. వీరబ్రహ్మం, ఇంజినీరింగ్ అధికారులతో ఒంటిమిట్ట వద్ద శాశ్వతి అన్నదాన ప్రసాదాల కేంద్రం ఏర్నాటుపై ఈవో శ్యామలరావు సమీక్షించారు.
"ఈ ఏడాది ఆగస్టు నుంచి ఒంటిమిట్ట ఆలయం వద్ద అమలు చేయడానికి ఏర్పాట్లు చేయండి" అని టిటిడి ఈఓ జే. శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
ఇదీ ప్రేరణ
తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని 1995 ఏప్రిల్ ఆరవ తేదీ మాజీ సీఎం ఎన్టీ రామారావు పాత కల్యాణకట్ట వద్ద రెండువేల మందితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత
తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరగడంతో అన్న ప్రసాదాల కేంద్రాలను కూడా విస్తరించారు.
తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం తో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, రెండు కంపార్ట్మెంట్లు, బయట క్యూలో వేచి ఉండే యాత్రికులు, పబ్లిక్ ఎమునిటీస్ కాంప్లెక్స్-1,2 (PAC) ప్రాంతాల్లో కూడా రోజుకు 2.5 లక్షల మందికి టీటీడీ అన్న ప్రసాదాలను అందిస్తుంది. ఆ తర్వాత తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద కూడా అన్నదాన కేంద్రాలను టీటీడీ విస్తరించింది.
ఉమ్మడి రాష్ట్రంలో భద్రాద్రి రామాలయం శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించేవారు. రాష్ట్ర విభజన తర్వాత కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని ఆంధ్రా భద్రాద్రిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కడప జిల్లాలో జాతీయ రహదారికి పక్కనే ఉన్న శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని కూడా టీటీడీ తీసుకుంది. దీంతో ఒంటిమిట్ట ఆలయానికి ప్రాధాన్యత ఏర్పడింది.
సీఎం సూచన
ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు ముత్యాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ జరిగిన కోదండరాముడి కళ్యాణోత్సవానికి సీఎం ఎన్. చంద్రబాబు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ,
"ఒంటిమిట్ట వద్ద కూడా తిరుమల తరహాలోనే అన్న ప్రసాదాల వితరణ కేంద్రం ఏర్పాటు చేయండి" అని టిటిడి అధికారులకు సీఎం చంద్రబాబు సూచన చేశారు.
ఒంటిమిట్ట ఆలయం వద్ద శాశ్వత అన్నదాన కేంద్రం ఏర్పాటు కోసం ఈ ఏడాది మే నెలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. ఆ నిర్ణయాల మేరకు..
ఈఓ సమీక్ష
శాశ్వత నిత్యాన్నదాన పథకం అమలు చేయడానికి వీలుగా టీటీడీ ఈఓ శ్యామలరావు ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం సమీక్షించారు. టీటీడీ ఎఫ్ ఎ అండ్ సీఈవో ఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ టీవీ. సత్యనారాయణ, ఎస్సీలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, తిరుమల అన్న ప్రసాదం విభాగం డిప్యూటీ ఈవో రాజేంద్ర కుమార్, మిగతా అధికారులతో సమీక్షించారు.
"ఒంటిమిట్ట వద్ద ఆగస్టు నుంచి నిత్యాన్నదాన పథకం ప్రారంభం కావాలి. దీనికోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయండి" అని ఈవో శ్యామలరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఒంటిమిట్ట వద్ద అన్న ప్రసాదాల వితరణ చేయడానికి వీలుగా ఇంజనీరింగ్ ఇతర శాఖ అధికారులు తిరుమలలోని అన్నప్రసాదం విభాగం అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఈవో సూచించారు."యాత్రికులకు అన్నప్రసాదాలు వితరణ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వంట సామాగ్రి, అవసరమైన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నందుకు సంసిద్ధం కావాలి" అని ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు.
పరిమితి ఎంత?
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం వద్ద తిరుమల గృహాలు అమలు చేసే నిత్యాన్నదాన కార్యక్రమం పై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు.
కడప మీదుగా తిరుమలకు వచ్చే యాత్రికులు కచ్చితంగా కోదండ రామస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరుమల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కూడా కోదండ రాముని దర్శనం అనంతరం బయలుదేరి వెళుతుంటారు. వారికోసం
టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి రెండేళ్ల కిందట ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రంలో ప్రస్తుతం 1,500 మందికి అన్నప్రసాదాలు వడ్డిస్తున్నారు. దీనిని మరింత శాశ్వతం చేయనున్నారు.
వసతి
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయాన్ని టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత విస్తృత ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా ఇక్కడ యాత్రికులకు వివిధ రకాల గదులను కూడా అందుబాటులో ఉంచింది. తిరుమల తరహాలోని యాత్రికుల కోసం అన్ని వసతులతో గదులను అందుబాటులో ఉన్నాయి.
ఒంటిమిట్ట ఆలయం వద్ద టీటీడీ ఓ కళ్యాణ మండపాన్ని అందుబాటులో ఉంచింది. ఇక్కడ యాత్రికుల కోసం 19 గదులను నిర్మించారు. అందులో 19 ఏసీ గదులు (అద్దె 900), నాలుగు సూట్లు (అద్దె 1,200) అందుబాటులో ఉంచారు.
రాష్ట్ర పర్యాటక శాఖ కూడా రోజుకు రూ.1,400 అద్దెతో నాలుగు గదులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచింది.
టీటీడీ ఒంటిమిట్ట ఆలయాన్ని ఆధీనం లోకి తీసుకున్న తర్వాత యాత్రికులకు వసతులు కూడా అందుబాటులో ఉంచింది. నిత్య అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా మరింత అభివృద్ధికి టీటీడీ విచారణ తీసుకుంటుంది.