పిల్లల పేర్లతో.. ఓట్లకు గాలం

అమ్మఒడి పథకం ద్వారా ఓట్లు కొల్లగొట్టడానికి పార్టీలు మేనిఫెస్టోతో ఎర వేశాయి. ఇందుకు విద్యార్థుల భవిష్యత్తు వేలానికి పెట్టినట్టుంది.

Update: 2024-05-10 10:55 GMT

"ఏ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు" ఓట్లకు గాలం వేయడమే లక్ష్యంగా ఆ మాటను ప్రధాన పార్టీల నేతలు ఆచరిస్తున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. జగనన్న అమ్మఒడి పథకాల్లో అధికార, టిడిపి కూటమి పిల్లలను ఆసరాగా చేసుకుని తల్లుల ఓట్లు కొల్లగొట్టడానికి బేరంపెట్టాయి. ఇందులో "ఇద్దరు పిల్లలకు పథకం" ఇస్తామనే టిడిపి హామీ తల్లులను ఆలోచనలో పడేసింది. "ఇస్తే మంచిదే. నమ్మవచ్చు. అయితే, ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకుండా ఉంటే మేలు జరుగుతుంది, అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?" అని తిరుపతిలోని ఎన్జీవో కాలనీ చెందిన ఓ మహిళ వ్యాఖ్యానించింది. "పోయిన సంవత్సరం ఏం జరిగిందో చూశాం కదా" జగనన్న ఇచ్చింది ఫీజుల రూపంలో వసూలు చేసుకున్నారు" అని ఆమె గుర్తు చేశారు.

2024 ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో "అమ్మఒడి" పథకం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ ఒక్క అంశమే కాకుండా, టిడిపి కూటమి ప్రకటించిన మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని బిజెపి యుద్ధానికి ముందే చేతులెత్తేయడం ప్రస్తావనార్హం. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 2019: ఎన్నికల్లో " అధికారంలోకి రాగానే నవరత్న పథకాలలో భాగంగా, "అమ్మఒడి" ద్వారా ఏడాదికి ఇద్దరు పిల్లలకు రూ.15 వేలు ఇస్తాం" అని వైఎస్. జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే. పులివెందులలో కూడా ఆయన సతీమణి వైఎస్. భారతిరెడ్డి అదే హామీని ప్రచారం చేశారు.

తూచ్..!

"అమ్మ ఒడిలో ఒక బిడ్డకు మాత్రమే రూ. 15 వేలు ఇస్తామని చెప్పాం. అదే చేస్తున్నాం" అంటున్నారు. అందులో కూడా గత రెండేళ్లలో రూ. వెయ్యి కోత విధిస్తూ, రూ. 13 వేలకు తగ్గించారు. "మిగతా రూ. రెండు వేలు పాఠశాలల్లో పారిశుద్ధ్య మెరుగుదల, ఆ సిబ్బందికి వేతనం, తల్లిదండ్రులకు ప్రశ్నించే హక్కును కల్పించాం" అని సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. " ప్రభుత్వం ఇలా ఇచ్చింది. పాఠశాల కరస్పాండ్ అలా తీసుకున్నారు" అని ఓ తల్లి రాణి ఆవేదన చెందారు. ‘‘మాకు కావాల్సింది ఇది కాదు. ప్రభుత్వ బడులు పటిష్టం చేసే వరకు, ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయాలి’’ అని ఆమె కోరారు.

అమ్మఒడి పథకంతో..

రాష్ట్రంలో గత విద్యా సంవత్సరంలో పాఠశాలలతోపాటు విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం 58,950 స్కూళ్లలో 44,617 ప్రభుత్వ, 13,249 ప్రైవేటు, 1,084 ప్రైవేట్ ఎయిడెడ్ మదరసాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 72,20,633 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ, ఇతర ఉద్యోగ రంగాల్లో ఉన్న వారి పిల్లలను మినహాయించి 2020 జనవరి 9వ తేదీ తన మానస పుత్రికల్లో ఒకటైన అమ్మఒడి పథకానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 43 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లోకి ఏటా రూ. 6,455.80 కోట్లు బటన్ నొక్కడం ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. 2023- 24 విద్యా సంవత్సరానికి ఆ పథకం అమలు కాలేదు. బడ్జెట్ కొరత వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనేది సమాచారం. ఏదిఏమైనా పేద విద్యార్థుల తల్లిదండ్రులకు సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకం ఉపశమనం కలిగించిందని భావించారు. గ్రామీణ పట్టణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులు "జగనన్న అమ్మఒడి" పథకానికి బాగా ఆకర్షితులయ్యారు.

మారిన మేనిఫెస్టో.. పెరగనున్న భారం

2024: ఎన్నికల్లో అధికార వైయస్సార్సీపి మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉంది. అధికారంలోకి రావాలని టిడిపి- జనసేన- బిజెపి కూటమి హోరాహోరీగా పోరాడుతోంది. జగనన్న ‘‘అమ్మఒడి పథకం’’లో ఆ మొత్తాన్ని రూ.15 వేలు కచ్చితంగా ఇస్తూ, ఇద్దరు పిల్లలకు వర్తింప చేస్తామని" టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ "సూపర్ -6" పథకాల్లో ప్రకటించడం తెలిసిందే.

దీనిని అమలు చేసి తీరుతామని టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి, ఎప్పుడు నుంచి అమలు చేస్తాం అనేది స్పష్టంగా చెప్పలేదు. కానీ వారు చెప్పింది అమలు చేయాలంటే బడ్జెట్ పెరుగుతుంది. అందులో, రాష్ట్రంలోని 72,20,633 విద్యార్థుల కోసం ప్రస్తుతం 6,455.18 కోట్లు ఖర్చు అవుతుంటే ఆ మొత్తం కాస్తా రెండింతలై రూ.12,911.60 కోట్లకు పెరిగే అవకాశం ఉంది.

సంపద సృష్టిస్తే..

దీనిపై మదనపల్లి ప్రాంతానికి చెందిన యుటిఎఫ్ సీనియర్ నేత.. ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు. ‘‘ఈ పథకం సాధ్యమే. ఇందులో సందేహం లేదు’’ అని అన్నారు. ఎందుకంటే, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినందు వల్ల, మా వేతనాలు కూడా ఆలస్యమయ్యాయి. ఇందుకోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన పరిశీలిస్తే.. సంపద సృష్టించి సంక్షేమం చేశారు. ఇప్పుడు కూడా సంపాదన సృష్టించడం ద్వారా ప్రజల సంక్షేమానికి పాటుపడతారనేది చరిత్ర చెప్పిన సత్యం" అని ఆ ఉపాధ్యాయ నేత విశ్లేషించారు.

కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన మరో ఉపాధ్యాయ సంఘం నాయకుడిని కూడా ఇదే విషయమై ప్రశ్నిస్తే.. " ఎన్నికల అప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పడం సర్వసాధారణం. కానీ, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే ఇది సాధ్యమే. 2014 ఎన్నికల తర్వాత అధికరంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు సంపద సృష్టించడం అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు.

ఫీజుల పెరుగుదలకు గేట్లు ఎత్తడమే

నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన ప్రణాళికలను అమలు చేయాల్సిన బాధ్యత పాలకులది. విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేసేందుకు ఉన్న అవకాశాలను పరిగణలోకి తీసుకోకుండా, ఫీజుల పెంపుదలకు గేట్లు ఎత్తుతున్నట్లు ఉంది. ప్రస్తుతం అమలు చేస్తున్న అమ్మబడి పథకం వల్ల ప్రైవేటు పాఠశాలలు చాలావరకు రాయితీలు ఇవ్వడం తగ్గించి వేశాయి. అంతేకాకుండా జర్నలిస్టులు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండే వ్యక్తులు, సంస్థలు, మాజీ సైనికులు వంటి వారికి ఇచ్చే రాయితీలను కూడా చాలా విద్యాసంస్థలు ఎత్తివేశాయి.

ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సొమ్ము ఎందుకు వదులుకోవాలనేది వారి దృక్పథంగా చెప్పకనే చెబుతోంది. "జర్నలిస్టులకు రాయితీలు ఇవ్వడానికి చాలా విద్యాసంస్థలు నిరాకరించాయి. డీఈవో లేఖ ఇవ్వనన్నారు. డివితో మాట్లాడి ప్రొసీడింగ్స్ మాత్రమే తీసుకున్నాం" అని చిత్తూరు జిల్లా సంఘం నేత ప్రసాద్ చెప్పారు. కొన్ని జిల్లాల్లో ఈ విషయమై ప్రైవేటు విద్యాసంస్థల సంఘం ప్రతినిధులు కోర్టు కేసులు కూడా వేశారని చెప్పారన్నారు.

"ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము రాయితీనే. ఇక మేము మళ్లీ రాయితీ ఎలా ఇవ్వగలమనే కొందరు వితండవాదం చేశారు. కానీ సంపద సృష్టించడం ద్వారా రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా, ఉచితం ఇవ్వడంతో పాటు ప్రైవేటు బడుల దోపిడీని అరికట్టేందుకు చట్టం కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని" ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 

కమిటీ నామమాత్రం

ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల దోపిడీని కట్టడి చేయడానికి " ఫీజుల రెగ్యులేషన్ కమిటీ"ని ఏర్పాటు చేశారు. విద్యా సంస్థల యాజమాన్యాల కోర్టుకు వెళ్లడంతో అంశం అలాగే ఉండిపోయింది. అమ్మఒడి పథకం అమలుకు ముందు, ఆ తర్వాత, అనేక విద్యాసంస్థలు ఫీజులు పెంచాయి. ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సొమ్ము తల్లిదండ్రులకు ఎందుకు దక్కాలి? అని భావించిన ప్రైవేటు విద్యాసంస్థలు కొన్ని ఫీజులు ఇష్టానుసారంగా పెంచాయి. దీనివల్ల ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే సొమ్ము దక్కకపోగా, అదనంగా భారం పడింది.

దీనిపై టీటీడీ ఉద్యోగి సతీష్ మాట్లాడుతూ,

" మాకు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఉద్యోగులనే కారణంగా రాయితీ కూడా ఇవ్వరు. పోనీ, పేద విద్యార్థుల తల్లిదండ్రులకైనా న్యాయం జరుగుతుందంటే అదీ లేదు" అని అన్నారు. అందుకు ప్రధాన కారణం.. అధికార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టిడిపి నేతలు, మద్దతు దారులకు ప్రైవేటు విద్యాసంస్థలు ఉన్నాయనే విషయం బహిరంగ రహస్యం. 2019 ఎన్నికల తర్వాత రాయితీలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు లేఖలు కూడా పంపారు. అయినా వాటిని ఖాతరు చేసిన దాఖలాలు చాలా అరుదు అని చెప్పవచ్చు.

"అప్పు చేసి పప్పు కూడు తినే కంటే.. కాయకష్టం చేసి పచ్చడి మెతుకులు తినొచ్చు" రెండో విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పే మాటను విశ్వసించవచ్చు అనేది స్పష్టంగా కనిపించింది. అంటే, ఆదాయం వచ్చే వనరులను అభివృద్ధి చేసి, ఆ సంపదతో ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధి చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసిన చాలామంది, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో దేనికి ఓటర్లు ఆమోదముద్ర వేస్తారు అనేది మరో రెండు రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News