2019 రిజల్టు తిరగబడుతుందా ?

10.30 గంటల కౌంటింగ్ సరళిని గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి టీడీపీ కూటమి 147 సీట్లలో ముందంజలో ఉంది.

Update: 2024-06-04 05:18 GMT

ఇప్పటికి అందిన ఫలితాల ప్రకారం చూస్తే అంతిమఫలితం ఇలాగే ఉంటుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. 10.30 గంటల కౌంటింగ్ సరళిని గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి టీడీపీ కూటమి 147 సీట్లలో ముందంజలో ఉంది. వైసీపీ 24 నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్ లో ఉంది. కూటమి అభ్యర్ధుల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులే మంచి మెజారిటితోనే ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో జరుగుతున్నది నాలుగు, ఐదు రౌండ్ల కౌంటింగే అయినా చాలామంది టీడీపీ అభ్యర్ధులు మెజారిటితో కొనసాగుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి బుచ్చయ్యచౌధరి సుమారు 23 వేల ఓట్ల మెజారిటితో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ నుండే బుచ్చయ్య మెజారిటిలో ఉండటం గమనార్హం.

అదే విధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ళు మెజారిటితో కంటిన్యు అవుతున్నారు. టీడీపీతో పొత్తు కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ అభ్యర్ధులు కూడా ముందంజలో ఉన్నారు. జనసేన పోటీచేసిన 21 నియోజకవర్గాల్లో సుమారు 17 నియోజకవర్గాల్లో ప్రత్యర్ధులపై దూసుకుపోతున్నారు. ఇదే విధంగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మొత్తం 25 నియోజకవర్గాల్లో టీడీపీ 14 నియోజకవర్గాల్లో మెజారిటితో ఉండగా వైసీపీ 6 చోట్ల, బీజేపీ 3, జనసేన 2 నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని రౌండ్లలో కూడా కూటమి అభ్యర్ధులు ఇదేవిధంగా మెజారిటీతో ఉంటే 2019 ఎన్నికల ఫలితం తల్లకిందులైనట్లే అనుకోవాలి. అప్పుడు కూడా కౌంటింగ్ మొదలైన దగ్గర నుండి వైసీపీ అభ్యర్ధులు మంచి మెజారిటీలతో దూసుకుపోయారు. ఇపుడు అదేపద్దతిలో టీడీపీ కూటమి వైసీపీ అభ్యర్ధులపై స్పష్టమైన ఆధిక్యత చూపిస్తున్నారు.

Tags:    

Similar News