TTD AD Building | 'ముంతాజ్ హోటల్' వద్దని దీక్షకు దిగిన స్వామీజీలు
టీటీడీ పరిపాలనా భవనం వద్ద స్వామీజీలు ఆమరణదీక్షకు దిగారు. వారాహి డిక్లరేషన్ అని ప్రకటించిన కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-02-12 04:55 GMT
తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని సాధు పరిషత్ డిమాండ్ చేసింది. అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సాధువులు బుధవారం తెల్లవారుజాము నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ముందు ఆమరణ దీక్షకు దిగారు.
వైసిపి ప్రభుత్వ కాలంలో తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్ కు భూమి కేటాయించారు.
అలిపిరి కి సమీపంలోని ఒబెరాయ్ గ్రూప్ హోటల్స్ పేరుతో ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ కు భూమి కేటాయించడం వివాదాస్పదంగా మారింది. పైసా హోటల్ నిర్మాణానికి 2021లో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి 2021 నవంబర్ 24న జీవో నెంబర్ 24 జారీ చేసి నాలుగేళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని కూడా అందులో పేర్కొంది. ఆ మేరకు అక్కడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఆధ్యాత్మిక నగరం అది కూడా శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ ( Mastumtaz Hotel ) ఏమిటి అంటూ హిందూ సంఘాలు అనేక సందర్భాల్లో నిరసనలు వ్యక్తం చేశాయి ఆందోళన కూడా దిగాయి.
శ్రీకాకుళం కు చెందిన ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామీజీలు, హిందూ సంఘాలు టిటిడి పరిపాలన భవనం (Tirumala Tirupati Devasthanams )ముందు ఆమరణ దీక్షకు దిగారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి పూజల అనంతరం ఈ దీక్షను సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా సాధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
"ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి"అని శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెప్పారు. హిందుత్వ నినాదంతో ఉపన్యాసాలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "వారాహి డిక్లరేషన్ అని కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు" అని ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉన్న కొండ దిగువన ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయించే బాధ్యత తీసుకోవాలని కూడా ఆయన పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వామీజీలు మాతాజీలు నిరసన దీక్షలో కూర్చున్నారు. సంకీర్తనలు, భజనలతో స్వామీజీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.